Take a fresh look at your lifestyle.

దంచికొడుతున్న ఎండలు

  • ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత
  • నిప్పుల కొలిమిలా దేశ రాజధాని
  • ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు
  • పలు రాష్ట్రాల్లో వేడిగాలులతో ఉక్కపోత
  • తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల భయం
  • రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు కరోనా వైరస్‌తో, మరోవైపు అత్యధిక ఎండవేడిమితో పోరాడుతోంది. లాక్‌డౌన్‌ 4.0‌లో కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ జనం అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అవస్థలు పడుతున్నారు. రాజధానిలో ప్రస్తుతం 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు దాటాయి. అదే విధంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బీహార్‌ ‌ఢిల్లీలలో వేడి గాలులు వీస్తున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చేవారంలో కూడా ఇదే స్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశాలున్నాయి. అమ్ఫాన్‌ ‌తుఫాను తరువాత ఉత్తర, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌, ‌రాజస్థాన్‌లలో సోమవారం వరకు వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌, ‌విదర్భ, తెలంగాణలో ఆదివారం వరకు ఇటువంటి పరిస్థితులు కొనసాగనున్నాయి. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం ఏడుగంటలకే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఫలితంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ఉదయం 7గంటలకే ఇంటి నుంచి అడుగుబయటపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మధ్యాహ్నం అయితే.. నిప్పుల వర్షం కురిసినట్టే అనిపిస్తోంది.

ఇక శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మొత్తంగా రాష్ట్రంలో భానుడు భగభగమన్నాడు. శుక్రవారం నాలుగు చోట్ల తీవ్ర వడగాడ్పులు, పలుచోట్ల వడగాడ్పులు నమోదయ్యాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ ‌మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా ప్రకటిస్తారు. 47 డిగ్రీలు, ఆపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లె మండలం పెంట్లాం, నల్లగొండ జిల్లా అనుములు హాలియా మండలం హాలియా, అదే జిల్లా కనగల్‌, ‌పెద్దపల్లి జిల్లా మంథనిలలో ఏకంగా 47 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. అలాగే ఖమ్మం, కొల్వి, ధర్మపురి, దామరచర్ల, దుమ్ముగూడెం, మొగుళ్లపల్లి, జైనా, జూలూరుపాడు, ఏన్కూరు, పాత ఎల్లాపూర్‌, ‌సోన్‌ ఐబీ, మామిడాల, జన్నారం, భోరాజ్‌, ‌నామాపూర్‌, ‌బొమ్మిరెడ్డిప్లలె, ఉర్లుగొండల్లో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. ఇక ఆదిలాబాద్‌, ‌నల్లగొండ, నిజామాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, ‌మెదక్‌, ‌రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడ్డారు. అనేకమంది విలవిలలాడిపోయారు. త్తర బంగ్లాదేశ్‌ ‌దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్‌, ‌కొమురంభీం, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌నల్లగొండ, సూర్యాపేట.. మొత్తంగా 17 జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.

ప్రధానంగా ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీంఆసిఫాబాద్‌, ‌నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైనట్టు పేర్కొన్నారు. ఖమ్మంలో 46 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు, భద్రాచలం, హన్మకొండలో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీలు, మెదక్‌లో 43.8 డిగ్రీలు, నల్లగొండలో 45 డిగ్రీలు, నిజామాబాద్‌లో 44.9 డిగ్రీలు, రామగుండంలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అనసవరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటికే పరిమితం కావాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువగా నీళ్లు తాగాలని చెబుతున్నారు. గొంతు ఎండిపోకుండా తరుచూ నీళ్లు తాగాలని, లేనిపక్షంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వేసవిలో ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారిని తరుచూ గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు. మధ్యాహ్నం మజ్జిగ తాగితే మంచిదని చెబుతున్నారు. ఎక్కువగా కొబ్బరినీళ్లు, వివిధ పండ్ల రసాలు తీసుకోవాలని, శీతలపానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఖమ్మం : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ ఖమ్మం జిల్లా ఎప్పటిలాగే తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడ భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఎండల వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగింది. మరికొన్ని రోజులు భానుడి ప్రతాపం తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పట్టణంలో లాక్‌డౌన్‌ ఆం‌క్షలు ఎత్తేసినా ప్రజలు బయటకు రాకపోవడంతో వీధులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు.

Leave a Reply