Take a fresh look at your lifestyle.

తొమ్మిది నెలల్లో ఆరువందలమంది మృతి…

మరో భారత్‌ ‌బంద్‌కు రైతు సంఘాల పిలుపు

భారతదేశంలో వ్యవసాయరంగాన్ని దుర్భర పరిస్థితికి నెట్టివేసేవిగా ఉన్న మూడు నూతన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో రాష్ట్ర రాజధాని సమీపంలో రైతులు చేపట్టిన ఆందోళన పదినెలలకు చేరుకుంది. అయినా కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోవడంగాని, వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో మరోసారి దేశ వ్యాప్తంగా తమ ఆందోళనను తెలియజేసేందుకు కిసాన్‌ ‌జాతీయ కన్వెన్షన్‌ ‌తీర్మానించింది.

ఈ విషయమై రైతులు ఆందోళన చేపట్టి సెప్టెంబర్‌కు పది నెలలు కావస్తున్న సందర్భంగా ఆ నెల 25న భారత్‌ ‌బంద్‌కు కన్వెన్షన్‌ ‌పిలుపునిచ్చింది. గత సెప్టెంబర్‌లో వ్యవసాయ రంగంలో మూడు నూతన చట్టాలను అమలు పరుస్తూ పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించడంతో ఈ వివాదం ఏర్పడింది. ఆనాటి నుండి ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు చేపట్టిన ఆందోళన క్రమేణ దేశవ్యాప్తంగా పాకింది. పంజాబ్‌, ‌హర్యానతోపాటు, యుపి, ఎంపి, రాజస్తాన్‌, ‌దక్షిణ ప్రాంత రైతాంగం కూడా అ ఆందోళనలో భాగస్వాములైనారు. ఎండ, వాన, చలి దేనికి భయపడకుండా దేశ రాజధాని బార్డర్‌లలో వీరు నేటికీ తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. మహమ్మారిలా వ్యాపించి, దేశంలో వేల సంఖ్యలో జన మరణానికి కారణమైన కొరోనా రెండవ వేవ్‌లో కూడా వీరు మొక్కవోని ధైర్యంతో తమ దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు.

విచిత్రమేమంటే మహిళా రైతులు కూడా వీరితో సమానంగా ఆందోళనలో పాల్గొనడం. ఎట్టి పరిస్థితిలో వ్యవసాయరంగంపై రూపొందించిన మూడు నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనని రైతులు నేటికీ మొండి పట్టుదలతో ఉన్నారు. అదొక్కటి దక్క అన్నట్లు వెనక్కు తీసుకోవడమన్న మాటను పక్కకు పెట్టి, అందులో చేర్పులు, మార్పులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఈ మేరకు 2020 అక్టోబర్‌ 14 ‌నుంచి 2021 జనవరి 22 వరకు దాదాపు ఈ రెండు వర్గాల మధ్య కనీసం పదకొండు సార్లు చర్చలు జరిగినా అవి ఫలవంతం కాలేదు. ఇరు పక్షాలు తాము పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అన్నసామెతగానే బీష్మించుకుని కూర్చున్నాయి. ఈ విషయంలో సుప్రీమ్‌ ‌కోర్డు జోక్యంకూడా ఫలించలేదు. ఈ చట్టాల అమలుపై స్టే ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు ప్రకటించిన కమిటీ ముందు హాజరు కావడానికి రైతు సంఘాలు తమ అయిష్టతను ప్రకటించాయి. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా చర్చలు ఏ మాత్రం ముందుకు సాగకుండా పోయాయి. ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్ది రైతు ఉద్యమం ఫలప్రదం అవుతూ వొచ్చింది. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కిసాన్‌ ‌విభాగాలు ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ వొచ్చాయి. అందులో భాగంగా జనవరి 26 ఎర్రకోటపై జాతీయ జండాతో పాటు రైతు జండాను ఎగురవేయడం పెద్ద ఆందోళనను కలిగించిన ఆంశం.

తమ దేశంలోని రైతులను కేంద్రం ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోలేకపోతున్నదంటూ, విదేశాలు కూడా విమర్శించడం ప్రారంభించాయి. అయినా సమస్య పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు పడకపోవడంతో ఎట్టిపరిస్థితిలో తాము ఆందోళన వీడేదిలేదంటున్నారు రైతు నాయకులు. కేంద్రంలో తిరుగులేని మెజార్టీ ఉండడం వల్లె బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితిలో కేంద్రం వెనక్కు తీసుకోవాల్సిందే నంటున్న నాయకులు, ఒక వేళ ఈ చట్టాలు అమలవుతే కార్పొరేట్‌ ‌శక్తుల కిందకు వ్యవసాయరంగం మారుతుందని, అప్పుడు పూర్వపు బ్రిటీషు వ్యవస్థను తలపించే వాతావరణం ఏర్పడుతుందంటున్నారు. అందుకే కేంద్రం ఏవైతే హామీలు ఇస్తామని చెబుతుందో వాటన్నిటినీ వ్రాత పూర్వకంగా ఇవ్వాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు. రైతు ఆందోళనకు మద్దతుగా ఇప్పటికే పలువురు తమ సానుభూతి తెలిపారు.

పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి శిరోమణి అకాలీకి చెందిన ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌తన కిచ్చిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగిచ్చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త బాబా సేవాసింగ్‌ ‌పద్మశ్రీ అవార్డును తిరిగిచ్చారు. పంజాబ్‌ ‌జానపద కళాకారుడు హర్బజన్‌ ‌తనకు ఇస్తానన్న షిరోమణి పంజాబ్‌ అవార్డును తీసుకోనని ప్రకటించారు. ఇలా చాలామంది ఉద్యమ ప్రారంభంలోనే రైతులకు తమ పరోక్ష మద్దతును ప్రకటించారు. రైతుల మేలుకోరి చేస్తున్న ఈ ఆందోళనను దేశ వ్యాప్త ఉద్యమంగా కొనసాగించడంలో భాగంగా తాజాగా రెండు రోజుల సమావేశాలను సింఘూ సరిహద్దు వద్ద నిర్వహించారు. ఇందులో 22 రాష్ట్రాలకు చెందిన మూడు వందల మంది ప్రతినిధులు హాజరైనారు. వారిలో పద్దెనిమిది ఆలిండియా ట్రేడ్‌ ‌యూనియన్‌లు, తొమ్మిది మంది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాలు ప్రాతినిథ్యం వహించి సెప్టెంబర్‌ 25 ‌భారత్‌ ‌బంద్‌ ‌విజయవంతంగా నిర్వహించాలని తీర్మానించాయి. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Leave a Reply