ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ :మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఉధృతంగాహొ ఆందోళన చేస్తున్న రైతులకు ఏపీ, తెలంగాణ ఏఐకేఎస్ నేతలు మద్దతు పలికారు. ఈనెల 25, 26 తేదీల్లో సింఘు,ఘాజిపూర్ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించామని రైతు సంఘం నేతలు తెలిపారు.
శనివారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో ఏపీ, తెలంగాణ ఏఐకేఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈనెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఈ నేతలు, సమావేశం అనంతరం రైతాంగ సమస్యలు,రైతు ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సింఘు, ఘాజీపూర్ సరిహద్దులకు వెళ్ళి ఆందోళన చేస్తున్న రైతులతో సంప్రదింపులు జరిపారు. గతంలో తాత్కాలిక టెంట్లు, శిబిరాలు ఉన్న స్థానంలో ఇప్పుడు రైతులు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య తెలిపారు.
ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళన కాస్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా సుదీర్ఘ పోరాటంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని, ఇప్పటికే 20 రాష్ట్రాలకు పైగా రైతు ఉద్యమం విస్తరించిందని తెలిపారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఉద్యమం కాదని, రాబోయే రోజుల్లో ఏపీలో గ్రామ గ్రామన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు.
100 రోజుల రైతు ఉద్యమాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, అవసరమైతే మరోసారి భారత్ బంద్ నిర్వహించేందుకు రైతు సంఘాలు ఆలోచన చేస్తున్నాయని రావుల వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వెళ్లి వచ్చాక కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది అనిహొ పస్య పద్మ అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి వెళ్ళాక వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా మాట్లాడడం మానేశారని, కేసీఆర్, మోడీలకు ఏమాత్రం మానవత్వం లేదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పస్య పద్మ అన్నారు.
వ్యవసాయ చట్టాల వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, చిన్న సన్నకారు రైతులు తమ పంటలను దేశంలోని ఇతర మార్కెట్లకు ఎలా తీసుకువెళ్తారని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మద్దతు ధర, మార్కెట్ వ్యవస్థ ఉంటుందని చెప్తూ రైతులను మోసం చేసే ప్రచారం చేస్తున్నారని పద్మ వ్యాఖ్యానించారు. కాగా, సాగు చట్టాలు మంచివైతే రైతులు, ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ప్రధాని ఆలోచించుకోవాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ సూచించారు.
ప్రధాని మోడీ రైతు ఉద్యమాన్ని చిన్న చూపు చూడటం దుర్మార్గమని, ఎవరి ఉత్పత్తులకు వారు ధరలు నిర్ణయించుకుంటున్న సమయంలో కేవలం రైతులు మాత్రం తమ పంటలకు ధరనుహొ నిర్ణయించుకోలేక పోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వక పోగా ప్రైవేటీకరణ పేరుతో దేశంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ప్రసాద్ ఎద్దేవా చేశారు.