Take a fresh look at your lifestyle.

రాజ్యం కుత్తుకపై వేలాడుతున్న కత్తి ఫైజ్‌ అహ్మద్‌

Faiz Ahmed is the sword hanging over the kingdom

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు సైతం వీధుల్లోకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో యూనివర్సిటీలు రణ కేంద్రాలుగా మారుతున్నాయి. జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఐఐటి కాన్పూర్‌ ‌విద్యార్థి లోకం డిసెంబర్‌ 17‌న ఆందోళన చేపట్టింది. ఆ సందర్భంగానే ‘‘హమ్‌ ‌దేఖేంగే’’ కవితను నినాదంగా వినిపించారు. హిందూ మత ఛాందసవాదులకు ఈ కవిత ఆలపించడం నచ్చలేదు. అసలు రుచించనూ లేదు. అందుకనే వక్ర దృష్టితో దీన్ని వివాదం చేశారు ఆ కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ ‌విఎన్‌ ‌శర్మ. విద్యార్థులు ఆలపించిన ‘‘హమ్‌ ‌దేఖేంగే’’ కవితతో హిందువుల మనోభావాలు గాయపరిచారని ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి ఈ కవిత పాకిస్తాన్‌ ‌సైనిక నియంత రాకాసి పాలనపై నిరసిస్తూ రాయబడింది. చీకటి రాజ్య పాలనపై తన రచనల ద్వారా దండయాత్ర చేసిన ఫైజ్‌ అహ్మద్‌ ‌హిందూ వ్యతిరేకిగా కనిపించడం శోచనీయమే. పాకిస్తాన్‌ ‌ప్రభువు జియా ఉల్‌ ‌హక్‌ ‌నియంత పాలనపై 35ఏళ్ల క్రితం లాహోర్‌ ‌స్టేడియంలో వేలాదిమంది సమక్షంలో ఇక్బాల్‌ ‌భానో గాయకురాలు తన నోట గానం చేయడం సంచలనం సృష్టించింది. అక్కడ జనంలో చైతన్యాన్ని పాదుగొల్పేందుకు దోహదపడింది. ఇప్పుడు అదే కవిత భారత్‌లో మార్మోగుతుంది.

అయితే ఆ కవితను అర్థం చేసుకోక పోవడం కాదు కావాలని వివాదం చేశారు. పాకిస్తాన్‌ ‌రాజ్యంపై హక్కులకోసం, స్వేచ్ఛా వాయువుల కోసం నినదించిన ‘హమ్‌ ‌దేఖేంగే’ వివాదం కావడం ఏంటి? ఆ కవితలో ‘అల్లా’ పేరు ఉండటమేనా? ఉంటే అది వివాదం ఎందుకు అవుద్ది. జనంలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు ఫైజ్‌ అహ్మద్‌ ఆ ‌పేరును వాడారు. స్వతహాగా కమ్యూనిస్టు అయిన ఫైజ్‌ అమ్మద్‌ ‌దాన్ని సాధనంగా వాడుకున్నారు. అలా ప్రజల్ని తన కవితల ద్వారా ప్రభావితం చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టమవుతోంది. ఆ కవిత చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో రాశారు. అది ఆలోచింపజేస్తుంది. ప్రశ్నించడాన్ని నేర్పుతుంది. ఆ కవిత తీరుతెన్నులను ఓసారి గమనిద్దాం..

హమ్‌ ‌దేఖేంగే!
‘‘ మేము చూస్తాం
తప్పకుండా మేమంతా చూస్తాం
మనకు వాగ్దానం చేయబడిన ఆ రోజును
శాశ్వతమైన ఫలకం మీద రాయబడిన ఆ రోజును
మేం తప్పకుండా చూస్తాం
దుర్మార్గమైన నియంతృత్వ పర్వతాలు
దూదిపింజల్లా ఎగిరిపోవడం
మనలాంటి పీడితుల పాదాల కింద నేల
దడ దడా కంపించిపోవడం
పాలకుల శిరస్సుల మీద ఉరుములు మెరుపులు కురవడం
మేం చూస్తాం
దైవ భూమి నుంచి అబద్దాల విగ్రహాలు విసిరి వేయబడతాయి
పవిత్ర మందిరాల నుంచి వెలివేయబడ్డ
మనలాంటి సామాన్యులు పీఠాలు అధిష్టిస్తారు
కిరీటాలు గాల్లో ఎగిరి పోతాయి
సింహాసనాలు కూలిపోతాయి
అది మేం చూస్తాం
కేవలం అల్లా పేరే ఉంటుంది
అతను కానరాడు కానీ మన మధ్యనే ఉంటాడు
అతడే దృశ్యం, అతడే చూపు ఒకే ఒక్క నినాదం నింగినంటుతుంది
అది నువ్వు.. అది నేను ప్రభువు సృష్టించిన వాళ్లే పాలకులవుతారు
అది నువ్వు అది నేను
మేం చూస్తాం
ఆ రోజు తప్పకుండా మేం చూస్తాం’’
అంటూ ఫైజ్‌ అహ్మద్‌ ‌ప్రకటించాడు.

ఆయన బతికి ఉన్నప్పుడే నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. జైలు జీవితాన్ని గడిపాడు. ఇప్పుడాయన లేకున్నా..ఆయన కవిత్వంపై నిర్బంధం ఏర్పడుతుంది. దాన్ని ఆలపించడం నేరమే(ద్రోహం) అవుతుంది. ఫైజ్‌ అహ్మద్‌ ‌రచనలకి కులం లేకున్నా, మతం లేకున్నా, ప్రాంతం లేకున్నా అక్షరానికి సంకెళ్ళు తప్పడం లేదు. అది కవిత్వం కావచ్చు, పాట కావచ్చు, పద్యం కావచ్చు..ఏదైనా నియంతృత్వ పాలనలో కారు చీకట్లను చీల్చుకుంటూ వెలుగు రేఖల్ని ప్రసరిస్తయి.

– మామిండ్ల రమేష్‌ ‌రాజా
7893230218

Leave a Reply