Take a fresh look at your lifestyle.

దిల్లీ సర్కార్‌ ‌తో ‘ఢీ ‘..! సిద్దమవుతున్న రైతాంగం

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ : ‌గడచిన వందరోజులుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర నిరసన తెలుపుతున్న రైతాంగం సరాసరి ఢిల్లీ సర్కార్‌ను ఢీ కొనేందుకు సిద్దపడుతున్నది. ఈనెల చివరివారంలో దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలను ఇందుకు వేదికగా ఏర్పాటుచేసుకోవాలని రైతాంగం తీర్మానించుకుంది. వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా మూడు ప్రధాన చట్టాలను పార్లమెంట్‌లో అధికార బిజెపి ఆమోదింప చేసుకోవడంతో దేశవ్యాప్తంగా రైతాంగమంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. ప్రధానంగా ఢిల్లీ సమీప రాష్ట్రాలైన పంజాబ్‌, ‌హర్యానా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది రైతులు గడచిన వందరోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసన తెలుపుతున్న విషయం తెలియందికాదు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే దాదాపు పదకొండు, పన్నెండు విడుతలుగా చర్చలు జరిపినా ఫలవంతం లేకుండాపోయింది. ఎట్టి పరిస్థితిలో ఈ మూడు చట్టాలను ఎత్తివేయాలని రైతులు భీష్మించుకుని కూర్చుంటే, రైతుల మేలు కోరే ఈ చట్టాలను రూపొందించామని, వాటిని ఎత్తివేసేదిలేదంటోంది కేంద్రం. రస్తారోకోలు, ఆందోళనలు, భాష్పవాయు ప్రయోగాలు, లాఠీఛార్జీలు, చివరకు సుమారు డెబ్బై మంది రైతుల మరణాలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలో భాగంగా ఎర్రకోట ముట్టడికూడా హింసాత్మకంగా మారింది. దేశ రాజధానిలో జరుగుతున్న ఈ ఆందోళన విదేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. బ్రిటీషు పార్లమెంటరీలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందంటేనే ఇక్కడి రైతుల ఆందోళనపై ప్రపంచదేశాలు దృష్టిసారించాయన్నది అర్థమవుతున్నది. అయినా ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించకుండా చర్చల పేర కేంద్రం జాప్యం చేస్తూనేఉంది. రైతులను ఆందోళనకారులని, ఈ ఉద్యమంలో తీవ్రవాద శక్తులు జొరబడ్డారంటూ కేంద్రం విషయాన్ని పక్కదారి పట్టిస్తోందన్న ఆరోపణలున్నాయి.

చివరకు అత్యున్నత న్యాయస్థానం సమస్య పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని సూచించాల్సి వచ్చింది. ఏదిఏమైనా అటు కేంద్రంగాని, ఇటు రైతు సంఘాలుగాని ఒక మెట్టు దిగడానికి ఒప్పుకోవడంలేదు. కేంద్రం ఈ చట్టాలను ఎత్తివేసేవరకు తాము ఆందోళన విరమించేదిలేదని రైతునాయకులు స్పష్టంచేస్తున్నారు. అందుకు ఎంతసమయం పట్టినా తాము ఇలానే ఢిల్లీ రోడ్లపై నిరసన వ్యక్త చేస్తూనే ఉంటామంటున్నాయి రైతు సంఘాలు. అక్కడ వేసుకున్న తాత్కాలిక గుడారాల్లో చలికి వణుకుతూ, వర్షాలకు తడుస్తూ గడుపుతున్న రైతాంగం ఇప్పట్లో ఈ సమస్య తెగేట్లు లేదోమోనని శాశ్వత గుడారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎండాకాలం ప్రారంభ కావడంతో ఎసీలు, కూలర్లను గుడారాలకు తరలిస్తున్నారు. ఆరు నెలలైనా ఈ గుడారాల్లో ఉండేందుకు తగిన కిరాణ సామాన్లను కూడా తరలించుకుంటున్నారు. ఉద్యమంలో ముందుభాగంలో ఉన్న మగ రైతులకు సహాయంగా వంటావార్పుతోపాటు ఉద్యమించడానికి వేల సంఖ్యలో మహిళా రైతులుకూడా ఇంకా అక్కడికి చేరుకుంటూనేఉన్నారు.

- Advertisement -

తమ డిమాండ్‌ను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు ఇప్పుడు రైతాంగం త్వరలో జరుగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలను లక్ష్యంగా చేసుకునేందుకు సిద్దపడింది. ఈ నెల 27న అస్పాం, పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కేరళ, పాండుచ్చేరిలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జంఢాను నెగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి ఈ ఎన్నికలను సీరియస్‌గానే తీసుకుంటోంది. అయితే ఈ అయిదు రాష్ట్రాల్లో బిజెపికి ఓటు వేయవద్దని ఆయా రాష్ల్రాల రైతాంగాన్ని కోరే కార్యక్రయాన్ని చేపట్టాలని ఉద్యమిస్తున్న రైతు సంఘాల నాయకులు తీర్మానించారు. ప్రధానంగా నువ్వా నేనా అన్నట్ల్లు సాగుతున్న పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారంచేసేందుకు ఈ నెల 13న ఆ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు భారత్‌ ‌కిసాన్‌ ‌యూనియన్‌ ‌వ్యవస్థాపక నాయకుడు తికాయత్‌ ‌తాజాగా ప్రకటించాడు. అక్కడి రైతులను సంఘటితపర్చి కేంద్ర సర్కార్‌ ‌రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తామని చెబుతున్న తికాయత్‌ ‌తామే పార్టీకి మద్దతుకాదని స్పష్టంచేశాడు.

ఇదిలాఉండగా తమ ఉద్యమానికి మరింత తీవ్ర రూపం ఇవ్యడంలో భాగంగా ఈ నెల 15న దేశ వ్యాప్తంగా రైతాంగ నిరసన కార్యక్రమాన్ని, 26వ తేదీన భారత్‌ ‌బంద్‌ను చేపట్టాలని రైతాంగం నిశ్చయించింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేరంగా రైతులు ఆందోళన చేపట్టి ఈ నెల 26వ తేదీనాటికి నాలుగు నెలలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులంతా ఈ బంద్‌లో పాల్గొనాలని రైతు నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం వ్యవసాయ చట్టాలేకాకుండా కేంద్రం ఇటీవల సామాన్యుడిపై పెనుభారం వేస్తూ పెట్రోల్‌, ‌డిజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలను పెంచడంపైనకూడా ఈ సందర్భంగా నిరసన వ్యక్తచేయాలని వారు పిలుపునిస్తున్నారు. అలాగే మార్కెట్లు, వ్యవసాయాన్ని రక్షించాలంటూ ‘మండి బచావో.. ఖేతీ బచావో’ పేర ఈ నెల 19న మరోనిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. అలాగే రాజగురు, సుఖ్‌దేవ్‌ ‌స్మృత్యర్థం షహీద్‌ ‌దివస్‌ను, 29న కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ హోలికా దహన్‌ ‌పేర చట్ట పత్రాలను దగ్ధంచేసే కార్యక్రమాన్ని రైతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంమీద కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఎత్తివేసేవరకు వ్యవసాయాన్ని వదిలైనా ఆందోళన చేసేందుకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Leave a Reply