- బంద్ కు పిలుపునిచ్చిన కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్
- 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతిచ్చాయన్న సీఏఐటీ
ఈ నెల 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఇచ్చిన పిలుపునకు దాదాపు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు పలికాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని సమీక్షించాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొత్త ఈ-వే బిల్లు విధానాన్ని, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు ఆలిండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోనియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ఏకరీతిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీడబ్ల్యూఏ డిమాండ్ చేస్తోంది.ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య మాట్లాడుతూ, అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతిస్తున్నట్లు ధ్రువీకరించాయన్నారు.
డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఒక రోజు బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండాలన్నారు. డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు. సీఏఐటీ ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. జీఎస్టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. మేజర్ ఈ-టెయిలర్స్ ఈ-కామర్స్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని తెలిపింది. జీఎస్టీ స్ట్రక్చర్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి సిఫారసులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీలో సీనియర్ అధికారులు, సీఏఐటీ ప్రతినిధులు, ఇండిపెండెంట్ ట్యాక్స్ ఎక్స్పర్టస్ను నియమించాలని కోరింది.