సిఎం కెసిఆర్ సహా పలువురి సంతాపం
సిఎం కెసిఆర్ సంతాపం
దేవీప్రియ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు… కవిగా, రచయితగా, కార్టూనిస్టుగా దేవీప్రియ ఎంతో కృషి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ’గాలిరంగు’ రచన మచ్చుతునకగా వర్ణించారు. హాస్పిటల్ నుంచి ఆయన పార్థివదేహాన్ని అల్వాల్‌లోని స్వగృహానికి తరలించారు. ఆయన మృతి పట్ల తెలుగు సాహితీ ప్రపంచం సంతాపం ప్రకటించింది. పలువురు సాహితీప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగు సాహితీలోకానికి దేవిప్రియగా సుపరిచితులైన షేక్ ఖాజా హుస్సేన్ కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు.
ప్రజాతంత్ర, హైదరాబాద్ : కవి, జర్నలిస్ట్ దేవిప్రియ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కవి, అమ్మ చెట్టు, గాలిరంగు లాంటి అత్యుత్తమ సంకలనాలతో కేంద్ర సాహిత్య అవార్డు పొందిన దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని ఆయన అన్నారు. అచ్చ తెలుగు కవిత్వం, అలతి అలతి పదాలతో అల్లుకున్న కవిత్వం దేవిప్రియదని…కనుమరుగు కావడం కవిత్వం కోల్పోయిన ఒక శకమని అన్నారు. ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.