- భారత్ బంద్ పిలుపుతో రోడ్డెక్కిన అన్నదాతలు
- ఉత్తరాది రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఇచ్చిన బంద్ పిలుపు ఉత్తరాదిలో తీవ్ర ప్రభావం చూపింది.జాతీయ రహదారుల దిగ్బంధం, రైల్ రోకో వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ నిరసనలు తెలియజేసారు. దేశవ్యాప్తంగా బంద్కు మద్దతుగా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రవిడ మున్నేట్రా కగం, తృణమూల్ కాంగ్రెస్, రాష్టీయ్ర జనతాదళ్ సహా 18 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. భారత్ బంద్కు పిలుపునిచ్చిన యూనియన్లలో భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), అఖిల భారత రైతు సంఘం (ఎఐఎఫ్యు), అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ (ఎఐకెఎస్సిసి), అఖిల భారత కిసాన్ మహాసంఘ్ (ఎఐకెఎం) ఉన్నాయి. పంజాబ్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఢిల్లీ – హర్యానా సరిహద్దును కూడా మూసివేసే అవకాశం ఉంది. అయితే పంజాబ్, హర్యానాల్లో 31 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గత నాలుగు రోజుల నుంచి ధర్నాలు, నిరసనలు కొనసాగించారు. పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవసాయబిల్లులతో చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
పంజాబ్,హర్యానా తదితర రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఈ బిల్లులను రైతు వ్యతిరేక బిల్లులుగా పరిగణిస్తూ పంజాబ్ రాష్ట్రం సంపూర్ణ బంద్ పాటించిది. హర్యానా, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిహార్లో రాష్టీయ్ర జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వాలని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. ఢిల్లీ-వి•రట్ హైవే మూసివేయడంతో వందల సంఖ్యలో చేరుకున్న రైతులు అక్కడే ధర్నా నిర్వహించారు. హర్యానాలో రైతుల నిరసన పెద్ద ఎత్తున కొనసాగుతోంది. కాగా పంజాబ్-హర్యానా సరిహద్దును పోలీసులు మూసి వేశారు. పంజాబ్ నుంచి వస్తున్న రైతు నిరసన ట్రాక్టర్లను సరిహద్దులోనే అడ్డుకుని హర్యానాలోకి ప్రవేశించకుండా నిలువరించారు. ఇక పంజాబ్లో రైతుల నిరసన ఉదృతంగా సాగింది. ఈ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.
పంజాబ్లోని రోడ్లన్నీ రైతుల ట్రాక్టర్ల ర్యాలీలతో నిండిపోయాయి. కాగా, రైతు నిరసనలపై ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, నిరసనల్లో ఎలాంటి అసాంఘీక ఘటనలు జరగలేదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. చాలా ప్రాంతాల్లో రైలు ప్రయాణాలను రైతులు అడ్డుకున్నారు. రైల్వే లైన్లపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులను అరెస్ట్ చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. చట్టబద్దంగా చేస్తున్న నిరసనలను స్థానిక ప్రభుత్వాలు అణచివేయాలని చూస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
నల్లగొండ లో ..
భూమి నుంచి రైతులను వేరు చేసే కుట్రలు
విద్యావంతుల వేదిక, సిపిఎం,సిపిఐ,సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నేతలు
నల్లగొండ :దేశ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులను కేంద్రం హరించివేస్తూ చిన్న సన్నకారు రైతులను అణచి వేస్తూ, కేంద్రం చాలా నిరంకుశంగా మూడు వ్యవసాయ రంగ ఆర్డినెన్సులను తీసుకొచ్చిందని ఈ విదానాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ,సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ విద్యావంతుల వేదిక,కెవిపిఎస్,ఐద్వా మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో బాగంగా పెద్ద ఎత్తున నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టింది.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు మాట్లాడుతూ బారత సమాఖ్య స్పూర్తిని దెబ్బతీస్తూ వ్యవసాయం,విద్యుత్ లాంటి రాష్ట్ర జాబితా లోని అంశాలలో కేంద్రం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.అత్యవసర సమయంలో తీసుకొచ్చే ఆర్డినెన్స్ వను బిజెపి తన ఆవసరాల కోసం తీసుకోస్తుందన్నారు. రైతాంగ వ్యతిరేక బిల్లు లకు వ్యతిరేకంగా కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాజీనామా చేసిన కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు పోవడం కేంద్రం యొక్క వ్యవసాయ వ్యతిరేక విదానాల కు నిదర్శనమన్నారు.
రైతులు పండించిన పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా న్యాయమైన ధరలు లభించకపోవడమనేది గత కొన్ని సంవత్సరాలు గా జరుగుతుందన్నారు. నూటికి 80% మంది రైతులకు మద్ధతు ధర అందక పోవడం విదానంలో నే రైతాంగం పై పాలకులకు ఎంత శ్రద్ద వుందో అర్థం అవుతుందన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులకు తరలి వస్తున్న పెసర, మొక్క జొన్న,సోయాబీన్,జొన్నపంటలకు కూడా కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) రైతులకు అందడం లేదన్నారు.కేంద్రం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించకపోగా రైతులు ధాన్యం నిల్వు చేసుకునే స్వేచ్ఛ ను కూడ హరించివేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఇందూరి సాగర్ వివిద పార్టీ ల ,ప్రజా సంఘాల నాయకులు పాలడగు నాగార్జున, తుమ్మల వీరా రెడ్డి, ఎండి సలీం,శ్రీశైలం,రాంచంద్రం,ప్రబావతి దండంపల్లి సత్తయ్య, సరోజ,అరుణ,అశోక్ రెడ్డి, నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.