Take a fresh look at your lifestyle.

రైతుల ఆందోళన… తొలగని ప్రతిష్టంభన..

చట్టాలపై చర్చించటానికి అభ్యంతరం లేదన్న తోమర్‌

రైతు సంఘలు, కేంద్రం మధ్య ఐదవ రౌండ్‌ ‌సమావేశం జరుగుతుంది. నెలకొన్న ప్రతిష్టంభన తొలగి పోతుందని రైతులతో పాటు వారికి మద్ధత్తు తెలిపే వారు ఎదురు చూస్తున్నారు. కనీస మద్ధతు ధర(ఎంఎస్‌పి) కొనసాగింపు, రైతుల నుంచి పంట సేకరణ విధానం గురించి రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐతే రైతులు కోరుతున్నది మాత్రం మూడు వ్యవసాయ బిల్లుల రద్దు. ఇది రైతుల మొదటి డిమాండ్‌. ‌దీని తర్వాతే మిగతావి అని రైతులు అంటున్నారు. శనివారం ఐదవ రౌండ్‌ ‌చర్చల కోసం 35 రైతు సంఘాల ప్రతినిధులతో ముగ్గురు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ప్రభుత్వం చర్చలకు కట్టుబడి ఉందని, వ్యవసాయ చట్టాలపై రైతుల అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌రైతులకు హామీ ఇచ్చారు. తోమర్‌తో పాటు, రైల్వే, వాణిజ్య, ఆహార మంత్రి పియూష్‌ ‌గోయల్‌, ‌పంజాబ్‌కు ఎంపిగా ఉన్న రాష్ట్ర వాణిజ్య మంత్రి సోమ్‌ ‌ప్రకాష్‌,‌విజ్ఞాన్‌ ‌భవన్‌లో రైతు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. తన ప్రారంభ వ్యాఖ్యానంలో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌రైతులతో చర్చలకు కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ చట్టాలపై రైతుల అభిప్రాయాలను స్వాగతిస్తున్నామని రైతులకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోకపోతే రైతు సంఘాలు చర్చల నుండి బయటకి వొస్తాయని అఖిల భారత కిసాన్‌ ‌సంఘర్ష్ ‌సమన్వయ కమిటీ(ఎఐకెఎస్సిసి) సభ్యుడు సమావేశానికి ముందే చెప్పారు. సింగూ సరిహద్దు నుండి మాట్లాడుతున్న రైతు నాయకుడు జగ్మోహన్‌ ‌సింగ్‌ ‌పాటియాలా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ‘‘ఈ పోరాటం ఒక దశ, ఒక మోర్చా, ఒక వాయిస్‌ అవుతుంది’’ అని జగ్మోహన్‌ ‌సింగ్‌ ‌పాటియాలా అన్నారు.

రైతులతో సమావేశానికంటే ముందు కేంద్ర మంత్రులు అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లినట్లు ఏఎన్‌ఐ ‌వార్తా సంస్థ రిపోర్ట్ ‌చేసింది. ప్రతిష్టంభనను తొలగించటానికి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కొనసాగింపు మరియు రైతుల నుంచి పంట సేకరణ విధానం గురించి రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్రాతపూర్వక హామీ అనేది ప్రభుత్వం చూపుతున్న..ఓ మెట్టు దిగటం అనే చర్య.. అనేది స్పష్టం. అంటే ప్రభుత్వం రైతులను శాంతింపచేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఇంటిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కొన్ని గంటల తరువాత, వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్రం మరియు రైతుల మధ్య ఐదవ రౌండ్‌ ‌చర్చలు ప్రారంభమయ్యాయి. మరో వైపు దేశ సరిహద్దుల చుట్టూ వేలాది మంది రైతులు క్యాంపింగ్‌ ‌చేసి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. కనీస మద్ధతు ధర గురించి కేంద్రం పదేపదే హామీ ఇస్తున్నా కూడా రైతులు మాత్రం కోరుతున్నది మూడు చట్టాల రద్దుతో పాటు రానున్న విద్యుత్‌ ‌బిల్లు 2020 నిలుపుదల. ఈ వారంలో రెండు రౌండ్ల చర్చలు జరిగాయి. గత సంవత్సరాలలో జరిగిన రైతు నిరసనలతో పోల్చితే ఇది అతిపెద్ద రైతు నిరసనగా కొనసాగుతున్నది.

