నందిగామలో మంత్రి తన్నీరు హరీష్‌రావు
రైతులను సంఘటితం చేసి, వారిని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం పటాన్ చెరు మండలం నందిగామలో నిర్మించిన రైతు వేదికను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతు వేదికలు రైతులకు చర్చా వేదికలుగా మారాలన్నారు. ముఖ్యంగా లాభదాయక పంటలపై ఎక్కువగా చర్చలు జరగాలన్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ తదితర వర్గాల వారందరికీ సంఘాలు ఉన్నాయనీ, సంఘం లేని వారు రైతులు మాత్రమేనన్నారు. అలాంటి రైతులను సంఘటితం చేసి, అన్ని విధాలా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుందన్నారు వ్యవసాయానికి ప్రభుత్వం సంవత్సరానికి దాదాపు 35 వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తుందన్నారు.
కాలంతో, కరెంటుతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే స్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఎరువులు విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నాం, రైతులు పండించిన పంటలను మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 600 కోట్లు ఖర్చు పెట్టి 2605 రైతు వేదికలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చడంలో ముఖ్యమంత్రి కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. రైతులందరూ రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.
అదే విధంగా అమీన్పూర్ మున్సిపాలిటీల్లో నూతనంగా రైతు వేదికను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పటాన్ చెరు పట్టణంలో కోటి 60 లక్షలతో నిర్మించనున్న గాంధీ థీమ్ పార్కు కు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హమీని నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశామన్నారు. పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని హంగులతో పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుందన్నారు. ఆ పక్కనే స్టేడియం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ స్థాయి వైద్యశాలను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కూమర్,ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధూ ఆదర్శ్ రెడ్డి, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, నందిగామ సర్పంచ్ ఎర్రోళ్ల ఉమావతి గోపాల్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాండు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.