Take a fresh look at your lifestyle.

370‌వ అధికరణం కోసం ఫరూక్‌ ‌చైనా మద్దతు కోరడం దుర్మార్గం

కాశ్మీర్‌లో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేసినందుకు అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వొచ్చాయి. వీటిని మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్‌ ‌ఫరూక్‌ అబ్దుల్లా ఒకే వేదిక మీదకు తెచ్చినందుకు సంతోషిస్తూ ఉండవచ్చు. కానీ, కాశ్మీర్‌ను పొరుగు దేశాల చేతుల్లో పెట్టేందుకు ఆయన వేస్తున్న అడుగులు దోహదం చేస్తాయన్న విషయాన్ని మరిచి పోతున్నారు. కాశ్మీర్‌లో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది ఫరూక్‌ ‌కుటుంబమే. రాజ వంశం మాదిరిగా షేక్‌ అబ్దుల్లా నుంచి ఒమర్‌ అబ్దుల్లా వరకూ దీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన అబ్దుల్లా కుటుంబం ఇప్పుడు కాశ్మీర్‌ ‌వెనకబాటుతనాన్ని గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆనాడు తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత పాలకుల వరకూ కాశ్మీర్‌ని అభివృద్ది చేస్తారనే అబ్దుల్లా కుటుంబం చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. ఇప్పుడు కాశ్మీర్‌ అభివృద్ది కోసం 370వ అధికరణాన్ని పునరుద్ధరించడం కోసం చైనాతో చేతులు కలిపేందుకు ఫరూక్‌ అబ్దుల్లా సిద్ధపడుతున్నారంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం వంటిదే. ఫరూక్‌ ‌కేంద్రంలో మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను సాధించుకున్నారు. అయినప్పటికీ ఆయన 370వ అధికరణంతోనే కాశ్మీర్‌ అభివృద్ది సాధ్యమని నమ్ముతున్నారంటే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి వొస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్‌, ‌వాజ్‌పేయి ప్రభుత్వాలు ఫరూక్‌ అబ్దుల్లా ఏది కోరినా మంజూరు చేశాయి. అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారు. పైగా, కాశ్మీరీ పండిట్లపై దాడులు పెరగడంతో వారు ఉన్న ఆస్తి, పాస్తులను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. రాష్ట్రంలో ఇప్పటికీ కాశ్మీరీ పండిట్లు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నారు. కేంద్రం బలగాలను మోహరించి ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తోందంటూ కాశ్మీరీ పార్టీలు ఆరోపించడంలో న్యాయం లేదు. కేంద్ర బలగాలు ఉంటేనే కాశ్మీర్‌లో సామాన్య ప్రజలకు భద్రత లేదు. వేర్పాటు వాదులతో చేతులు కలిపి ఇంతవరకూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిన పార్టీలు ఇప్పుడు కాశ్మీర్‌ ‌ప్రజల భద్రత గురించి మాట్లాడటం విడ్డూరమే. ఇంతవరకూ కాశ్మీర్‌పై పాక్‌ ‌మాత్రమే కన్నేసింది. ఇప్పుడు చైనా కూడా కాశ్మీర్‌ను కబళించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. చైనా అయితే, 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తుందంటూ ఫరూక్‌ ‌మాట్లాడటాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి. చైనా ఇప్పటికే ఆక్రమిత కాశ్మీర్‌ ‌లోనూ, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోనూ ఆక్రమణలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయం ఫరూక్‌కి తెలియంది కాదు. అయినప్పటికీ చైనా జోక్యాన్ని ఆయన కోరుతున్నారంటే, రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుంది.

