Take a fresh look at your lifestyle.

భగ్గుమన్న వాణిజ్య గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర

  • ఒకేసారి రూ.266 పెరిగిన 19 కిలోల సిలిండర్‌ ‌ధర
  • గృహ వినియోగ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెరుగుదలపై ప్రజల్లో ఆందోళన

జాతీయ చమురు మార్కెటింగ్‌ ‌కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఒకేసారి అమాంతంగా రూ.266 రూపాయలు పెంచాయి. పెరిగిన గ్యాస్‌ ‌ధర నవంబర్‌ 1 ‌నుండి అమలులోకి వొచ్చింది. గత ఏడేళ్లలో ఇంత ఎక్కువ మొత్తం ఒకేసారి పెరుగడం ఇది మొదటిసారి. గృహ వినియోగ గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర పెంపుకు ఇది నాందిగా భావించవచ్చు. ముడి చమురు ధరల పెరుగుదలతో ముడిపడి ఉన్న ధరల పెరుగుదల సవరణలు అసాధారణం కానప్పటికీ ఇంత భారీగా పెరుగుదల వీటిని వినియోగించే రెస్టారెంట్లు, ఫుడ్‌ ‌కోర్టులు టీ స్టాల్స్‌కు ఆందోళన కలిగిస్తుంది.

దీని ప్రభావం పరోక్షంగా సామాన్యులపై ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ పెరుగుదల తర్వాత 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ‌ధరలు ఢిల్లీలో రూ.1,734 నుండి 2,000.50 లకు మరియు ముంబైలో 1,950 లకు, కోల్‌కతాలో 2,073.50 లకు చెన్నైలో 2,133 లకు, హైదరాబాద్‌లో 2,175 లకు చేరుకున్నాయి. వాణిజ్య సిలిండర్‌ ‌ధరలో భారీ పెరుగుదల 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ‌రీఫిల్‌ ‌ధరలో భారీ పెరుగుదలకు నాంది కావచ్చు. ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలు దీన్ని పెంచడానికి దీపావళి వరకు వేచి ఉండవచ్చని, తర్వాత గృహాలు ఉపయోగించే రీఫిల్‌ల ధరను పెంచే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె. జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..ఎల్‌పిజిపై చమురు కంపెనీల అండర్‌ ‌రికవరీ నివేదికలతో గృహ వినియోగ వంటగ్యాస్‌ ‌ధరల పెరుగుదల అనివార్యమని అన్నారు. ప్రభుత్వం ప్రతి వాణిజ్య సిలిండర్‌పై పంపిణీదారుల కమీషన్‌ను 121 నుండి 138కి పెంచిందని, ఇది కూడా తాజా ధరల పెరుగుదలకు కారణమైందని, డిస్ట్రిబ్యూటర్లు స్టాక్‌ను సేకరించడంపై పెట్టవలసిన అధిక పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుని కమీషన్‌ ‌పెంచబడిందని ఆయన అన్నారు.

Leave a Reply