- మూర్ఖులుగా నిలిచిపోకండి.. సెలబ్రిటీలకు శాపనార్థాలు
- కేంద్ర ప్రభుత్వంపైనా మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. రైతులు పంట పండించడమంటే సినిమాల్లో డైలాగ్స్ చెప్పినట్లు, డ్యాన్స్ చేసినట్లు, క్రికెట్లో సిక్స్‌లు కొట్టినంత ఈజీ కాదనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారమిక్కడ ఆయన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నిర్బంధించి, భారతదేశంలో ఉన్న రైతును ఆర్ధికంగా నడ్డి విరిగేలా చట్టాలు తీసుకొచ్చిందనీ మండిపడ్డారు.. బిజెపి పార్టీ ప్రభుత్వానికి గత రెండు నెలలుగా చలిలో, దుమ్మూధూళి, రాత్రి, పగలు, వయసుకు తేడా లేకుండా 10 ఏళ్ల నుండి వందేళ్ల వయసు కలవారు పిల్లలు, యువతీ యువకులు వారి తల్లితండ్రులు మొత్తం ఢిల్లీలో దీక్షలు చేస్తున్నా కేంద్రంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు.
రైతులు ఎన్నో వ్యయ ప్రయోసాలు పడి పండించిన పంటని మనం తింటూ.. జీవితాన్ని అనుభవిస్తూ ఆ రైతు ఉద్యమాలు చేస్తుంటే వీరికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతుగా, అండగా ఉంటే, బిజెపి, టిఆర్ఎస్ రెండంటే రెండే పార్టీలు ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తుండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రైతులు పండించిన పంటను తింటూ ఆ రైతుల పోరాటాన్ని తక్కువ చేసి కొంతమంది ఫిల్మ్, క్రికెట్ సెలబ్రిటీలు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ముఖానికి రంగులు వేసుకొని సినిమాలో పనిచేయడం, ఒక క్రికెటర్ బ్యాట్ పట్టుకొని మైదానంలో క్రికెట్ అడటం రైతు భూమి మీద నాగలి పట్టి దున్నినంత సులువు కాదన్నారు. సినీ పరిశ్రమల్లో, క్రికెట్లో బ్రేక్‌లు, కూల్ డ్రింక్స్, టీలు,స్నాక్స్ ఇంటర్వెల్స్ ఉంటాయనీ, మీరు ఆడుతుంటే, పడుతుంటే చప్పట్లు తో ప్రోత్సాహం ఉంటుంది. కానీ, పొలంలో నాగలి పట్టి దున్ని పంటలు పండించే రైతుకు ఇలాంటి సదుపాయాలు ఉండవన్నారు. అందరి ఆకలిని తీరుస్తూ…కడుపు నిండా అన్నం పెట్టే అలాంటి రైతులని కొందరు సెలెబ్రెటీలు విమర్శించడం సిగ్గు చేటన్నారు.
ఒక పరాయి దేశస్థులు ఎవరైతే రైతులకు మద్దతు ఇచ్చారో ఆ సెలెబ్రెటీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన రైతుల ఉద్యమాన్ని చులకన చేసి మాట్లడిన సెలబ్రిటీలు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. మద్దతు ఇవ్వకపోగా, విమర్శలు చేస్తారా? మీకు సిగ్గు అనిపించడం లేదా?అని జగ్గారెడ్డి మండిపడ్డారు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, యాక్టర్లు కంగనా అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ మీరందరు ఒక్కసారి నాగలి పట్టి భూమి దున్ని ఇత్తులేసి, నీరు పోసి పంట పండించగలరా?అని ప్రశ్నించారు. నాగలి పట్టి, పొలం దున్ని పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు.. సినీ పరిశ్రమలో డైలాగ్, డాన్స్ చేసినంత సులువు కాదన్నారు.
కొందరు సినిమా సెలెబ్రిటీలు రైతుల కష్టాల మీద, రైతు పండించిన పంటకు మద్దతు ధర లేకనో, అకాల వర్షాలకో, నకలీ విత్తనాలకో, ఎరువులకో పంట నష్టపోయిన దాని మీద అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల మీద మీలాంటి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ కథనాల మీద సినిమాలు తీసి ఆ రైతు పేరు మీద సొమ్ము చేసుకోవడం లేదా?ఇది నిజమే కాదా?అని నిలదీశారు. మీరు చేసే మీ వృత్తిలో ఎన్ని కోట్లు సంపాదించిన చివరకు ఆ రైతు పండించిన పంటను తినే కదా మీరు బతికేది. ఈ మాత్రం జ్ఞానం కూడా మీకు లేదా? ఇంకా రైతుల పట్ల పిచ్చి కామెంట్లు చేయకండనీ, ఒకవేళ చేస్తే మాత్రం చరిత్రలో మూర్ఖులుగా నిలిచిపోతారనీ జగ్గారెడ్డి శాపనార్థాలు పెట్టారు.