Take a fresh look at your lifestyle.

మసకబారుతున్న బీజేపీ ప్రభావం

నిన్నటి సంచిక తరువాయి..
కాని నా అంచనా ఏమిటంటే, ఉత్తరప్రదేశ్‌ ‌లోని వెనకబడిన వర్గాలలో బీజేపీ అనుకూల హిందుత్వ అనుకూల ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నదని. దీనికి కారణం కేంద్రంలో బలమైన ఓబీసీ నాయకుడు కనిపించకపోవడం ఒకటైతే, రాష్ట్రంలో కూడా ఓబిసికి చెందిన బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేశవ్‌ ‌ప్రసాద్‌ ‌మౌర్య కూడా యోగి ఆదిత్యనాథ్‌ ‌ముఖ్యమంత్రిత్వంలో పూర్తిగా అప్రధానమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. బిజెపి కూడా కేశవ్‌ ‌ప్రసాద్‌ ‌ని అతని మాటల గారడీతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నది. నిజానికి మోడీ స్వయంగా తాను ఓబీసీ అని చెప్పుకున్నప్పటికీ ఓబిసి వర్గాల ప్రజల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర ప్రదేశ్‌, ‌బీహార్‌ ‌రాష్ట్రాలలో ప్రజలు ఆయన్ని ఇక ఎంత మాత్రం బీసీల ప్రతినిధిగా భావించటం లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తరువాత ఆయనను కార్పొరేట్ల ప్రతినిధిగానే ఓబిసి వ్యవసాయక వర్గాల ప్రజలు భావించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతే కాదు ఆయనను సాంప్రదాయక అగ్రవర్ణాల భావజాల మైన ‘‘హిందుత్వ’’ ప్రతినిధిగానే వారు భావిస్తున్నారు. అంతేకాదు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించటం కూడా ఆయనకున్న ఓబిసి ఇమేజిని పూర్తిగా మసకబార్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వర్గాల తీవ్ర ఒత్తిడికి లోనై తీసుకువచ్చిన ఇటువంటి రాజ్యాంగేతర సవరణల వల్ల ఓబిసి వర్గాల యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.

ఈ తీవ్ర వ్యతిరేకతను సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆ యువత వెలిబుచ్చింది. ఆలిండియా వైద్య కోర్సుల విషయంలో కూడా ఓబిసి రిజర్వేషన్లను అమలు పరచడంలో నష్ట కరంగా వ్యవహరించిన తీరు వల్ల కూడా ఓబిసి యువతలో బీజేపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత నెలకొని ఉంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యకు వ్యతిరేకంగా తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తీసుకున్న చర్యలకు బీహార్‌ ఉత్తరప్రదేశ్‌ ఓ ‌బి సి యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వైద్య కోర్సుల్లో ఓబీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించడాన్ని హర్షిస్తూ హిందీ మాట్లాడే రాష్ట్రాల ఓబిసి యువత నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ‌కు సాంఘిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. సమాజంలో బలమైన గొంతుక కలిగిన ఓబిసి నాయకత్వం కూడా బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకోవటానికి మరో కారణం ఏమిటంటే జస్టిస్‌ ‌జి రోహిణి కమిషన్‌ ‌నివేదిక ఆధారంగా ఓబిసి రిజర్వేషన్లను వర్గీకరించడానికి బిజెపి పూనుకోవడమే. ఈసారి ఓబీసీ నాయకత్వం బిజెపికి వ్యతిరేకంగా తీవ్రమైన విమర్శలు ఎక్కుపెట్టింది. వ్యవసాయం, జనాభా లెక్కల విషయంలో సమస్యలు దేశంలోని మిగిలిన అన్ని వర్గాల వలనే ఓబిసి ప్రజానీకం కూడా ద్రవ్యోల్బణం, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నది. యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలవల్ల యూపీలో ఉద్యోగిత తగ్గిపోయి నిరుద్యోగిత ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయింది.

