Take a fresh look at your lifestyle.

అసమాన ప్రతిభాశాలి వెంకటసుబ్బన్న

కడప వెంకటసుబ్బన్న. తెలుగు సాహిత్యంలో అసమాన ప్రతిభాశాలి. అవధాన ప్రక్రియలో అందె వేసిన చేయి. సహస్రాధిక అవధాన కార్యక్రమ నిర్వహణా దురందరులు. అవధానాలు మాత్రమే కాక, పురాణ ప్రబందాలను అలవోకగా రచించిన సవ్యసాచి.
సి.వి. సుబ్బన్న.(కడప వెంకటసుబ్బన్న) అద్భుతమైన ప్రతిభ, అనన్యసామాన్యమైన వ్యుత్పత్తి, అసాధారణమైన అభ్యాసం కలిగిన శతావధాని. వర్ణన, సమస్యాపూరణం, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, నిషేధాక్షరి మొదలైనా ఏ అంశాన్నయినా అలవోకగా నిర్వహించగలిగిన సరస్వతీ పుత్రుడు. వెయ్యికి పైగా అవధానాలు నిర్వహించిన ఘనత ఆయనదే. సుబ్బన్న కడప జిల్లా ప్రొద్దుటూరు లో నవంబరు 12 , 1929 న కడప రంగమ్మ చెన్నప్ప దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య ప్రొద్దుటూరులో, సెకండరీ విద్య అనీబిసెంట్ మునిసిపల్ హైస్కూలులో,  ఇంటర్మీడియట్ మదనపల్లి అనీబిసెంట్ కళాశాలలో జరిగింది. తరువాత డిగ్రీ, ఎం.ఎ.  ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి పూర్తి చేశారు. కె.సుబ్బ రామప్ప పర్యవేక్షణలో అవధాన విద్య అనే విషయం పై పరిశోధనచేసి మైసూరు విశ్వవిద్యాలయం నుండి 1981లో పి.హెచ్.డి పట్టాను పొందారు. అదే సంవత్సరం అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటుతో ఆయనను
సత్కరించారు.
ఆంధ్ర దేశాన్ని అవధానాలతో ఉర్రూతలూపి, పద్యాన్ని పశువుల కాపరి దాకా తీసుకుపోయిన తిరుపతి వేంకటకవులు గ్రంథాలు రచించి తమ పద్యావిద్యా ప్రతిభను ప్రదర్శించినట్లే, సి.వి. సుబ్బన్న శతావధాని కూడా శతానేక అవధానాలు చేసి పదికి పైగా పద్య గ్రంథాలు రచించారు. సుబ్బన్న అనేక ప్రాంతాల్లో చేసిన అవధానాల్ని క్రోడీకరించి మూడు సంపుటాలుగా ముద్రించారు.  ఆమూడింటిని కలిపి శతావధాన ప్రబంధం త్రిపుటిః పేరుతో బృహద్గ్రంధాన్ని ప్రచురిం
చారు. శ్రీ భద్రాచల రామదాస ప్రబంధం, దివ్యలోచన ప్రబంధం (ధనుర్దాసు) భోజకువింద చరిత్రము, గోపవధూ కైవల్యము, త్రివేణి, దుర్భిక్షము, పల్లెపదాలు, కళావాహిని, తీయని త్రోవ, నైవేద్యము, అష్టావక్రుడు, పురందరదాసు, కుంతి, చెంచులక్ష్మి (నాటకం), శ్రీ వీరాంజనేయ శతకం, శ్రీకృష్ణశతకం, శ్రీ రామలింగేశ్వర శతకం, శ్రీ వేంకటేశ్వర శతకం అనే గ్రంథాల్ని రచించి ప్రచురించారు. అవధాన విద్యను గూర్చి ఆయన రచించిన సిద్ధాంత గ్రంథాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారు ముద్రించారు.
‘శ్రీ వ్యాసవిలాస ప్రబంధము’ను డా||సి.వి.సుబ్బన్న 2004లో మొదటి ముద్రణగా వెలువరించారు. తర్వాతి సంవత్సరమే ఇది రెండవ ముద్రణకు నోచుకొని, అశేష  ప్రజాదరణ పొందింది. అష్టాదశ పురాణాల రచనయే గాకుండా పంచమ వేదమైన భారత రచనకు నడుం బిగించి,  మహావిష్ణువు అవతారమైన వ్యాసుని జీవిత పూర్వాపరాలను ప్రబంధంగా రచించడం ద్వారా ప్రతిభ తేట తెల్ల మయింది.
శ్రీ వ్యాసవిలాస ప్రబంధము’లో ఏడుఆశ్వాసాలలో… ప్రతి ఆశ్వాసంలోనూ కథను సక్రమంగా నడిపించటానికి, ఆయా సన్నివేశాలకు ప్రత్యేక శీర్షికలుంచటం,  అరుంధతీ పాణి గ్రహణంతో ప్రథమాశ్వాసం ప్రారంభమై, తర్వాత పరాశరజననం, వసురాజు, శుక్తిమతి మత్స్యగంథి వృత్తాంతాలు, సద్యోగర్భంలో వ్యాసుడు మత్స్యగంథికి పరాశరునికి జన్మించటం, శంతనుడు గాంగేయుని భీష్మ ప్రతిజ్ఞ తదితర అంశాలను మూలాన్ని విభేదించకుండా రాయడం అద్భుత రచనా సృష్టికి, సామర్థ్యానికి తార్కాణం.
