Take a fresh look at your lifestyle.

‌ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారవు కన్నుమూత

  • సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ప్రముఖ వైద్యులు, రేడియాలజిస్ట్, ‌నిమ్స్ ‌డైరెక్టర్‌గా పేరుగాంచిన డాక్టర్‌ ‌కాకర్ల సుబ్బారావు వయోభారంతో కన్నుమూశారు. కిమ్స్ ‌హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కాకర్ల సుబ్బారావు నెల రోజుల క్రితం కిమ్స్ ‌హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. సుబ్బారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.1956లో హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌డైరెక్టర్‌గా సేవలందించారు. 2000 సంవత్సరంలో ఆయన పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు.
సిఎం కెసిఆర్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు ప్రముఖుల సంతాపం నిమ్స్ ‌మాజీ డైరక్టర్‌, ‌ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్‌ ‌కాకర్ల సుబ్బారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. నిమ్స్ ‌డైరక్టర్‌గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. కాకర్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ‌తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
డాక్టర్‌ ‌కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవానిరతి, అంకితభావం వైద్యులకు ఆదర్శనీయమని చెప్పారు. డాక్టర్‌ ‌సుబ్బారావు మృతిపట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌సంతాపం ప్రకటించారు. వైద్య రంగానికి కాకర్ల అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నిమ్స్ ‌డైరెక్టర్‌గా కాకర్ల చేసిన కృషి ఎనలేనిది అని తెలిపారు. ఈ సందర్భంగా కాకర్ల కుటుంబ సభ్యులకు మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply