Take a fresh look at your lifestyle.

రైతులకు ధాన్యం ధరలు జమ కావడం లేదు

  • ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లపై విమర్శలు మానాలి
  • ఇల్లందకుంట మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్‌ ‌నేతలు

కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్‌ ‌నేతలు సందర్శించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి తదితరులు ఇక్కడ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్‌.. ‌ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు గుప్పించారు. తామే రాజకీయాల కోసం రాలేదని, ఇప్పుడు ఎలక్షన్స్ ‌కూడా లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికే వచ్చామని ఉత్తమ్‌ ‌పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు చేసిన వరి, మొక్కజొన్నకు సంబంధించి ఒక్కపైసా రైతులకు అందలేదని ఉత్తమ్‌ ఆరోపించారు. రైతులందరికీ మద్దతుధర కల్పించాలని ప్రభుత్వాన్ని ఉత్తమ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యానికి కేంద్రం ప్రకటించిన రూ.1,800కు మరో రూ.700 కలిపి మొత్తం రూ.2,500కు కొనుగోలు చేస్తున్నారని, కేసీఆర్‌కు దమ్ముంటే తనతో కలిసి ఛత్తీస్‌గఢ్‌, ‌రాజస్తాన్‌ ‌రావాలని ఉత్తమ్‌ ‌సవాల్‌ ‌విసిరారు. రైతుబంధు గురించి మాట్లాడుతున్న కేసీఆర్‌ ఏ ‌పంటకు ముందు రైతుబంధు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం రెండోసారి ఏర్పడి ఇన్ని రోజులైనా రుణమాఫీ చేయలేదని, పంటలు ఎప్పుడు చేతికి వస్తాయో, బస్తాలు ఎప్పుడు తెప్పించాలో తెలియని దద్దమ్మలు మమ్మల్ని విమర్శిస్తారా అని ధ్వజమెత్తారు. తెలంగాణలో వలస కార్మికులు ఎంతమందో చెప్పలేని ప్రభుత్వం వాళ్లను ఆదుకుంటుందా అని ప్రశ్నించారు. బత్తాయి ఆరోగ్యానికి మంచిదని చెప్పిన కేసీఆర్‌ ఎం‌దుకు బత్తాయిలను ప్రభుత్వ పక్షాన కొనుగోలు చేయట్లేదని ప్రశ్నించారు. అధికారంలో లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం తాము పోరాడుతా మన్నారు.

తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ‌జాగీరు కాదన్న విషయాన్ని గ్రహించాలని టీపీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రైతుల గోస ఊరికేపోదని, సీఎంకు రైతులు తాలుగాళ్లయ్యారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ‌నాలుగుసార్లు కేబినెట్‌ ‌సమావేశం నిర్వహిస్తే ఒక్కసారీ రైతుల పంట నష్టం గురించి మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. సీఎం స్థాయిని మరిచి కేసీఆర్‌ ‌మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న తాము దద్దమ్మలం, సన్నాసులం, అనడం ఆయన విజ్ఞతకే చెల్లిందన్నారు. కేసీఆర్‌ ‌నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవసాయ శాఖ వైఫల్యం వల్ల రైతులకు ఎకరాకు రూ.10వేల మేర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి కోహెడ మండలంలోని బస్వాపూర్‌ ‌గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవన్‌ ‌రెడ్డి.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాలుగువేల కోట్ల విలువైన పంట దిగుబడి నష్టం వాటిల్లిందన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ఈ రోజే మొదలు కాదని, అఖరు కూడా కాదని, ఈ విధానం ఎప్పటి నుంచో ఉందని జీవన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాల వల్ల ప్రతి రైతు క్వింటాల్‌కు 5 కిలోలు నష్టపోతున్నారని చెప్పారు. తేమ పేరిట రైతులను దగా చేస్తున్నారని్గ •ర్‌ అయ్యారు. వ్యవసాయ మంత్రి వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలా మోసం జరుగుతుందో తాను నిరూపిస్తానని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రకటనలు చూస్తేనేమో కడుపు నిండుతుందని, క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం కడుపు ఎండుతుందని జీవన్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply