భారీగా నష్టపోయిన అన్నదాతలు
పలు ప్రాంతాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు మరోసారి రైతులను నట్టేట ముంచాయి. చేతికొచ్చిన పంటను నేలపాలు చేశాయి. వడగండ్లు, ఈదురుగాలులతో కురిసిన వానలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కోతకొచ్చిన మక్క, వరి చేన్లు నేలకొరిగి పోగా.. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసుకున్న వడ్లు తడిసిపోయాయి. వాన నీటిలో కొట్టుకు పోయాయి. పక్వానికొచ్చిన మామిడి కాయలన్నీ రాలిపోయాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట్ జిల్లాలలో రైతులు భారీగా నష్టపోయారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంట అకాల వర్షాలకు ఆగమవుతుండడంతో లబోదిబోమని మొత్తుకుంటున్నారు. జనగామ జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి వరి పొలాల్లోకి వెళ్లారు. రైతులతో మాట్లాడి, ప్రభుత్వం ఆదుకుంటుందంటూ భరోసా కల్పించారు. కరీంనగర్ జిల్లాలో కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాలతో ఎన్నడూ లేని విధంగా పూర్తి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ స్థానిక యంత్రాంగంతో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించారు. రైతులలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షానే నిలబడుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వివిధ జిల్లాల్లోనూ దెబ్బతిన్న పంటలను మంత్రులు, అధికారులు పరిశీలించారు.