Take a fresh look at your lifestyle.

సమాఖ్య స్ఫూర్తి కొరవడింది ..!

మన దేశంలో కొరోనా కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. ఇంకా ఎంత పెరుగుతుందో తెలియదు. కొరోనా గ్రాఫ్‌ ఆం‌దోళన కలిగిస్తోంది. కొరోనా పతాక స్థాయికి చేరుకుంది. ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. కొద్ది వారాలుగా రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనికి వ్యతిరేకంగా ఎలాంటి పోరు సాగుంచాలనేది రాజకీయ నాయకత్వం ప్రజలకు వొదిలేసింది . ఈ వైరస్‌ అతి స్వల్ప కాలంలోనే ఎక్కువ ప్రాంతాలకూ,ఎక్కువ మందికి వ్యాపించింది. అదే సందర్భంలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కొరోనా కారణంగా ఆర్థిక పరమైన సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. రాజకీయ నాయకత్వానికి ప్రస్తుత పరిస్థితి పెను సవాల్‌ ‌గా తయారైంది. వైద్యులు, పాలనా విభాగం అధికారులు, ఒకరేమిటి అందరికీ ఇదొక అగ్ని పరీక్షగా తయారైంది.ఇప్పుడు దేశంలో ముసురుకున్న సంక్షోభం కొరోనా వల్ల మాత్రమే కాదు. ప్రజలకూ వైద్య వ్యవస్థకూ మధ్య విశ్వాసం లేకపోవడం వల్ల ఏర్పడింది. కేంద్రమూ, రాష్ట్రాల మధ్య విశ్వాసాన్ని పెంచడంలో పెద్ద అగాధం ఏర్పడింది. అసలు ఈ రకమైన వాతావరణం వ్యాధి వ్యాప్తి కన్నా ఎక్కువ భయ పెడుతోంది. కొరోనాని జయించాలంటే ప్రజలకు వైద్య ,ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం పెరగాలి. అలాగే, రాజకీయ నాయకత్వంపైనా,అధికార నాయకత్వంపైనా ప్రజలకు మధ్య పరస్పరం నమ్మకం పెరగాలి.దేశంలో ఎన్నడూ లేని రీతిలో అతి పెద్ద లాక్‌ ‌డౌన్ను మార్చి 24వ తేదీన నాలుగు గంటల నోటీసుతో ప్రకటించారు. సహకార సమాఖ్య లో వివిధ రాష్ట్రాల మధ్య విశ్వాసాన్నీ,దేశంలో శాస్త్ర విజ్ఞాన, ఆరోగ్య వ్యవస్థల ప్రాధాన్యాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తగ్గించి ఈ లాక్‌ ‌డౌన్‌ ‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని ఫలితంగా సమష్టి నాయకత్వం పోయింది. సమష్టి నాయకత్వం వల్ల ప్రజల్లో విశ్వాసం ఏర్పడి ఉండేది. ఏ కార్యక్రమం చేపట్టినా వ్యవస్థీకృతంగా జరిగి ఉండేది. ఆర్థిక విషయాల్లోనూ సమన్వయంగా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా సాగి ఉండేది. ప్రజల ప్రతిస్పందన కూడా అదే తీరులో ఉండేది.

