Take a fresh look at your lifestyle.

పోరాట దిక్సూచి రైతు ఉద్యమం

‘‌రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం’ బాగుపడదన్న సత్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, తీవ్ర ఆలస్యంగానైనా గుర్తుచేసుకోవడం జరిగింది. కానీ, ఈ ఆలస్యానికి సుమారు 750 మంది రైతులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించారు. వందలాదిమంది కేసుల పాలయ్యారు. సంవత్సర కాలంగా, భార్యలు, భర్తలకు, భర్తలు, భార్యలకు తల్లితండ్రులు పిల్లలకు దూరమైన ప్రభావం వెలకట్టలేనిది. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు కోరిన మోడీ ప్రభుత్వం రైతుల అమరత్వానికి బాధ్యత వహించాలి. ఆయా కుటుంబాలకు నష్ట పరిహారం తో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్షణమే అందించాలి. రైతుల పై ఈ సంధర్భంగా పెట్టిన అన్ని కేసులను బేషరతుగా ఎత్తి వేయాలి. భవిష్యత్తు లోనూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌హస్తాలకు అప్పగించబోమని హామినివ్వాలి.

దేశ ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో యావత్‌ ‌భారత రైతులు నవ భారత నిర్మాణానికి దిక్సూచిగా నిలిచారు. ఈ చట్టాలను రద్దు చేసేవరకు కదిలేది లేదని సంవత్సర కాలంగా ఘజిపూర్‌, ‌సింఘా , టిక్రి ప్రాంతాల్లో నిరవధికంగా ఉద్యమంలో పాల్గొంటున్న రైతులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతీ రైతు రాజకీయాలకు అతీతంగా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపిన ప్రతీ పక్షం హర్షించదగ్గ విజయమిది. అన్ని రకాలుగా దేశ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోదగ్గ సంఘటన. దీర్ఘకాలిక ఉద్యమ ఆవశ్యకతను, అవసరాలను, సహనాన్ని , త్యాగాలను చాటిచెప్పిన విప్లవమిది. ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోక తప్పదని రుజువు చేసిన పొరాటమిది. అన్నింటికి మించి రాజ్యం సృష్టించిన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ, అభాండాలను చిత్తు చేస్తూ, చీలిక కుట్రలను తిప్పికొడుతూ కొనసాగించిన ఐక్యత రాబోయే రోజుల్లో ఉద్యమాలకు ఒక గ్రంధాలయం లాగా పనిచేస్తుంది. చేసిన ప్రతిన నెరవేరే వరకు అననుకూల వాతావరణ పరిస్థితుల్లో బాధలను దిగమింగుతూ కుటుంబాలకు దూరంగా సమన్వయంతో సాగించిన శాంతి సమరం ప్రపంచ ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఉద్యమ ప్రారంభం నుండి అది ఎదుర్కొన్న సవాళ్లు, దాడులు, నిర్బంధాలు, కేసులు, అణచివేతలు, కుట్రలను ఎదుర్కొని నిలిచి గెలిచిన ఈ ఉద్యమంపై రానున్న రోజుల్లో ఎన్నో పరిశోధనలు, గ్రంథాలు రావడం తథ్యం.

అయినప్పటికీ రాబోయే పార్లమెంట్‌ ‌సమావేశాల్లో చట్టాల రద్దుకు చట్టపరమైన చర్యలన్నీ పూర్తయ్యే వరకు వెనక్కి మళ్ళేది లేదని రైతు ఉద్యమ నేత రాకేష్‌ ‌తికాయత్‌ ‌చేసిన ప్రకటన ప్రభుత్వం పట్ల తమ అపనమ్మకాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా చట్టాల రద్దు ఒక్కటే తమ ఉద్యమ లక్ష్యం కాదని, కనీస మద్దతు చట్టాన్ని సాధించడం కూడా అని గుర్తుచేయడం ద్వారా ఇది సంపూర్ణ విజయం కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ అసంపూర్తి, అపనమ్మకాల అనుభవం నుంచి చట్టాల రద్దు, వాటి అమలును నిలువరిస్తుందా అన్న సందేహాలకు ఆస్కారమిస్తే ఆశ్చర్యం ఏమి లేదు. అంటే పార్లమెంటరీ ప్రక్రియ రీత్యా చట్టాలు రద్దుచేసినప్పటికీ ఆచరణలో వాటి అమలు కూడా రద్దు అవుతుందని భావించలేము. ఎందుకంటే ఎలాంటి చట్టాలు లేకుండానే ఆచరణలో జరిగిపోతున్న ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు ఇప్పటికే కళ్ళముందు ఉన్నాయి. చట్టం లేకున్నా ప్రభుత్వ పాలసిగా అమలుచేస్తున్న అంశాలు అనేకం కనబడుతున్నాయి. ప్రజలకు అనుకూలంగా ఉన్న చట్టాలనేమో దుర్వినియోగం చేయడం, చట్టాలు లేకపోయినా ప్రజలను పీడించే, దోచుకునే విధానాలను అవలంభించడం దేశ పాలకులకు కొత్తేమి కాదన్న సంగతి మరవరాదు.ఆ అనుభవాల దృష్ట్యా చట్టాల రద్దు మాత్రమే, కాకుండా ఆచరణ రద్దు కూడా జరిగేలా రైతులు, ఉద్యమకారులు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

చట్టాల రద్దు ప్రకటన పశ్చాత్తాపంతోనో, దేశ రైతుల మీద ప్రేమ , సానుభూతితోనో చేసింది కాదన్న స్పష్టత ప్రజలందరికీ ఉండాలి. మోడీ ప్రసంగిస్తూ తాము చేసిన చట్టాలు చిన్న, సన్నకారు రైతుల బాగు కోసమేనని, కానీ వారికి అర్థం అయ్యేలా, నమ్మకం కలిగేలా చేయడంలో విజయవంతం కాలేకపోయామని ప్రకటించారు. అంటే తాము చేసిన చట్టాల్లో తప్పేమీ లేదని, తప్పంతా రైతులను తప్పుదోవ పట్టించిన వర్గాల దేనని నిందిస్తూనే, ఎవరిని నిందించడం లేదని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ప్రధాని మోడీ ప్రకటన రాజనీతిజ్ఞతను సూచిస్తుందని చేసిన ట్వీట్‌ ‌లోనే మరి ఇంతకాలం ఆ రాజనీతిజ్ఞత ఎక్కడికి పోయిందో కూడా చెప్తే బాగుండేది. చట్టాల రద్దు వెనక రైతు ఉద్యమం సృష్టించిన అనివార్యత ఉంది. ఈ ఉద్యమం వల్ల దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో తన ప్రభుత్వం మీద పోగైన వ్యతిరేకత ఉంది. అలాగే లఖీమ్‌ ‌పూర్‌ ‌ఖేరిలో రైతులను హత్య చేసిన తన క్యాబినెట్‌ ‌మంత్రి అజయ్‌ ‌మిశ్రా కొడుకు ఆశిష్‌ ‌మిశ్రా వ్యవహారాన్ని చల్ల బరచే ప్రయత్నం కూడా దాగి ఉంది. ఎందుకంటే ఈ అంశాలు రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్న విషయం వారికి తెలుసు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తుందని, అది జాతీయ ఎన్నికల్లో గాలి దుమారం లాగా మారి తమను అధికార పీఠానికి దూరంగా నెట్టివేయనుందని తెలిసి చేపట్టిన దిద్దుబాటు చర్యల్లో భాగమే చట్టాల రద్దు. ‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం’ బాగుపడదన్న సత్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, తీవ్ర ఆలస్యంగానైనా గుర్తుచేసుకోవడం జరిగింది. కానీ, ఈ ఆలస్యానికి సుమారు 750 మంది రైతులు తమ ప్రాణాలను మూల్యంగా చెల్లించారు. వందలాదిమంది కేసుల పాలయ్యారు. సంవత్సర కాలంగా, భార్యలు, భర్తలకు, భర్తలు, భార్యలకు తల్లితండ్రులు పిల్లలకు దూరమైన ప్రభావం వెలకట్టలేనిది. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణలు కోరిన మోడీ ప్రభుత్వం రైతుల అమరత్వానికి బాధ్యత వహించాలి. ఆయా కుటుంబాలకు నష్ట పరిహారం తో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్షణమే అందించాలి. రైతుల పై ఈ సంధర్భంగా పెట్టిన అన్ని కేసులను బేషరతుగా ఎత్తి వేయాలి. భవిష్యత్తు లోనూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌హస్తాలకు అప్పగించబోమని హామినివ్వాలి.

ఏది ఏమైనా చట్టాల రద్దు కు అనివార్యతను సృష్టించిన అన్నదాతలకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో లేబర్‌ ‌కోడ్‌ ‌ల ఉపసంహరణకు కార్మికులు – విద్యా కార్పొరేటీకరణ, కాషాయికరణ కు వ్యతిరేకంగా విద్యార్థులు, విద్యావంతులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు- ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలకు (మానేటైజేషన్‌) ‌వ్యతిరేకంగా ప్రజా సంఘాలు – పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టాల సవరణలకు వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు, ఆదివాసులు దేశ ప్రజల మద్దతు, సంఘీభావం తో ఉద్యమ దిశగా సాగడానికి రైతు ఉద్యమం ఉత్ప్రేరకం లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.
– చుంచు శ్రీశైలం.

Leave a Reply