ఫరూక్‌ అబ్దుల్లా మాదిరిగానే సాజిద్‌లోనే అనే కాశ్మీర్‌ ‌నాయకుడు తాము ఇక్కడే ఉంటామనీ, ఎవరితోనూ కలవమని ప్రకటించారు. కాశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్భాగమేనని ఫరూక్‌ ‌చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనలను మరిచి పోయి ఇప్పుడు చైనా సాయం కోరతాననడం పచ్చి అవకాశవాదం. ముఫ్తీ మహ్మద్‌ ‌సయీద్‌ ‌నెలకొల్పిన పీపుల్స్ ‌డెమోక్రాటిక్‌ ‌పార్టీ(పీడీపీ) మొదటి నుంచి వేర్పాటువాదుల అనుకూల వైఖరిని అనుసరిస్తోంది. ఫరూక్‌ ‌మాత్రం తానొక జాతీయవాదిగా ప్రకటించుకోవడానికి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తున్నారు. అటువంటి నాయకుడు ఇప్పుడు చైనా మంత్రాన్ని పఠించడం న్యాయం కాదు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ 370వ అధికరణం రద్దుపై తమను పరిగణనలోకి తీసుకోలేదన్న అసంతృప్తి ఫరూక్‌ ‌లో ఉండవచ్చు. అది సహజమే. మోడీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి ఉంటే దేశంలో ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి కేంద్రంపై వొత్తిడి తేవడం ఒక పద్దతి. దానిని పాటించకుండా చైనాను సమర్థించడం భారతీయులెవరికీ ఎంత మాత్రం అంగీకారం కాదు. చైనా ప్రస్తుతం మన దేశంపై తెస్తున్న వొత్తిడులను చూసైనా ఫరూక్‌ ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని చైనా విమర్శించడం విడ్డూరమే. లడఖ్‌లోకి తన సైనికులను అక్రమంగా చైనా పంపుతోందన్న ఆరోపణలు అసత్యం కాదు.

సోమవారం నాడు ఒక చైనా సైనికుణ్ణి భారత భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. లడఖ్‌ ‌తూర్పు ప్రాంతంలో గాల్వానా లోయలో మన హద్దుల్లో రోడ్డు నిర్మాణాన్ని మన దేశం చేపడితే చైనా అభ్యంతరం తెలపడం కూడా విడ్డూరంగానే ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే, ఆవలి వైపున చైనా సైనికుల కదలకలూ, కుహకాలు బయటపడతాయన్న బెదురు చైనా పాలకుల్లో ఉంది. మన హద్దుల్లోకి చొచ్చుకుని వొచ్చేందుకు ప్రయత్నించడం వల్లనే గాల్వాన్‌ ‌లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్‌ ‌లో ఘర్షణ జరిగింది. ఇంతవరకూ కాశ్మీర్‌ ‌కోసం పాకిస్తాన్‌ ‌ప్రత్యక్షంగా పోరాడింది. ఇప్పుడు చైనా ముందుండి పాక్‌ని రెచ్చగొడుతోంది. భారత్‌లో భారీ పేలుళ్ళ కుట్రకు ఆక్రమిత కాశ్మీర్‌ ‌నుంచి ఉగ్రవాదులను పంపేందుకు పాక్‌ ‌సైన్యం జరిపిన యత్నాలను మన సైన్యం అడ్డుకుంది. ఇలాంటి ఘటనలన్నీ చైనా సాయం, ప్రోద్బలంతోనే పాక్‌ ఒడిగడుతున్నట్టు రుజువులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో భారత్‌లో తాము అంతర్భాగమని చెప్పుకునే వారు భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించే యత్నాలను అడ్డుకోవాలి. అటువంటి ప్రయత్నాలకు పాల్పడుతున్న దేశాలను శత్రుదేశాలుగానే పరిగణించాలి. నరేంద్రమోడీ తీసుకునే నిర్ణయాలను విభేదించేవారు కూడా దేశ సమైక్యత విషయంలో అంతా ఒకటి కావాలనే కోరుతున్నారు. ఫరూక్‌ ఎం‌తో అనుభవం, పాలనా సామర్థ్యం ఉండి కూడా కాశ్మీర్‌ని పరాయి దేశం చేతులలో పెట్టే రీతిలో ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

Leave a Reply