Take a fresh look at your lifestyle.

కేంద్రం తాజా ఆహ్వానాన్ని తిరస్కరించిన రైతు సంఘాలు

నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వొస్తేనే చర్చలకు సిద్ధం

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్రం రైతులను అప్రతిష్టపాలు చేయాలని చూస్తుందని విమర్శించారు. రైతులు చర్చలకు సిద్ధంగా లేరని
అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రైతులను మోసం చేయాలని చూస్తుందని చెప్పారు. దీనిపై రైతుల ఐక్య వేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు.వ్యవసాయ చట్టాలను వెనక్కితీసు కోవాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాల నేతలు చర్చించారు.

అనంతరం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, సవరణలు చేస్తామంటూ గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామని తెలిపారు. రాతపూర్వక హామీలతో కేంద్రం ముందుకు రావాలన్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మరోసారి డిమాండ్‌ ‌చేశారు. పంటలకు కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్‌ ‌సిఫారసులకు అనుగుణంగా చట్టం తేవాలని డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి లిఖిత పూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామని తేల్చి చెప్పారు. చర్చలు సఫలం కావడానికి అనువైన వాతావరణం కేంద్రం కల్పించాలన్నారు. కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. సాగు చట్టాలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 28వ రోజుకు చేరుకున్నాయి. చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన రైతులు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు మూతపడ్డాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానా జాతీయ రహదారులపై టోల్‌ ‌ఛార్జీల వసూలును అడ్డుకోనున్నాయి.

చర్చలకు రండి
మీకు ఏం కావాలో చెప్పండి

మా ప్రతిపాదనల్లో మీకు నచ్చనివి తొలగిస్తాం
రైతు సంఘాలతో కేంద్రమంత్రి తోమర్‌

- Advertisement -

కేంద్ర ప్రతిపాదనలపై చర్చించేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌ ‌కోరారు. ‘మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసిన ప్రతిపాదనల్లో అదనంగా ఏమైనా కలపాలంటే కలుపుతాం, లేదా మీరు కోరితే వేటినైనా
తొలగిస్తాం అన్నారు. మీకు అనువైన తేదీ కోసం ఎదురు చూస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే పాండమిక్‌ ‌సమయంలో కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డ్ ‌కింద ఈ 8 నెలల్లో రైతులకు లక్ష కోట్లను బ్యాంకులు వారికి అందజేసినందుకు వాటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి అన్నదాతలు తమలో తాము చర్చించుకుని కేంద్రంతో చర్చలకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.

కాగా తమను రైతు సంఘాలుగా చెప్పుకొంటున్న వాటితో ప్రభుత్వం రోజూ చర్చలు జరుపుతోందని, కానీ వాటికి తమకు సంబంధం లేదని రైతుల పక్షాన పోరాటం జరుపుతున్న యోగేంద్ర యాదవ్‌ అన్నారు. మా ఆందోళనతో వాటికి ప్రమేయం లేదన్నారు. మమ్మల్ని ప్రభుత్వం ప్రతిపక్షంగా చూస్తోందని ఆయన ఆరోపించారు. అటు-ఈ నెల 23 నుంచి 26 వరకు ‘షాహీద్‌ ‌దివస్‌’ ‌గా పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇక పశ్చిమ బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ బుధవారం సింఘు బోర్డర్‌ ‌చేరుకొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీకు మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. మరోవైపు రైతు చట్టాలకు మద్దతుగా ప్రభుత్వానికి 3 లక్షల సంతకాలతో కూడిన పత్రాలు అందాయి.

Leave a Reply