డిసెంబర్‌ 8, ‌మంగళవారం రైతులు దేశవ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం, ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 40 మంది రైతు సంఘాలు సమావేశమైనప్పుడు, దేశ రాజధానికి తీసుకుపోయే అన్ని రహదారులను అడ్డుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైవే టోల్‌ ‌గేట్లను కూడా ఆక్రమించు కుంటామని రైతులు ప్రకటించారు. వ్యాపారుల సంఘం రైతుల బంద్‌ ‌పిలుపుకు మద్దతు ఇచ్చింది. రైతుల నిరసనకు మద్దతుగా పలువురు బాలీవుడ్‌ ‌నటులు, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, రవాణా సంఘాలు ముందుకు వొచ్చాయి. ఈ వారం ప్రారంభంలో, పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌నిరసనగా తన పద్మ అవార్డును వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నిరసనల సమయంలో మూడు మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలు కేంద్రం యొక్క అమానవీయత వలన సంభవించాయని రైతులు ఆరోపించారు. శీతాకాలం చల్లని వాతావరణంలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నా నిరసనల సందర్భంగా మరణించిన రెండు రైతుల కుటుంబాలకు పంజాబ్‌ ‌ప్రభుత్వం తలా 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. మరో వైపు వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను వెంటనే తొలగించాలని సుప్రీమ్‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు అయి వుంది. ‘‘చల్లని శీతాకాలంలో ఢిల్లీ సరిహద్దులలో నిరసన వ్యక్తం చేస్తున్న లక్షలాది మంది రైతుల జీవితం తక్షణ ముప్పులో ఉంది అని ఇక్కడ కొరోనావైరస్‌ ‌వ్యాధి వ్యాప్తి జరిగితే అది దేశ వినాశనానికి కారణమవుతుంది’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం కనీస మద్దత్తు ధర హామీ మాకు వొద్దు..మూడు వ్యవసాయ చట్టాల రద్దు కావాలి..అని డిమాండ్‌ ‌చేస్తున్న రైతుల ప్రతినిధులయిన సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే టీ నీళ్లు కూడా తాగటం లేదు. చర్చలకు పోయేటప్పుడు తమతో నీళ్లు.. టీ నీళ్లు.. భోజనం తీసుకుపోతున్నాయి. ప్రభుత్వంతో రాజీకి తావులేదనే సంకేతాలు రైతు సంఘాలు బల్ల గుద్ది మరీ ఇస్తున్నాయి.

కేంద్రం యొక్క మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు మద్ధతుగా పద్మశ్రీ మరియు అర్జున అవార్డు గ్రహీతలతో సహా పంజాబ్‌ ‌నుండి పలువురు మాజీ క్రీడాకారులు శనివారం అవార్డులను తిరిగి ఇచ్చారు. తమ అవార్డులను రాష్ట్రపతికి తిరిగి ఇచ్చే ందుకు శనివారం జాతీయ రాజధాని సింగు సరిహద్దు వద్ద క్యాంపింగ్‌ ‌చేస్తున్న రైతుల వద్దకు చేరనున్నారు. ‘‘మేము ఈ రోజు బయలుదేరాం.. రైతుల నిరసనలో పాల్గొంటాము’’ అని పద్మశ్రీ మరియు అర్జున అవార్డు గ్రహీత మాజీ రెజ్లర్‌ ‌కర్తార్‌ ‌సింగ్‌ అన్నారు. ఆరోగ్యం లేదా ఇతర సమస్యల కారణంగా మాతో చేరలేని సజ్జన్‌ ‌సింగ్‌ ‌చీమా వంటి చాలా మంది మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా పురస్కారాలను తమకు ఇచ్చారని కర్తార్‌ ‌సింగ్‌ ‌చెప్పారు. అవార్డులను తిరిగి ఇవ్వడానికి రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ను సమయం కోరినట్లు క్రీడాకారులు తెలిపారు. ‘‘రాష్ట్రపతిని కలవడానికి సమయం ఇవ్వకపోతే మేము ఆదివారం రాష్ట్రపతి భవన్‌ ‌వెలుపల మా అవార్డులను ఉంచుతాము’’ అని మాజీ హాకీ ఆటగాడు రాజ్బీర్‌ ‌కౌర్‌ ‌తెలిపారు. మరో వైపు ట్రాన్స్‌పోర్ట్ ‌యూనియన్‌ ‌రైతులకి మద్ధతు తెలుపుతూ బంద్‌కి మద్దతు ఇస్తున్నాయి. ప్రభుతం చట్టాలలో కొన్ని మార్పులు చేసేందుకు ముందుకు వొచ్చే అవకాశం వుంది. ఐతే రైతులు అడుగుతున్నది మూడు చట్టాలలో మార్పు కాదు మూడు చట్టాల రద్దు.

Leave a Reply