Take a fresh look at your lifestyle.

అన్నదాత అపూర్వ విజయం

ఇచ్చిన మాట పై కేంద్ర ప్రభుత్వం నిలబడుతుందా అనేది వేచి చూడాల్సిన విషయమే…
2020 సెప్టెంబరు ఈ మాసంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టబడి అత్యవసరంగా ఆమోదించబడ్డ మూడు వివాదాస్పదమైన వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో మెజారిటీ ప్రజలను ఆశ్చర్యపరిచారు. అయితే అయితే ఈ వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో ప్రవేశ పెట్టే సమయంలో ఇవి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా, ఈ దేశ రైతుల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చేవిగా, దేశ ఆర్థిక వ్యవస్థలో మరియు వ్యవసాయ రంగం లో అతి గొప్ప సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. అయితే ఓ పక్క ఈ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ‌శక్తులకు పెద్ద ఎత్తున లాభంచేకూర్చేవిగా ఉన్నాయని, ఇది ఒప్పంద వ్యవసాయం పేరుతో రైతును పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలకు, ఆహార తయారీ సంస్థలకూ రైతుల్ని బానిసలుగా చేసేవిగా ఉన్నాయని, ఒప్పంద వ్యవసాయం పద్ధతిలో మొదట రైతులకు స్వేచ్ఛ లభించినట్టు గా అనిపించినా కాలానుగుణంగా రైతుపై సదరు పరిశ్రమ లేదా సంస్థ ఒత్తిడి చేసే అవకాశం ఉంటుందని, ఈ దేశంలో ఎక్కువగా చిన్నకారు రైతులే ఉండడం వల్ల, పైగా గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు  ఆ వడ్డీ వ్యాపారిని కాదని తన పంట అమ్ముకునే పరిస్థితి ఉండదని, నిత్యావసర సరుకుల సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం సరుకులు నిల్వ చేసే బాధ్యత నుంచి తప్పించుకోవడం వల్ల ప్రైవేటు గిడ్డంగి వ్యాపారులు పెద్దమొత్తంలో పప్పులు దినుసులు నూనె గింజలు వంటి వాటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంటుందని దేశంలో చాలా మందితో పాటు ప్రతిపక్షాలు కూడా ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది.

వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి పంజాబ్‌ ‌హర్యానా ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమం మొదలు పెట్టిన సంగతి మనకందరికీ తెలిసినదే. కిందటి ఏడాది సెప్టెంబర్‌ ఈ ‌మాసంలో అత్యవసర ఆర్డినెన్సు ద్వారా ఆమోదించినటువంటి వ్యవసాయ బిల్లులను చట్టాలుగా ఆమోదిస్తూ జూన్‌ ‌నెలలో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే విచిత్రంగా జనవరి మాసంలో ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ మూడు వ్యవసాయ చట్టాలను వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర కాలం పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ చట్టం అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం నలుగురు నిపుణులతో కూడినటువంటి కమిటీ వేసింది. అంటే ఈ చట్టం అమలులో ఉన్న కాలం కేవలం 221 రోజులు మాత్రమే,బహుశా ప్రపంచ చరిత్రలో అతి తక్కువ కాలంలో అమలులో ఉన్న చట్టాల్లో ఇది కూడా ఒకటి కావచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ చట్టాల రద్దు కోసం జరిగినటువంటి రైతుల ఉద్యమం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం లో 80 శాతం పైగా ఉన్నటువంటి సన్నకారు రైతుల ప్రయోజనాలను కార్పొరేట్‌ ‌శక్తులకు తాకట్టు పెట్టి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై రైతుల విజయంగా పేర్కొనవచ్చు.

ఈ చట్టం తీసుకురావాలనే ఆలోచన మొదలైన రోజు నుండి అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయం మీద చేసే రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందా అనే చర్చ జరుగుతూనే ఉంది. భారత రాజ్యాంగంలో అధికార విభజనకు సంబంధించి 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన అధికారాల గురించి స్పష్టమైనటువంటి వివరణ ఉంది. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు చెల్లవని కేరళ పంజాబ్‌ ‌లాంటి రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల శాసనసభల్లో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశాయి.అప్పటివరకు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన అకాలీదళ్‌ ‌కూడా  కువ్యవసాయ చట్టాలనూ నిరసిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేసింది.అయితే మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక విచిత్రమైన వాదన  ముఖ్యంగా ఇక్కడ పరిగణించాలి, భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార విభజనలో భాగంగా ఇచ్చిన ఉమ్మడి జాబితాలో ఎంట్రీ నెంబరు 33ను ఉపయోగించి ఆహార పరిశ్రమ పేరుతో ఆహార ఉత్పత్తుల పేరుతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పేరుతో వ్యవసాయ చట్టాలను చేసి సమాఖ్య వ్యవస్థపూర్తికి పూలు పొడిచింది. వాస్తవానికీ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఎంట్రీ నెంబర్‌ 28 ‌రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యవసాయ సంబంధ పరిశ్రమలు స్థాపించే,వాటి పరిపాలన బాధ్యతలు చూసే అవకాశం రాష్ట్రప్రభుత్వాలకు కల్పిస్తుంది.

అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 వ్యవసాయ చట్టాలు నేరుగా రాష్ట్ర జాబితా మీద రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన హక్కుల మీద దాడి చేసినట్లు మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చిన చాలావరకూ సుప్రీంకోర్టు తీర్పులు రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని నొక్కిచెప్పడం జరిగింది.అలాగే రాష్ట్ర జాబితాలోని ఏ అంశము కేంద్ర జాబితాలోని ఈ అంశానికి లోబడి ఉండబోదని రాష్ట్రాల యొక్క స్వతంత్ర అధికారాన్ని సర్వోన్నత న్యాయస్థానం చాలా సందర్భాల్లో పేర్కొంది. రాష్ట్ర జాబితాలో వ్యవసాయం అనే పదం 15 సార్లు ఉండగా ఈ అంశాన్ని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా మూడు వ్యవసాయ చట్టాన్ని తీసుకురావడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది.పైగా ఒప్పంద వ్యవసాయం లోని అంశాలు రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ నెంబర్‌ 14 18 46 ‌వంటి వాటికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వ్యవసాయం అనేది దక్షిణ అమెరికా దేశాల్లో మరియు మన దేశంలోని పంజాబ్‌ ‌రాష్ట్రంలో తీవ్రంగా విఫలమైందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.సూత్రప్రాయంగా బిల్లులు బాగానే అనిపించినా ఒప్పంద వ్యవసాయంలో రైతుకు సదరు సంస్థకూ ఏమైనా తేడాలు వస్తే ఆ సమస్యను పరిష్కరించే యంత్రాంగం విషయంలో స్పష్టత లేదు, ఇది కూడా తీవ్ర నిరాశకు గురి చేసే అంశం.

ఈ శబ్దాలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన నాటి నుంచి నేడు రద్దు చేసే వరకూ అత్యంతప్రతిష్ఠాత్మకమైనవిగా, చిన్న రైతుల జీవితాల్లో వెలుగులు తెచ్చేవిగా పేర్కొంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా చట్టాలను రద్దు చేసే ఆలోచనను ప్రకటించడం ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. ఉద్యమం మొదలైన ఏడాది నుంచి చట్టాల రద్దు విషయంలో రైతు నాయకత్వంతో ఎన్నో చర్చలు జరిపిన ఒత్తిడితో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం మీరు చట్టాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం ఒక వింతగా అనిపిస్తుంది,ఈ అనుమానాలకు కారణాలు లేకపోలేదు. ఈ వ్యవసాయ చట్టాలను స్థానిక మార్కెట్‌ ‌వ్యవస్థ బలంగా ఉన్నటువంటి పంజాబ్‌ ‌హర్యానా ఉత్తర ప్రదేశ్‌ ‌పది రాష్ట్రాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు మనం లోగడ తెలుసుకున్నాము, కాబట్టి రాబోయే ఉత్తర ప్రదేశ్‌ ‌మరియు పంజాబ్‌ ‌రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి రైతాంగాన్ని ఆకర్షించే పనిలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక రకమైనటువంటి వ్యూహాన్ని ముందుకు తీసుకు వచ్చింది అనేది నిపుణుల మాట. ఏది ఏమైనా వ్యవసాయ చట్టాలనూ పార్లమెంటులో రద్దు చేసే వరకూ అలాగే కనీస మద్దతు ధర రాజ్యాంగబద్ధమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళననూ విరమించుకోవాలని రైతు ఉద్యమ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తన మాట మీద నిలబడుతుందా లేదా అనేది చూడాలి.
– పిల్లుట్ల నాగఫణి, అజీమ్‌ ‌ప్రేమ్‌ ‌జి విశ్వవిద్యాలయం బెంగుళూరు.

Leave a Reply