ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి
- మామిడి కాయల విక్రయాల్లో కొత్త ఒరవడి సృష్టించాలె…
- సెర్ఫ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టుగా వెంకటాపూర్
- కూరగాయల విక్రయాలను సెర్ఫ్ పద్ధతిలో యోచిస్తున్నాం
- మామిడికాయల సేకరణ కేంద్రం ప్రారంభత్సోవంలో మంత్రి హరీష్‌రావు
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. గురువారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని వెంకటాపూర్‌లో మామిడికాయల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 1700 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయనీ, ఇక్కడ మామిడి కాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసుకున్నామనీ, మామిడి రైతులు నాణ్యమైన దిగుబడి సాధించేలా రైతులకు శిక్షణ కూడా ఇప్పించామన్నారు. సేకరణ కేంద్రంతో మామిడి రైతులకు మూడు రకాలుగా ఎంతగానో మేలు చేకూరుతుందనీ, మామిడి రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందనీ, రైతులకు తరుగు ఇబ్బంది, వ్యయ ప్రయాసాలు తప్పుతాయి. గడ్డి అన్నారం మార్కెట్ ధర ప్రకారం రోజూ వారీగా ధరలు ఉంటాయన్నారు.
జిల్లా వ్యాప్తంగా 13 వేల 400 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారనీ, మామిడికే కాకుండా సెర్ఫ్ పద్ధతిలో కూరగాయల విక్రయాలు జరిపేలా యోచనలో ఉన్నామన్నారు. జిల్లాలో నంగునూరు, కొహెడ, అక్కన్నపేట, మద్దూర్, చిన్నకోడూర్, కొండపాక, జగదేవ్‌పూర్ మండలాల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న దృష్ట్యా బెనిషా కొనుగోళ్ల కేంద్రాలను ఈ పంటకే అందించేలా ఏర్పాటు చేయించాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావును మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట జిల్లాలో అత్యధిక మామిడి సాగు కలిగి ఉన్న నంగునూరు మండలాన్ని గుర్తించామనీ, నంగునూరు మండలంలో 14 గ్రామాలు ఎంపిక చేశామనీ, 275 ఏకరాలు తోటలు విస్తీర్ణంలో ఈ యేడు మామిడి దిగుబడి 5 వేల క్వింటాళ్లు వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నంగునూరు మండలంలో 14 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సంఘాల్లో మామిడి సాగు చేస్తున్న మంది 115 సభ్యులు, మొత్తం 199 మంది సభ్యులు ఉన్నారనీ, మామిడి రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఎఫ్పీసీ ద్వారా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బె నిషాన్ కంపెనీతో ఒప్పందం చేసుకుందన్నారు.
గతంలో 3 జిల్లాలు, ఈ యేడు 13 జిల్లాలతో సెర్ఫ్ ఆధ్వర్యంలో చేపట్టామనీ, రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలోని 35 మండలాల్లో మహిళా సమాఖ్య, మహిళా రైతుల-ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో మామిడి కాయల కొనుగోళ్ల కేంద్రం ఏర్పాటుకై నిర్ణయించామన్నారు. నంగునూరు మండలంలోని 13 గ్రామాల్లో 115 మంది చిన్న సన్నకారు మహిళా మామిడి రైతులను గుర్తించాంమన్నారు. మహిళా మామిడి రైతులందరికీ మామిడి కాయల సేకరణ మార్కెటింగ్, ఎఫ్పీసీ ప్రాధాన్యత వివరిస్తూ… ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులు ఏర్పాటు చేసి ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో వాటా దారులుగా చేర్చతామన్నారు. ఈ వాటా దారుల నుంచి పండించిన మామిడి కాయలను సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనుసంధానమైన జగదేవ్‌పూర్ వారు కొనుగోళ్లు చేసి ఎఫ్పీసీ ద్వారా ఏర్పాటు చేసిన బెనిషాన్ కంపనీకి పంపిస్తుందన్నారు. బెనిషాన్ కంపెనీ ముందస్తుగా తీసుకున్న ఇండెంట్ ఆధారంగా బిగ్ బాస్కెట్, రత్నదీప్, రిలయన్స్, మోర్, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రిటైలర్స్‌కు విక్రయాలు జరుపుతుందన్నారు.
బెనిషాన్ కంపెనీ మార్కెట్ స్థితిగతుల ఆధారంగా రోజూ, వారం వారీగా ప్రకటించిన ధర ప్రకారమే రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోళ్లు చేపడుతుందన్నారు. రైతులకు ఉలాంటి కమీషన్, తరుగు, ట్రాన్స్పోర్ట్ రవాణా ఖర్చులు ఉండవన్నారు. మామిడి రైతులు ఫీల్డ్, క్షేత్రస్థాయిలోనే మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. బెనిషాన్ కంపెనీ ప్రతి వారం ఎఫ్పీసీకి బిల్లు చెల్లింపులు చేపట్టేలా చర్యలు తీసుకున్నామనీ, ఎఫ్పీసీ నుంచి నేరుగా వారానికి ఒక్కసారి మామిడి రైతు బ్యాంకు ఖాతాకు జమ చేసేలా చర్యలు తీసుకున్నాంమన్నారు. మామిడి రైతులు గ్రేడింగ్ చేసి అమ్మడంతో అధిక ధరలు పొందే అవకాశం ఉందనీ, దీనిని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మామిడి రైతు ప్రత్యేకంగా మార్కెట్ ధర పొందటంతో పాటుగా బెనిషాన్ కంపెనీ వ్యాపారంలో వచ్చిన లాభంలో 50 శాతాన్ని తిరిగి రైతులు అమ్మకం ఆధారంగా డివిడెంట్ రూపంలో పొందుతారనీ, మహిళా వాటా దారులు మామిడి కాయలను కొనుగోళ్లు చేసేందుకు నంగునూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామైఖ్య సంఘాన్ని- వీఏల్ పీసీ కేంద్రంగా గుర్తించామన్నారు.
మామిడి కాయల సేకరణపై స్టాఫ్, పిక్కర్స్కు ఉద్యానవన కేంద్రం సంగారెడ్డిలో శిక్షణ తరగతులు పూర్తయ్యాయనీ, మామిడి రైతుల ప్రొడక్షన్ ప్లాన్ తయారు చేయడంతో పాటు కొనుగోళ్లకు కావాల్సిన పరికరాలు క్రేట్స్, నెట్స్, కట్టర్స్, టార్ఫలిన్లు సిద్ధం చేశామన్నారు. సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపనీ జగదేవ్ పూర్, బస్వాపూర్ గ్రామాల్లో కూరగాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటికే 352 మెట్రిక్ టన్నుల రూ.24.02 లక్షల విలువ కలిగిన కూరగాయలను కొనుగోళ్లు చేసి బెనిషాన్ కంపెనీకి పంపామనీ, ఈ కొరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా 25 మెట్రిక్ టన్నుల కూరగాయలను కొనుగోళ్లు చేశామనీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, నేతలు వేముల వెంకట్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.