Take a fresh look at your lifestyle.

రైతు విలాపం!!

ఏవి తల్లీ నిరుడు వెల్లి విరిసిన
హాలికుల ధరహాసాలు..
నేడన్నీ రోడ్డెక్కిన బతుకుల్ని
చూసిన అవహేళనా పరిహాసాలే!
ఏవి తల్లీ నిరుడు కురిసిన
సకాల వర్షాలు..
నేడన్నీ వెన్నువిరిచిన వాయు
గండపు పెనుతుఫాన్లే!
ఏవి తల్లీ రైతు రాజ్యమేలిన
నిరుటి పల్లె వైభవాలు..
నేడన్నీ గిట్టుబాటు లేక వలసలు
పోతున్న కర్షక వ్యధలే!
ఏవి తల్లీ మట్టికి రైతుకి పట్టం
గట్టి ప్రాకులాడిన ఆ రోజులు..
నేడన్నీ మనసులేని మమత
లేని వట్టి కాగితపు బతుకులే!
ఏవి తల్లీ రైతు రాజులా బతికి
హారతులందుకొన్న ఆ వేళలు..
నేడన్నీ మద్దతుధర కోసం దేహీ
అంటూ రోడ్లపాలైన ఆర్థింపులే!
ఏవి తల్లీ దున్నేవాడిదే పైచేయిగా
వెలిగిన కాంతుల రోజులు..
నేడన్నీ కార్పోరేట్‌ ‌రాబందుల్ని
వాలకుండా సలిపే పోరాటాలే!
హక్కులకోసం పాలకుల పెనునిద్దుర
వదిలించే చావోరేవో తెగింపులే!!

– భీమవరపు పురుషోత్తం, 9949800253

Leave a Reply