ప్రభుత్వాలు ఎంత నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నా కొరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. తెల్లవారేసరికి వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. బయటికిపోతే ఏ రూపంలో తమకు అంటుకుంటుందోనని ఒక పక్క భయపడుతూనే, వెళ్ళకుండా ఉండలేని పరిస్థితిలో అగమ్యగోచరంగా కాలం గడుపుతున్నారు. దేశంలో ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై లక్షలు దాటినట్లు ప్రభుత్వ లెక్కలే లెక్కలు చెబుతున్నాయి. గడచిన ఒక్క రోజున్నే ఆరవై రెండు వేల పైచిలుకు కేసులు నమోదు అయినాయంటేనే వైరస్ ఏమేరకు విస్తరిస్తుందో అర్థమవుతోంది. ఆగస్టు నెలంతా జాగ్రత్తగా ఉండాలని ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నా, ప్రభుత్వాలు సడలించిన లాక్డౌన్ నేపథ్యమే ఈ పెరుగుదలకు కారణమవుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కన్నా ప్రాణాలు ముఖ్యమన్న విషయాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టడమే ఇందుకు కారణమంటూ వారు విమర్శిస్తున్నారు. కేసుల పెరుగుదల కూడా సామాన్యంగా లేదు.
ఊహకు అందనిరీతిలో నమోదు అవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడు పడడంలేదు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నా, వైద్యసేవలను ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లతోపాటు, ప్రైవేటు హాస్పిటళ్లల్లో చికిత్సలు జరుగుతున్నా సంఖ్య తగ్గడంగాని, స్థిరంగా ఉండడంగాని జరగడంలేదు. మొదట్లో లాగా పదులు, వందలు కాకుండా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆరవై రెండు వేల పైబడి కేసులు నమోదవుతుండడం రానున్నరోజుల్లో మరెంత ఘోరాన్ని చవిచూడాల్సివస్తుందో నన్నది అర్థం కావడంలేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య భారీగానే పెరుగుతోంది. ఇక్కడి పాజిటివ్ కేసులను చూస్తుంటే కోవిడ్ వాక్సిన్ వచ్చేలోగా ఎంతటి భయంకర వాతావరణం నెలకొంటుందోనన్న భయం అందరిలో ఉంది. ఏపిలో గత ఇరవై నాలుగు గంటల్లో పదివేల పాజిటివ్ కేసులు నమోదు అయినాయంటేనే వైరస్ తీవ్రతను అర్థంచేసుకోవచ్చు.
తెలంగాణలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య డెబ్బై వేలకు చేరుకుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లోనే రెండువేలకు పైనే కేసులు నమోదైనాయంటే వైరస్ వ్యాప్తిని అంచనా వేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు లేదా మూడింతలు పెరిగినా పెరుగవచ్చని అధ్యయన సంస్థలు అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర అయితే ఇక చెప్పనలవి కాదు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లు కూడా ఇందుకే మాత్రం తీసిపోవు. పెద్దగా సొమ్ము చెల్లించి ప్రైవేటు హాస్పిటళ్లల్లో చికిత్స చేయించుకోలేకపోతున్నవారు ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారనుకున్నా, ఎంఎల్ఏ స్థాయివారు కూడా వ్యాధి నుండి బయటపడలేక బలైపోతున్న వాస్తవం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది. ఇదిలాఉంటే ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ వైరస్‌కు తొలి వ్యాక్సిన్ భారత్‌లో అందునా తెలంగాణలోనే ఉత్పత్తి కానుందని ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. ఇది కొంతవరకు ఆశాజనకమైన విషయం. హైదరాబాద్‌కు చెందిన మూడు ఫార్మా కంపెనీలు ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం అగ్రభాగాన ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ తయారీ, మార్కెట్లోకి విడుదల చేయడం తదితర అంశాలన్నిటినీ దాటుకుని ప్రజలవద్దకు చేరడానికి ఇంకా ఎంతకాలంపడుతుందో తెలియదు. ఇప్పటివరకు కేవలం నగరాలకే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా అంటుకుంటోంది.
లాక్‌డౌన్‌కాలంలో ఎంతో కట్టుదిట్టంగా తమ గ్రామాలను కాపలా కాసి సంరక్షించుకున్న జనం మూడవ విడుత లాక్డౌన్ సడలింపుతో కొనసాగుతున్న విచ్చలవిడితనం గ్రామాలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. వలసకూలీలు, అంతర్రాష్ట్ర వ్యాపారుల రాకపోకలతో వైరస్ వ్యాప్తి మొదలైందని అధ్యయనకారులంటున్నారు. అమెరికా లాంటి దేశాలు మాత్రం ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇదే సందేశాన్నిస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌కు రోజులు దగ్గరపడుతున్నాయంటూనే, ఇందుకు సంబంధించిన వ్యాక్సిన్ నవంబర్ మూడవ తేదీనాటికి అందుబాటులోకి వస్తుందని జోస్యం చెప్పడాన్ని బట్టి, వ్యాక్సిన్ ఉత్పత్తి పరుగుపందెంలో ఏ దేశం, ఏ రాష్ట్రం ముందు వరుసలో నిలుస్తుందోగాని, ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా వ్యాక్సిన్‌కోసం ఎదురుచూస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ వ్యాధికారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షా ఆరవై వేలు దాటింది. దాదాపుగా యాభై లక్షలమంది వ్యాధి బారిన పడ్డారు. ట్రంప్ అన్నట్లు వ్యాక్సిన్ రావడానికి నవంబర్ వరకు ఆగాలంటే అప్పటి వరకు మరెంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో మరి.