- అదే సమయంలో చర్చలకు కూడా రావాలి
- చర్చలు సరుపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది
- వ్యవసాయ చట్టాలను నిలుపుదల చేసే విధంగా కేంద్రం ఆలోచించాలి
- రైతుల ఆందోళనలపై సుప్రీమ్ కోర్టు విచారణ
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును నిలిపి ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టు తెలిపింది. అలాగే నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉన్నా రోడ్లను దిగ్బంధించడం సరికాదని, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం, నిరసనలపై దాఖలైన పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపి వేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ, అది జరిగే అవకాశం లేదని పేర్కొంది. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందుగానే కాదనవొద్దని, దయచేసి సలహాను పరిశీలించాలని చెప్పారు. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.
తదుపరి విచారణ వింటర్ వెకేషన్లో జరుగుతుందని తెలిపారు. జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ తాము స్వతంత్ర వ్యవసాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తున్నామన్నారు. ఈలోగా నిరసనలు కొనసాగవొచ్చునని, పోలీసులు ఎటువంటి హింసకు పాల్పడరాదని తెలిపారు. రైతులు ఈ విధంగా నగరాన్ని దిగ్బంధించరాదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాథమిక హక్కుపై ఆంక్షలు విధించేది లేదన్నారు. పంజాబ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన పి చిదంబరం మాట్లాడుతూ, వాళ్ళు గుంపు కాదు, వాళ్ళు రైతులు. అయితే రోడ్లను బ్లాక్ చేసినది పోలీసులు అని చెప్పారు. రోడ్లను దిగ్బంధిస్తున్నామని ప్రకటించిన రైతు సంఘం ఏదైనా ఉందా అని అడిగారు. రైతులు మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు తెలిపింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పందిస్తూ, రైతులు కూడా అలాగే అనుకోవొచ్చునన్నారు.