Take a fresh look at your lifestyle.

ఎర్రకోటపై కిసాన్ ర్యాలీ జెండా… ఢిల్లీ లో చెలరేగిన హింస

ఢిల్లీలో కిసాన్ ర్యాలీ రక్తసిక్తం కావడం దురదృష్టకరం. శాంతియుతంగా ర్యాలీనిర్వహిస్తున్న తమపై పోలీసులు కాల్పులు జరిపారనీ, కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.అయితే, రైతుల లారీ తలకిందులై రైతు మరణించాడనీ, కాల్పులలో కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఏమైనా రైతుల రక్తం గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని వీధిలో చిందింది. ఇందుకు బాధ్యత ఇరువర్గాల్లో ఉంది. అయితే రైతు సంఘాల నాయకులు ఎర్రకోటపై కిసాన్ ర్యాలీ జెండాను ఎగురవేసి తమ నిరసన తెలిపారు. ఈ ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ అప్పటికే రైతుల్లో ఆవేశకావేశాలు పెరిగిపోవడం వల్ల ప్రభుత్వం చర్యలు ఫలించలేదు. మరో వంక రైతు సంఘాలు కూడా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని చెప్పి హింసకు తావిచ్చే విధంగా వ్యవహరించారు.అయితే, తమ ఉద్యమంలోకి ఇతరులు ప్రవేశించారని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ ఆరోపించారు.ఆయన మాట నిజం కావచ్చు , సాధారణంగా ఇలాంటి ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత పట్టుతప్పుతాయి. భారత సర్వసత్తాక ప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని చాటే గణతంత్ర దిన వేడుకలు జరగుతున్న సమయంలో ఆ పెరేడ్ కు సమాంతరంగా రైతులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి అనుమతి ఉన్నప్పటికీ, రైతు సంఘాల నాయకులు ఊహించిన దాని కన్నా ఎక్కువ మంది ఢిల్లీకి తరలి వొచ్చారు. సోమవారంనాడు నాసిక్ నుంచి ముంబాయికి వేలాది రైతులు తరలి వచ్చిన దృశ్యాలు నిరంతర వార్తా స్రవంతుల్లో చూసిన వారికి ఈ ర్యాలీ అనుకున్న దాని కన్నా పెద్దదే కావచ్చని అనుకున్నారు.

సామాన్యులకే అలాంటి అభిప్రాయం కలిగినప్పుడు ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా,ఇంటిలిజెన్స్ వర్గాలు అంచనా వేయడంలో విఫలమయ్యాయా అవి అందించిన సమాచారానికి అనుగుణంగా కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకోలేకపోయిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా నగరాలు, ఓ మాదిరి పట్టణాల్లో జరిగే ర్యాలీలకే ఇతర ప్రాంతాల నుంచి భద్రతా దళాలను తరలిస్తూ ఉంటారు. ఢిల్లీలో భద్రతా దళాల కొరత ఉందంటే నమ్మశక్యం కాదు. కేంద్ర హోం శాఖ, కేంద్ర రక్షణ శాఖ ప్రధాన కార్యాలయాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ ర్యాలీ గురించి అంచనా వేయడంలో ప్రభుత్వ వేగులు విఫలమైనా ఉండాలి లేదా, హోం శాఖ వర్గాలు తేలిగ్గా తీసుకుని అయినా ఉండాలి. ఏమైనా రైతుల ర్యాలీలో హింస చెలరేగిందనే ముద్ర పడింది.దీంతో ఇంతవరకూ శాంతియుతంగా సాగిన రైతుల ఆందోళన ఒక్కసారిగా హింసారూపం దాల్చింది. ఇది రైతుల ఇమేజ్ ని దెబ్బతీస్తుంది. భారతీయ రైతులు శాంతికాముకులు, అన్నదాతగా పేరొందిన వారు. కష్టాలు అనుభవించడమే వారికి తెలుసు. ఎదురు తిరగడం వారికి తెలియదు.ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాలు వారిలో ఎదిరించే శక్తిని పెంచాయి.

వ్యవసాయ చట్టాల్లో ఏమీ లేదనీ,వాటిని చూసి రైతులు అనవసరంగా భయపడుతున్నారని ఆర్ ఎస్ ఎస్ నాయకుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వొచ్చిన వారు కారు.ఆయనకు రైతుల గురించి వ్యవసాయం గురించి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. లేదా ప్రతిష్ఠ కోసం అలా మాట్లాడి ఉండవచ్చు. వ్యవసాయ రంగంతో ఎంతో కొంత సంబంధం ఉన్న వారు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. నిత్యం పొలాల్లో పని చేసుకుని వ్యవసాయమే వ్యాపకం చేసుకున్న రైతులకు ఈ చట్టాల్లో తమకు హాని చేసే అంశాలను గురించి తరచూ ప్రతి రోజూ వివిధ స్థాయిల్లో మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కొంత దిగి వొ చ్చినప్పటికీ, చట్టాలను రద్దు చేసేందుకు మాత్రం ససేమిరా అంటున్నది. చట్టాలను అంగీకరిస్తే ఎప్పటికైనా ప్రమాదమన్నది రైతుల అభిప్రాయం. కనీస మద్దతు ధర విషయంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. మద్దతు ధరకు ప్రభుత్వం అనుకూలమేనని చెబుతూనే, ఆ అంశాన్ని చట్టంలో చేర్చేందుకు ససేమిరా అంటోంది. దీని వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తవచ్చని రైతులు భయపడుతున్నారు. వారి భయాలను తొలగించే ప్రయత్నం జరగలేదు. చట్టాలను సంవత్సరంన్నర పాటు వాయిదా వేస్తామన్నారు.ఆ తర్వాత పరిస్థితి ఏమిటి మళ్ళీ పాత కథే మొదలవుతుంది. అందుకే ఆ చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు.

Farmers' tractor rally: Protesters hoist flag at Red Fort; violence erupted in Delhi

భారత గణతంత్ర దినోత్సవం నాడు తమ సత్తాను దేశ రాజధాని వీధుల్లో చాటాలనుకున్న రైతుల ఆకాంక్ష నెరవేరింది. అయితే, రైతు రక్తం చిందిస్తేనే అది సాధ్యమైంది. రైతులు ఆందోళనకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించి ముందు జాగ్రత్తలను చర్చించి ఉండవచ్చు. కానీ, ఇంత భారీ ఎత్తున రైతులు తరలి వొస్తారని ఆయన ఊహించలేకపోవచ్చు. అందుకే, మంగళవారంనాడు రైతు గుండె ఆగిన తర్వాత ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి సమీక్షించారు. రైతులు మొదటి నుంచి రాజకీయ పార్టీల నాయకులను దూరంగా ఉంచుతున్న సంగతి నిజమే. ఇలాంటి విపరిణామాలు సంభవిస్తాయని తెలిసే వారు చాలా కఠినంగా వ్యవహరించారు. ర్యాలీ అనే సరికి అందరూ పాల్గొనే అవకాశం ఉంటుంది కనుక, వారు ఆరోపించినట్టు రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రవేశించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఉండవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం ముందే రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపి ఉండాల్సింది. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఆందోళనలు నిర్వాహకుల చేతుల్లో ఉండవనడానికి ఇది తాజా ఉదాహరణ.

Leave a Reply