Take a fresh look at your lifestyle.

రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించాలి ..: సి ఎం కెసిఆర్

‘‘తెలంగాణ రైతులు మార్పును అందిపుచ్చుకునే చైతన్యం కలిగిన వారు. అందుకే నియంత్రిత పద్ధతిలో సాగును వందకు వంద శాతం అమలు చేశారు. వానాకాలంలో మక్కలు వేయడం లాభదాయకం కాదు అంటే, ఎవ్వరూ మక్కలు వేయలేదు. ప్రభుత్వ ప్రయత్నాలు తమ కోసమే అని రైతులు గ్రహించారు. కాబట్టి రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలి. అది చాలా ముఖ్యం’

‘‘తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలి. అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఎంతో వ్యయం చేస్తున్నది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలి. సంప్రదాయక వ్యవసాయ పద్దతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలి. వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలి. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలి. యాంత్రీకరణ పెరగాలి. ప్రపంచ వ్యాప్తంగా సింగిల్ పిక్ క్రాప్స్ వచ్చాయి. వాటిని అధ్యయనం చేయాలి. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలి. వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలి. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలి. రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసి రావాలి. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. మార్కెట్ ను అధ్యయనం చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేయాలి. ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను పెట్టి, ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్ డైరెక్టర్ ను నియమించాలి. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించాం. పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఎఇవోలను నియమించుకోవాలి. వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలి. దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!