2007లో ప్రథమ ముద్రణగా వెలువరించిన ప్రబంధం ‘భద్రాచల శ్రీరామదాస ప్రబంధము’, భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచెర్ల గోపన్న జీవిత చరిత్రను, ఆనాటి చారిత్రక విశేషాలను పద్య ప్రబంధంగా సుబ్బన్న రచించారు.
 సంస్కృత సమాస భూయిష్టంగా పద్యాన్ని ఎలా కూర్చారో, తేట తెలుగు పదాలతో పద్యాన్ని అలాగే భావం, విషయం, పటుత్వం తగ్గకుండా జేయగలిగిన గొప్ప ప్రతిభాశాలి.
సుబ్బన్న.  మొదటి అవధానం ప్రొద్దుటూరులో 1950వ సంవత్సరంలో శివరాత్రి పర్వదినం నాడు చేశారు. చివరి అవధానం 1997లో ఫిబ్రవరి 25వ తేదీన పేరాలలో చేశారు. ఈ మధ్య కాలంలో అంటే 47 సంవత్సరాల పాటు వెయ్యికి పైగా అష్ట,  శతావధానాలు చేశారు. భారత దేశమంతా తిరిగి అవధాన ప్రతిభా సామర్థ్యాన్ని నిరూపించు కొన్నారు. షష్టిపూర్తి తర్వాత కూడా ధారణ తగ్గకుండా అవధానాలు చేసి అందరి మెప్పులు పొందిన సరస్వతీ పుత్రులు సుబ్బన్న శతావధాని.
సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్ఠులైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి, చెలమచెర్ల రంగాచార్యులు, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి, డా.దివాకర్ల వేంకటావధాని, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి , గంటిజోగి సోమయాజి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి , డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి, ఆరుద్ర వంటి వారెందరో పృచ్ఛకులుగా సుబ్బయ్య అవధానాలలో పృచ్చకులుగా వ్యవహరించిన గొప్పతనాన్ని మూట కట్టుకున్నారు.
ప్రబంధ రచనలో, కవిత్వ పటుత్వ సంపదలో సాటిలేని మేటిగా పేరెన్నిక గన్నారు. పద్యానికి కాలం చెల్లిందను కొంటున్న కాలంలో, పెద్ద కావ్యాలకు ఆదరణ కరువు అవుతున్నది అనుకునే  సమయంలో ఛందోబద్ధంగా అద్భుత ప్రబంధాల్ని రచించి సహృదయ పాఠకుల, శ్రోతల  మన్ననలను పొందిన సి.వి.సుబ్బన్న శతావధాని ప్రజ్ఞ అనన్య సామాన్యం. అవధాన ప్రక్రియను తిరుపతి వేంకట కవులు కొప్పరపు సోదరుల తర్వాత విశేషంగా వ్యాప్తి చేసిన సాహితీవేత్తగా సుబ్బన్నకు పేరుంది.
1964లో గుర్రం జాషువా అధ్యక్షతన వీరికి భట్టిప్రోలులో కనకాభిషేకము, గజారోహణ మహోత్సవం జరిగింది. ఆయనకు పది పర్యాయాలు కనకాభిషేకం జరిగింది. 1965లో దీపాల పిచ్చయ్యశాస్త్రి అధ్యక్షతన బెజవాడ గోపాలరెడ్డిచే అవధాని ఎడమ కాలికి గండ పెండేరము తొడగ బడింది. 1981లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారిచే గౌరవ డాక్టరేటు పొందారు. అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు. విశాఖలోని లోక్ నాయక్  ఫౌండేషన్ అందించే విశిష్ట పురస్కారం, మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా పురస్కార గ్రహీతగా నిలిచారు. సరస్వతీ పుత్ర,
అవధాని పితామహ బిరుదులు పొందారు. సుబ్బయ్య మార్చి 5, 2017న హైదరాబాదులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచారు.

Leave a Reply