- భద్రత పెంచిన రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్
- 20 అదనపు ఆర్పీఎస్ఎఫ్ కంపెనీల మోహరింపు
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగస్తున్న రైతు ఆందోళనలో భాగంగా ఈనెల 18న దేశవ్యాప్త రైల్ రోకో ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రైల్వేలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అదనంగా 20 కంపెనీల రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)ను మోహరించనుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకూ రైల్‌రోకో ఆందోళన ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ తికాయిత్ బుధవారంనాడు ప్రకటించారు.
కేంద్రం అనేక ఆంక్షలను తొలగించినప్పటికీ గత ఎనిమిది నెలలుగా పలు రైళ్ల రాకపోకలను అనుమంతించడం లేదని, కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారని తికాయిత్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సంయుక్త మోర్చా పిలుపు మేరకు ఆయా గ్రామాల్లోని ప్రజలు గురవారంనాడు రైల్‌రోకో ఆందోళనలల్లో పాల్గొంటారని చెప్పారు. రైల్‌రోకోపై రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. ప్రధానంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. అదనంగా 20 కంపెనీల (సుమారు 20 వేల మంది సిబ్బంది) ఆర్పీఎస్ఎఫ్ను మోహరిస్తున్నట్టు తెలిపారు. రైల్ రోక్ సందర్భంగా ప్రశాంతతను పాటించాలని, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దని తాము కోరుతున్నట్టు చెప్పారు.