Take a fresh look at your lifestyle.

చరిత్రను తిరగరాసిన రైతాంగ పోరాటం..

‘‘సుదీర్ఘ రైతాంగ పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, ఇచ్చిన హామీ మేరకు శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఆ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్ధు ప్రక్రియను పూర్తి చేయాలి. అదే సమయంలో దశాబ్ధాలుగా పోరాడుతున్న రైతుల పంటకు ‘‘కనీస మద్ధతు ధరకు చట్ట బద్ధత కల్పించాలి’’. అలాగే సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌.‌కే.ఎం) ఆరు డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి. అందులో రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి పాలకులు మానవీయతను చాటాలి.’’

చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే అది ఇంకా పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది..
-స్వామి వివేకానంద

రైతు ఉద్యమం వార్షికోత్సవం సందర్భంగా..

నాడు అధికార పీఠం కోసం వోట్ల అవసరం ముంచుకొచ్చినప్పుడు మీరే అంతా ! మీ రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ధాన్య భాండాగారం   (సీడ్‌ ‌హబ్‌)‌ను చేస్తాం. ఋణాలు మాఫీ చేస్తాం అని రైతులకు హామీల వలవేసినారు నేటి కేంద్ర, రాష్ట్ర పాలకులు. ఆ అవసరం తీరిపోయేసరికి మీరెంత ,, అనే విధానాలు అవలంబిస్తున్న తీరును చూస్తున్నాం. ఇలా రేవు దాటాక తెప్ప తగలేసే పద్ధతుల వల్ల పండిన పంటను కొనే నాథుడు  లేక వరి కల్లాల్లోనే ప్రకృతి కన్నెర్ర చేసినా, పాలకులు నిర్లక్ష్యం చేసినా, చేసేది లేక భోరున  విలపిస్తున్నారు. రైతులకు భరోసా కల్పించే నెపాన్ని ఒకరిపై ఒకరు తోసేస్తూ రైతుల జీవితాలతో రాజకీయం చేస్తున్నారు. ‘‘కక్కలేక మింగలేక ఎక్కెక్కి ఏడుస్తున్న’’ రైతులు ఓ వైపు, మరోవైపు రైతు ఉద్యమాలు విజయవంతమైన వేళ కూడా పాలకులు నిర్లక్ష్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం ఏ పాటి నైతికత అనిపించుకుంటుంది. ప్రభుత్వ విధానాలు ప్రజా ప్రయో•నాలే గీటురాయి కావాలన్న పదవి ప్రమాణాలను మరువరాదు! మళ్ళీ ఎన్నికలు ముంచుకొస్తేనే బాధితుల బాధలు పట్టించుకునే పాలకుల అవలక్షణాలు వీడి బాధ్యతాయుతంగా మసులుకోవాలి. పాలకులు దశాబ్ధాలుగా రైతుల సమస్యల పట్ల ఉదాసీనత కనబరచడం వల్లనే శాశ్వత పరిష్కారం కోసం ‘‘రైతాంగ పోరాటం’’ సుదీర్ఘ కాలంగా కొనసాగుచూ చరిత్రనే తిరగరాసింది.
పోరు విత్తు నాటాం.. పంట పండాకనే ఇంటికి తిరిగి వెళ్తామని ప్రతినబూనిన సుదీర్ఘ రైతాంగ పోరాటానికి దిగివచ్చింది ప్రభుత్వం. వివాదాస్పద రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల ముందు ‘‘గురునానక్‌ ‌జయంతి’’ నాడు వ్యూహాత్మకంగా  ప్రకటించారు. ఇక రైతులందరు ఇళ్ళకు వెళ్లాలని కోరినారు.

కాని రైతు సంఘాలు పార్లమెంట్‌ ‌వేదికగా జరగాల్సిన చట్టాల రద్దు ప్రక్రియ పూర్తి చేసే వరకు దీక్షా శిబిరాలను వదిలి వెల్లేది లేదని భీష్మించుకున్నారు. అలా వారిలోని ఉక్కు సంకల్పం, పట్టుదల నిరుపమానం. ఈ చట్టాలవల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందనే ఆందోళనే రైతులు సంఘటితమయ్యేలా చేసింది. నవంబర్‌ 26, 2020‌న మొదలైన రైతుల పోరు దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ రైతాంగ పోరాంటంలో అనేక ఆటు పోటులను ఎదుర్కొన్నారు. ఈ పోరాటంలో లక్షలాది మంది రైతులు, మహిళా రైతులు కూడా పాల్గొన్నారు. ఎముకలు కొరికే చలిని, చండ ప్రచండ నిప్పులు కక్కిన ఎండాకాలం ఉక్కిరి బిక్కిరి చేసినా, కొరోనా  మహమ్మారి మరణ మృదంగాన్ని, భీకర వర్షాలను తట్టుకున్నారు. పాలకులు రహదారులను అష్టదిగ్భంధనం చేసినా, మేకులు అమర్చినా, ముళ్లకంచెలు వేసినా, బాష్పవాయువులు ప్రయోగించినా, అసత్య ప్రచారాలు చేసినా ఉద్యమం అదరలేదు, బెదరలేదు. ఉద్యమకారులపై 40 వేలకు పైగా కేసులు పెట్టినారు. సుమారు ఏడు వందల మంది రైతులు ఈ పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. యూ.పి. లఖింపూర్‌ ‌ఖేరీ జిల్లాలో కేంద్ర మంత్రి కుమారుడి కారుకు నలుగురు రైతులు బలిగొన్న దుర్ఘటనను కూడా తట్టుకొని అకుంఠిత దీక్షతో ముందుకు సాగినారు. ఈ సంఘటన ఎందరి హృదయాలనో కలిచివేసింది.

చివరగా వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడంతో.. ఆ విజయోత్సవ స్ఫూర్తితో ఉన్న రైతు(సంఘా)లు ఇక మిగతా డిమాండ్ల సాధనపై తీవ్రంగా దృష్టి సారించారు. ముఖ్యంగా అతి ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులకు ‘‘కనీస మద్ధతు ధర’’ కల్పించే హామీ కోసం పట్టుపట్టారు. రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు అడ్డుగా ఉన్న విద్యుత్తు సవరణ బిల్లును రద్ధు చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ఈ సుధీర్ఘ రైతు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు 700 మంది రైతుల కుటుంబాలకు ఉపాధితో పాటు తగిన పరిహారం ప్రకటించడం, పార్లమెంట్‌లో నివాళులర్పించడం, వారి పేరిట స్మారక స్థూపాన్ని నిర్మించడంతోపాటు ఉద్యమంలో మోపిన కేసులను బేషతుగా ఎత్తివేయడం లాంటివి రైతు సంఘాలు కోరుచున్నాయి. పాలకులారా.. రైతులు కోరుకుంటున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

ఈ పోరాటం మరో స్వాతంత్య్ర ఉద్యమంలా సాగింది. రైతుల బతుకు పోరాటం మాత్రమే కాదు. ఈ దేశ ప్రజల మెతుకు పోరాటమని భావించి, వీరికి మద్ధతు తెలిపిన అందరి కృషి అభినందనీయం. ఈ రైతు విజయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ రైతులే అనడంలో సందేహమే లేదు. ఇది పాక్షిక విజయమే ! న్యాయమైన డిమాండ్లు సాధించినప్పుడే  సంపూర్ణ విజయంగా భావిస్తాము. గమ్యాన్ని ముద్దాడే దాకా ఇక్కడి నుండి కదిలేది లేదని పోరు ఉధృతం  చేస్తామంటున్నారు. ఈ రైతు ఉద్యమంలో అమరులైన వారికి తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అభినందనీయం. అదే స్పూర్తితో రాష్ట్రంలో రైతుల కడగండ్లను తుడ్వాలి.
స్వామినాధన్‌ ‌కమిషన్‌• ‌నివేదిక ఇచ్చి 15 సంవత్సరాలైంది. ఆ నివేదికను ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్‌, ఏడు సంవత్సరాలు నేటి పాలకులు పట్టించుకోలేదు. రైతులు పంట పండించడానికి పెట్టే ఖర్చును సి2 అంటారు దానికి యాబై (సి2+50) శాతం అదనంగా కలిపి రైతుల పంటకు మద్ధతు ధర (ఎం.ఎస్‌.‌పి.) నిర్ణయించాలనే సిఫారసుకు 15 సంవత్సరాలు గడిచింది.