అంతేకాదు పాలు ఇవ్వలేని మిగులు పశువుల వల్ల, అవి వ్యవసాయ క్షేత్రాలను పాడు చేస్తూ ఉండటం వల్ల కూడా వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌ ‌లాంటి పెద్ద రాష్ట్రంలో వ్యవసాయదారులలో కూడా ఓబీసీలు సింహభాగం. సమాచార హక్కు చట్టంలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌ ‌లో కిసాన్‌ ‌సమ్మన్‌ ‌నిధి పథకం వర్తించే ఓబిసి వ్యవసాయదారుల శాతం 41.5 అని రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.కానీ నా అంచనా ప్రకారం ఓబిసి వ్యవసాయదారుల శాతం ఉత్తర ప్రదేశ్లో 52 కు తగ్గకుండా ఉంటుంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ ‌హర్యానా రైతాంగంతో పాటు ఉత్తర ప్రదేశ్‌ ‌రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నది. అందులో ఓ బి సి రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొన్నదనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాన్ని అణచి వేసిన తీరు పట్ల ఓబిసి వ్యవసాయదారులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.ఇక మూడవది మరీ ముఖ్యమైనది ఏమిటంటే కులగణన డిమాండును బిజెపి మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చటమే. కుల గణనకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వల్ల బీజేపీపై ఓబిసి వర్గాలకు తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కలిగింది. ఈ అసంతృప్తిని ర్యాలీ ల ద్వారా సెమినార్‌ ‌ల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఆయా వర్గాలు ఒక్క చోట కాదు వారణాసి, ఘాజీపూర్‌, ‌జాన్పూర్‌, ‌లక్నో వంటి అనేక ప్రాంతాలలో తెలియజేశాయి.

ఇక అంబేద్కర్‌ ‌భావజాలం
ఇక నాలుగవది మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఓబిసి యువత అంబేద్కర్‌ ‌భావజాల ప్రభావంలోకి క్రమంగా మారుతూ ఉండటం,అంబేద్కర్‌ ‌భావజాలం ఆ యువతలో క్రమంగా బలపడుతూ ఉండటం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నారాయణ గురు, అయ్యంకాళి, పెరియార్‌, ‌జ్యోతిబాపూలే, సాహు జి మహారాజ్‌, ‌సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్‌ ‌వంటి పేర్లు కేవలం మేధావి వర్గాలకు మాత్రమే తెలిసేవి. కానీ చదువుకున్న ఓబిసి యువత, దళిత యువత యొక్క కృషి వల్ల ఈ పేర్లు ఇప్పుడు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామంలో ప్రతిధ్వనిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. సోషల్‌ ‌మీడియా దీనికి ఉత్ప్రేరకంగా పని చేసింది అనటం లో సందేహం లేదు. గమనించవలసిన మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే 2014 తరువాత ఈ సామాజిక న్యాయ భావజాలం అనేది ఈ యువత యొక్క కృషి వల్లనే పెద్దఎత్తున ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం బహుజన సమాజ్‌ ‌పార్టీ, సమాజ్వాదీ పార్టీ కాదని గ్రహించాలి. రాజకీయ పరమైన చాలా కారణాల వల్ల అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌కానీ, మాయావతి కానీ, తమ ప్రధానమైన రాజకీయ భావజాలం అయిన ‘‘సామాజిక న్యాయం’’ గురించి పెద్దగా మాట్లాడక పోవడం ఇటీవలి సంవత్సరాల్లో మనం గమనించవచ్చు.

తమపై ఉన్న కేసులను కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరిగి తెరుస్తాయి అన్న భయం కూడా ఒక కారణం కావచ్చు. కానీ లక్షలాదిగా తయారవుతున్న చదువుకున్న చైతన్యవంతమైన దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు ఆ భయం లేదు కదా.యువత చేసిన ప్రయత్నాలతో ఆ ప్రభావం వారి మట్టుకే కాక ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, రైతులు కూడా ప్రభావితం అయ్యారు. ఇది ఇక్కడితో ఆగకుండా ఈ ప్రభావం 2014 నుండి బీజేపీ నాయకత్వానికి మోకరిల్లుతున్న ఓబిసి, దళిత రాజకీయ నాయకత్వానికి కూడా తెలిసిపోయింది. ఈ కారణాల వల్ల ఉత్తర ప్రదేశ్‌ ‌లో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కూటమి తాము నిర్మించామని చెప్పుకుంటున్నా విభజన ఆధారిత, మతవిద్వేష ఆధారిత కోటకు పగుళ్ళు ఏర్పడ్డాయి అని చెప్పక తప్పదు. అయితే సమీప భవిష్యత్తులో ఏం జరుగనున్నది అన్న విషయం చెప్పటం కష్టం.కానీ, ఒక్కటి మాత్రం చెప్పగలను, రేపటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నిక బిజెపికి ఎంతమాత్రం నల్లేరు మీద నడక కాదు.
– ఉర్మిలేష్‌, ‌న్యూ దిల్లీ, ‘ది హిందూ’ సౌజన్యంతో…
అనువాదం :టి. హరికృష్ణ
జిల్లా అధ్యక్షులు,మానవ హక్కుల వేదిక
ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ,సెల్‌:9494037288

Leave a Reply