Take a fresh look at your lifestyle.

నూతన వ్యవసాయ చట్టాలతో.. రైతులకు తీరని నష్టం..కార్పొరేట్లకు అనుకూలం

  • కేంద్రం వద్ద సరైన సమాధానమే లేదు
    మంత్రి హరీష్‌రావు
  • రైతుల పోరాటానికి మద్దతుగా చిన్నకోడూరు మండల సభ ఏకగ్రీవ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి కార్పోరేట్‌కు అనుకూలంగా వ్యవహారిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్‌ ఎం‌పిడివో కార్యాలయంలో గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌ముఖ్య అతిథిగా హాజరై మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక బిల్లును చిన్నకోడూర్‌ ‌మండల సర్వ సభ్య సమావేశం సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నదని తీర్మానం చేసినట్లు మండల ఉపాధ్యక్షుడు కీసర పాపయ్య ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. దేశంలోని 5 రాష్ట్రాల నుంచి 99 వేల ట్రాక్టర్లలో రైతులు ఢీల్లీకి కదిలివొచ్చి సమ్మె చేస్తూ నిరసన తెలుపుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనను అణిచివేసే ప్రయత్నంలో 5 మంది రైతులు మృతిచెందారని, వీరిలో ముగ్గురు వాటర్‌ ‌క్యాన్‌ ‌తగిలి, మరో ఇద్దరు చలి తీవ్రతతో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన 5 మంది రైతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి రాత పూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విరమిస్తామని రైతులు తెలిపితే.. కేంద్రం నుంచి సరైన సమాధానమే లేదన్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉచితంగా కరెంటు సరఫరా చేస్తూ..రైతులు పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తామంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చి రైతులను అణిచి వేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రైతులకు సంపూర్ణ మద్దత్తు తెలుపుతూ చిన్నకోడూర్‌ ‌మండల సర్వ సభ్య సమావేశం తీర్మానాన్ని స్వాగతించారు.  బీజేపీ నూతన వ్యవసాయ చట్టాన్ని తెచ్చి రైతులను తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.

 

Leave a Reply