కావున నిపుణులతో మరో కమిటీ వేసి దానికి తోడు నేటి కిసాన్‌ ‌కమిటీ, రెండు కలిసి కనీస మద్ధతు ధర నిర్ణయించాలి. నేడు రైతు కుటుంబాల రోజు వారీ సగటు సంపాదన 277 రూపాయలే ! నేటి జాతీయ నమూనా సర్వేలో ప్రభుత్వ గణాంకాలే సూచిస్తున్నాయి . రైతు కేంద్రంగా వ్యవసాయ విధానాలతో జాతీయ స్థాయి పంటల ప్రణాళికలతో కేంద్ర, రాష్ట్రాలు సమిష్టిగా సాగాలి. గత దశాబ్దకాలంలో ప్రపంచంలో కనివినీ ఎరుగని రైతాంగ పోరాటం మనదేశ దిల్లీ సరిహద్దుల వద్ద ప్రజాస్వామ్య యుతంగా, శాంతియుత మార్గంలో లక్షలాది మంది రైతులు చేస్తున్నారు. ఈ పోరాటం కేంద్ర, రాష్ట్ర పాలకులు సంఖ్యా బలం ఉందనే ధీమాతో ప్రజా వ్యతిరేక చట్టాలు చేసినా ప్రజా క్షేత్రంలో అమలు సాధ్యం కాదనే గుణపాఠం నేర్పింది. వ్యవసాయ చట్టాల రద్దు కార్యాన్ని తొలినాళ్లలోనే చేస్తే సుమారు 700 మంది రైతుల ప్రాణాలు దక్కేవి. అయినా ఆలస్యంగానైనా మానవీయ నిర్ణయం తీసుకోవడం బాధ్యతతో కూడినదిగా భావించవచ్చు. పాలకులు ప్రజలకు క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కు తీసుకుంటే  రైతుల ప్రాణాలు తిరిగిరావు కదా ! ఈ పోరాటం రాబోవు శతాబ్ధ కా)ంతో పాటు ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిస్తుందనేది నిజం. ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగిస్తే త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ప్రభావం పడుతుందని, తాజా నిర్ణయాన్ని ప్రకటించిందనే మరోవాదన వినబడుతుంది. ఈ రాజకీయ ప్రభావం దేశమంతటా విస్తరిస్తుందని ముందు జాగ్రత్త పడిందని విశ్లేకులు భావిస్తున్నారు.

ఈ సంక్లిష్ట సమయంలో ఎవరిని నిందించకుండా ప్రధాని ఉద్ఘాటించిన మేరకు సుదీర్ఘ రైతాంగ పోరాటాన్ని రాజకీయ కోణంలో చూడకుండా, ఇచ్చిన హామీ మేరకు శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఆ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్ధు ప్రక్రియను పూర్తి చేయాలి. అదే సమయంలో దశాబ్ధాలుగా పోరాడుతున్న రైతుల పంటకు ‘‘కనీస మద్ధతు ధరకు చట్ట బద్ధత కల్పించాలి’’. అలాగే  సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌.‌కే.ఎం) ఆరు డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి. అందులో రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి పాలకులు మానవీయతను చాటాలి. పాలకులు ఈ దేశ ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతుల జీవితాలకు భరోసా కల్పించాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న పాలకుల ఎన్నికల హామీలను అమలు చేసి రైతు బతుకుల్లో వెలుగులు నింపాలి. రైతుల జీవితాలతో రాజకీయాలు మాని ఇన్నాళ్ల ఉదాసీనత వీడి ఇంకా కాలయాపన చేయకుండా పోరాటాన్ని మాన్పించి, రైతులను ఇంటిబాట పట్టేలా చూడాలి. మెట్టుదిగిన ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలి. రైతు ఏడ్చిన రాజ్యం పొడుగెల్లదనే వాస్తవాన్ని మరవకండి..
– మేకిరి దామోదర్‌
‌వరంగల్‌, 9573666650

Leave a Reply