Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాల రద్దుకు.. రైతుల ఒక రోజు నిరాహార దీక్ష

  • దిల్లీలో రైతుల ఉద్యమం ఉధృతం..పలు రాష్ట్రాల్లో నిరసనలు
  • నూతన చట్టాలు రద్దు చేసేవరకు ఆపేది లేదంటున్న రైతులు
  • చర్చలు కొనసాగిస్తామంటున్న ప్రభుత్వం..రంగంలోకి హోమ్‌ ‌మంత్రి అమిత్‌షా

ఢిల్లీ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతు నాయకులు దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌ ‌షాను సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌కలిశారు. నవంబర్‌ ‌నెల ఆఖరు నుండి వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల సమీపంలో శిబిరాలు వేసుకుని నిరసన ప్రదర్శనలు చేస్తున్న నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు మరియు కార్మిక సంఘాల మద్దతుతో రోడ్ల మూసివేతలో భాగంగా గత మంగళవారం రహదారులు దిగ్బంధనం తరవాత దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండవ పెద్ద నిరసనను రైతులు మొదలు పెట్టారు. రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తూ సోమవారం ఒక రోజు ఉపవాసం పాటించారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌సోమవారం మాట్లాడుతూ, చర్చల తదుపరి తేదీని నిర్ణయించడానికి ప్రభుత్వం రైతు నాయకులతో మాట్లాడుతున్నదని తెలిపారు. కేంద్రంతో పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ, కొత్త చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని రైతులు కూడా స్పష్టం చేశారు. ‘‘మన వ్యవసాయ రంగానికి వెనక్కి నెట్టే తిరోగమన చర్యలు చేపట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలు తీసుకువచ్చాం’’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. ‘‘మరో సమావేశం ప్రభుత్వం ఖచ్చితంగా జరుపుతుంది. మేము రైతులతో మాట్లాడుతున్నాం’’ అని తోమర్‌ ‌చెబుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంది. రైతు నాయకులు తదుపరి సమావేశానికి ఎప్పుడు సిద్ధంగా వున్నది నిర్ణయించి తెలియజేయాలని తోమర్‌ ‌రైతు సంఘాలను కోరారు.

మరో వైపు దేశవ్యాప్తంగా కొత్త కేంద్ర చట్టాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు జిల్లా కమిషనర్ల కార్యాలయాల వెలుపల నినాదాలు చేస్తూ పంజాబ్‌ ‌మరియు హర్యానా రాష్ట్రలలో సోమవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పంజాబ్‌లో లుధియానా, పాటియాలా, సంగ్రూర్‌, ‌బర్నాలా, బతిండా, మోగా, ఫరీద్‌కోట్‌, ‌ఫిరోజ్‌పూర్‌, ‌టార్న్ ‌తరన్‌ ‌సహా పలు జిల్లాల్లో నిరసనలు జరిగాయని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. హర్యానాలో, ఫతేహాబాద్‌, ‌జింద్‌, ‌సిర్సా, కురుక్షేత్ర, గుర్గావ్‌, ‌ఫరీదాబాద్‌, ‌భివానీ, కైతాల్‌ ‌మరియు అంబాలాలో కూడా నిరసనలు జరిగాయి.

Leave a Reply