Take a fresh look at your lifestyle.

దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమవుతున్న అన్నదాతలు

  • ప్రభుత్వం దిగి వొచ్చే వరకు ఢిల్లీని వీడేది లేదని స్పష్టీకరణ
  • సాగు చట్టాలపై మెట్టుదిగని ప్రధాని మోడీ..పట్టు సడలించని రైతులు

వ్యవసాయ చట్టాల అమలు రాష్ట్రాల ఇష్టానికి వొదిలేసినట్లు ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటించినా రైతులు నమ్మడం లేదు. ఉద్యమం సాగుతుందని హెచ్చరించారు. అయితే ప్రధాని మోడీ మాటలను రైతులు విశ్వసించి తమ ఆందోళనలను విరమించడం లేదు. స్పష్టమైన హామి ఇస్తే తప్ప రాజధాని శివారులను వొదిలేది లేదని అంటున్నారు. మరోవైపు కేంద్రం చట్టాలను ఉపసంహరించుకునేది లేదని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నా… రద్దే తమ సమస్యలకు పరిష్కారమని ఖరాఖండిగా రైతు సంఘాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఇక దీర్ఘకాలిక ఉద్యమానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించే పంటను కార్పొరేట్ల వశం చేసేందుకు మోడీ సర్కార్‌ ‌తీసుకువొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో కర్షకులు రెండున్నర నెలలుగా ఉద్యమ పోరు సాగిస్తున్నారు.

రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుందని నిరూపిం చేందుకు గడ్డకట్టే చలిని తట్టుకుని…ఇంటిని, కుటుంబాన్ని వొదిలేసి అకుంఠిత దీక్షతో పోరుబాట చేపట్టారు. చట్టాలను రద్దుచేసినప్పుడే ఆందోళనలను విరమించుకుంటామని స్పష్టం చేశాయి. ఈ ఆందోళనలకు వేదికలుగా నిలిచిన సింఘు, ఘాజిపూర్‌, ‌టిక్రీ వంటి సరిహద్దుల వద్ద టార్పాలిన్స్‌తో టెంట్లు ఏర్పాటు చేసుకుని అన్నదాతలు ఇన్ని రోజులగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆందోళనలు ఒకెత్తు కాగా…ఇక నుండి మరో ఎత్తు కానున్నాయి. ఇప్పట్లో ప్రభుత్వం కూడా చట్టాల విషయంలో దిగిరాకపోవడంతో ఇక దీర్ఘకాలిక ఉద్యమానికి వారు సిద్దం అవుతున్నారు. రానున్నది మండు వేసవి కావడంతో అందుకు అనుగుణంగా ఇక తమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్న టార్పాలిన్‌ ‌టెంట్లు నీడనే కాకుండా చలిని తట్టుకునేందుకు సాయపడ్డాయి. అయితే ఇప్పుడు వేసవి కాలంలో కూడా ఉద్యమం కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయం కోసం రైతు సంఘాల నేతలు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. షెడ్లు, దోమ తెరలు, ఫ్యాన్లు, కూలర్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నారు. అదే విధంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.

- Advertisement -

వేసవి కాలానికి అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా..ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉద్యమం కొనసాగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మనమంతా ఉద్యమాన్ని కొనసాగించాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కిసాన్‌ ఏక్తా మోర్చా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మోడీతో అమితుమి తేల్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో తమ టెంట్లకున్న టార్పాలిన్‌ ‌కవర్లను తొలగించి…దోమ తెరల ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కూలర్లు, ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నామని రైతులు అన్నారు. అదేవిధంగా అవసరమైన దుస్తులను..ఫ్యాన్లను, కూలర్లను ఇంటి నుండి తెచ్చుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలిపారు.

రైతులు డీహైడ్రెషన్‌కు గురికాకుండా ఉండేందుకు పానీయాలు సిద్ధం చేస్తామని తెలిపారు. ఎక్కువ నీటిని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వేసవిలో ఉద్యమాన్ని కొనసాగించడానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి గురుద్వారా కమిటీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా ఈ నల్ల చట్టాలు రద్దు చేయకపోతే..తాము ఈ ఏర్పాట్లు చేసుకుంటామని సింఘా బోర్డర్‌ ‌రైతులు చెబుతున్నారు. రానున్నదీ వేసవి కాలం కావడంతో ఈ వేడిమి తాపానికి ఆందోళనలు చేపట్టలేమని, కచ్చితంగా ఓ నీడ కావాలని…ఈ ఆందోళన కొనసాగుతూ ఉంటే తాము ఇటువంటి ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. మొత్తానికి రానున్న వేసివిలో రైతుల ఉద్యం మరింత వేడెక్కించే పరిస్థితి కనిపిస్తోంది.

Leave a Reply