మన దేశంలో గడిచిన కొద్ది సంవత్సరాలుగా సమష్టి నాయకత్వం కొరవడింది. అన్ని విషయాల్లోనూ అంతే, జాతీయ నాయకత్వం రాష్ట్రాల హక్కులు , పరిధుల్లోకి చొచ్చుకుని వస్తోంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం ఆదేశాలను పాటించేందుకు సుముఖంగానే ఉన్నాయి. నేనే ప్రథముడ్ని అనే లక్ష్యంతో ముందుకు సాగేనాయకత్వాన్ని ఎవరైనా అనుసరిస్తారా..! కొరోనా వ్యాప్తి కి సంబంధించి సంభవించిన పరిణామాలను పరిశీలించండి. కోవిడ్‌ -19 ‌మొదటి కేసు జనవరి 30వ తేదీన మన దేశంలో నమోదు అయింది మార్చి 19వ తేదీ వరకూ ప్రభుత్వం దేశం నుంచి ప్రాణ రక్షణ మందులు, పరికరాలను ఎగుమతిని నిషేధించలేదు. ఏయే వస్తువుల ఎగుమతులను నిషేధించిందీ మూడు రోజుల తర్వాత జాబితా ప్రకటించారు. ఈ మధ్య కాలం ఎం త ముఖ్యమైనదో వేరే చెప్పనవసరం లేదు.ఇటువంటి ముఖ్యమైన కాలాన్ని ప్రభుత్వం వృధా చేసింది. మరో వంక ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ ‌కు వ్యతిరేకంగా అన్ని దేశాలూ వేగంగా స్పందించాయి. ఆలస్యం చేయడం వల్ల వచ్చే అనర్ధాలేమిటో విదేశాల్లో కట్టెదుట కనిపిస్తున్నప్పటికీ మన నాయకత్వం మాత్రం బాగా ఆలస్యం చేసింది.
లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. ఒక వంక వైరస్‌ ‌వ్యాప్తి భయం, మరో వంక ఆర్థిక పరమైన సమస్యలతో ప్రజలు తల్లడిల్లి పోయారు. ఒక వంక లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ప్రజలు, అన్ని రంగాల వ్యవస్థలు తీవ్రమైన ప్రభావానికి గురి కాగా, కేంద్ర నాయకత్వం మాత్రం ప్రజల సమస్యలు పట్టనట్టు మధ్యప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని పడగొట్టింది.ఇప్పుడు రాజస్థాన్‌ ‌లో గెహ్లాట్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రతిపక్షాలను బలహీనపర్చే కార్యక్రమం సాగిస్తోంది. ప్రతిపక్ష నాయకత్వాన్ని వేధింపులకూ, ఒత్తిళ్ళకూ గురి చేస్తోంది.

అనాలోచితంగా,అనుకోకుండా విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌ల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్న స్పృహ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. ప్రజలను బలవంతంగా కష్టాల కొలిమిలోకి నెట్టింది. హాస్పిటల్స్ ‌లో కొరోనా పరీక్షలు చేసే సదుపాయాలు లేవు, కిట్స్ ‌లేవు. రోగులకు తగినన్ని పడకలు లేవు. క్వారంటైన కేంద్రాలు లేవు. ఐసోలేషన్‌ ‌కేంద్రాలు లేవు. వైద్యుల పర్యవేక్షణ లో ఉండాల్సిన సదుపాయాలు లేవు. చాలా ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కూడా నేనే అన్నింటా ప్రథముణ్ణని చెప్పుకోవడానికి జాతీయ నాయకత్వం ఆసక్తి చూపుతోందంటే ప్రజల సమస్యల పట్ల ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. కొరోనా వైపరీత్య కాలంలో కూడా సొంత ఇమేజ్‌ ‌పెంచుకునే ప్రయత్నాలను జాతీయ నాయకత్వం అనుసరిస్తోంది. నాయకత్వం ప్రాథమిక లక్ష్యం జనం ఇబ్బందులను తొలగించడం, అయితే, మన నాయకత్వం మాత్రం తన బాధ్యతలను సీరియస్‌ ‌గా తీసుకోవడం లేదు. ఫలితంగా లక్షలాది మంది ప్రజలు కొరోనా కోరల్లో చిక్కుకుని విలవిల లాడుతున్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించనిదే కొరోనాను జయించడం సాధ్యం కాదు.ముఖ్యంగా కేంద్ర నాయకత్వం పట్ల , వైద్య వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడినప్పుడే కొరోనా అదుపులోకి వొస్తుంది. వైరస్‌ ‌దేశ మంతటా అతివేగంగా వ్యాపిస్తుండగా జాతీయ నాయకత్వం మాత్రం తానే ప్రథముడిననే ధోరణిలో ఆకర్షణీయ మైన నినాదాలతో, హావభావాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తోంది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందరినీ సంప్రదించడం, అందరి సలహాలను స్వీకరించడం వంటి సమష్టి బాధ్యతలను విస్మరిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply