Take a fresh look at your lifestyle.

బెడిసి కొట్టిన వ్యాక్సిన్‌ ‌ప్రచారం… వెంటాడుతున్న దుష్ఫలితాల భయం

కొరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు కానీ, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, రాజకీయ నాయకుల ప్రకటనలు ఈ వ్యాక్సిన్‌ అం‌టే బాబోయ్‌ ‌వద్దనే పరిస్థితికి తీసుకుని వొచ్చాయి. ఇదొక వేలం వెర్రిలా తయారైందన్న విశ్లేషకుల వ్యాఖ్య వాస్తవానికి దగ్గరగా ఉంది. ఈ వ్యాక్సిన్‌ ‌తయారీలో ఆక్స్‌ఫర్డ్ ‌కంపెనీ రెండు ట్రయిల్స్ ‌పూర్తి చేసుకుని మూడో ట్రయిల్‌ను త్వరలో పూర్తి చేసుకుని వొచ్చే క్రిస్టమస్‌ ‌నాటికి వ్యాక్సిన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మన దేశంలో కూడా సిరం కంపెనీ, తదితర కంపెనీలు ఈ వ్యాక్సిన్‌ ‌తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌ ‌వాడకంపై లోకల్‌ ‌సర్కిల్స్ అనే సంస్ధ దేశంలో 225 జిల్లాల్లో సర్వే నిర్వహించగా, 61 శాతం మంది వ్యాక్సిన్‌ ‌పట్ల విముఖంగా ఉన్నట్టు తేలింది. ఈ వ్యాక్సిన్‌ ‌ఫలితం గురించి వొస్తున్న వార్తలు వారీ అభిప్రాయానికి రావడానికి ప్రధానకారణమని తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ‌తయారీ అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇవ్వడం వల్ల సహజంగానే వ్యాపార ధోరణి చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో పోటీకే ప్రాధాన్యం.

అందువల్ల తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ ‌చేసుకునే కంపెనీలు ఎదుటి కంపెనీల ఉత్పత్తులపై బురద జల్లేందుకు వెనుకాడరు. వినియోగదారునికి ఈ విషయం తెలిసినా, ఏది మంచో, ఏది చెడో తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు. వొచ్చే ఏడాది ఆరంభంలో ఈ వ్యాక్సిన్‌ ‌వొస్తే వేయించుకుంటారా అన్న ప్రశ్నకు 51 శాతం మంది నిరాసక్తిని ప్రదర్శించినట్టు సర్వేలో వెల్లడైంది. ఈ వ్యాక్సిన్‌ ‌వాడితే సైడ్‌ ఎఫెక్టస్ ‌వొస్తాయన్న ప్రచారం విస్తృతంగా జరగడమే ఇందుకు కారణమని స్పష్టం అవుతోంది. నిజానికి సైడ్‌ ఎఫెక్టస్ ‌రావని వ్యాక్సిన్‌ ‌తయారీ కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, భయాన్ని పుట్టించే ప్రకటనలకే ప్రాధాన్యం లభించడం దురదృష్టకరం. అసలు కొరోనా వ్యాప్తి కూడా ఇలాంటి ప్రకటనల వల్లే ప్రజల్లో భయాన్ని వ్యాపింపజేసింది. జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉన్న మాట నిజమే అయినప్పటికీ అతిగా భయ పెట్టే ధోరణుల వల్ల కొరోనా మరణాలు సంభవిస్తున్నట్టు వినికిడి.

రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానంలో కొరోనా వ్యాక్సిన్‌ను ప్రధానాంశంగా చేర్చడం వల్ల దీని పట్ల ప్రజలకు విముఖత ఏర్పడిందన్న వార్తల్లో అసత్యం లేదు. రాజకీయ పార్టీల వాగ్దానాలన్నీ బూటకాలే కనుక, ఒక వేళ ఈ పార్టీలు ఉచితంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసినా అది పని చేయదేమోనన్న అనుమానం జనంలో ఏర్పడింది. లోకల్‌ ‌సర్కిల్స్ ‌నిర్వహించిన సర్వేలో ఉచితంగా టీకా వేస్తామన్నా వొద్దు బాబోయ్‌ అని 51 శాతం మంది అంటున్నట్టు తేలింది. టీకా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారూ లేకపోలేదు. వివిధ సంస్థల మధ్య పోటీ వల్ల మంచి ఉత్పత్తి మార్కెట్‌లోకి వొస్తుందన్న మాట నిజమే కానీ, ఈ పోటీ అనారోగ్యకరమైన రీతిలో సాగుతున్నందున మొదటికే మోసం వొస్తుందేమోనని పలువురు ఆందళన వ్యక్తం చేస్తున్నారు. మరో వంక కొరోనా ప్రభావం మన దేశంలో బాగా తగ్గుతోందని ప్రభుత్వమే ప్రకటిస్తున్న దృష్ట్యా, ఈ లోగా వ్యాక్సిన్‌ ఎం‌దుకు, జాగ్రత్తలు పాటిస్తే సరిపోదా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. సంప్రదాయకంగా జాగ్రత్తలు పాటించేవారు కొరోనా తమ జోలికి రాదన్న ధీమాతో ఉన్నారు. మూతికి గుడ్డలు కట్టుకోకపోయినా, వీధుల్లో వెళ్ళేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు పై కండువాను అడ్డు పెట్టుకోవడం మన సంప్రదాయం. అలాగే, దూరం పాటించడం కూడా గుంపుల్లోకి, సమూహాల్లోకి దూసుకుని వెళ్ళేవారు కొంతమందే ఉంటారు. దాన్ని పాటించేవారు ఎప్పుడూ భద్రంగానే ఉంటారు. అలాగే, బయటికి వెళ్ళి వొస్తే కాళ్ళు కడుక్కోవడం మన సంప్రదాయం. దానిని పాటించేవారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అందువల్ల కొరోనా కోసమే కాకుండా సంప్రదాయకంగా ఆరోగ్య నియమాలు, పద్ధతులు పాటించేవారు ఎప్పుడూ ఆరోగ్యప్రదమైన జీవనాన్ని సాగిస్తూనే ఉంటారు.

అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నిక మరి కొద్ది రోజుల్లో జరగనున్న దృష్ట్యా, అక్కడ మళ్ళీ పెరుగుతున్న కొరోనా కేసులను ప్రధాన పార్టీల అభ్యర్ధులు ట్రంప్‌, ‌జో బైడెన్‌లు ఉపయోగించుకుంటున్నారు. మన దేశంలో బీహార్‌లో సైతం కొరోనాని ఎన్నికల అంశం చేసేశారు. నిజానికి బీహార్‌ ఎన్నికల్లో ఈ అంశాన్ని తీసుకుని వొచ్చింది బీజేపీయే. అక్కడ మహాఘట్‌బంధన్‌ ‌తరఫున ఆర్‌జెడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ ‌ప్రచారంలో దూసుకుని పోతుండటంతో బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికే కొరోనా టీకాను ఉచితంగా పంపిణీ చేస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ తెరమీదికి తెచ్చింది. అలాగే, అమెరికాలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు ఈసారి ఓడిపోతానన్న భయం పట్టుకుంది. దాంతో కొరోనా గురించి అతిగా ప్రకటనలు చేస్తున్నారు. ఆయనను ఎదుర్కోవడానికి అసలు కొరోనా అమెరికాలో అధికంగా వ్యాపించడానికి ట్రంప్‌ ‌విధానాలే కారణమని బైడెన్‌ ‌తిప్పికొడుతున్నారు. కొరోనా వ్యాక్సిన్‌ ఇం‌కా ట్రయిల్స్ ‌దశలోనే ఉంది. ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం సామెత చందంగా కొరోనా వ్యాక్సిన్‌ని ఎన్నికల ప్రచారంలోకి రాజకీయ పార్టీలు బలవంతంగా తీసుకుని రావడం వల్ల దాని పట్ల విశ్వాసం సన్నగిలుతోంది. అందుకే 61 శాతం మంది వ్యాక్సిన్‌ ‌వద్దు అని అంటున్నట్టు సర్వేలో తేలింది. కొరోనా వ్యాక్సిన్‌పై ప్రచారం బెడిసి కొట్టిందనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి.

Leave a Reply