Take a fresh look at your lifestyle.

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని నిరూపించిందీ పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన ఈ పార్టీ ప్రజాదరణను ఎలా సాధించుకోవచ్చో నిరూపించింది. ఇవ్వాళ ఆమ్‌ ఆద్మీపార్టీని, ఆ పార్టీ అధినేత అరవింద్‌ ‌క్రేజీవాల్‌ ‌గురించి తెలియనివారుండరు. సరిగ్గా దశాబ్దకాలం క్రితం కేవలం దేశ రాజధాని దిల్లీకే పరిమితమైన ఆప్‌ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అథికారాన్ని చేపట్టడంతో జాతీయ పార్టీగా విస్తరించింది. పేరుకు చిన్నపార్టీయే అయినా దేశ రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారుతున్నది. ఎనిమిదేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న  భారతీయ జనతాపార్టీకి సవాల్‌గా నిలిచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కుని నిలబడగలిగిన పార్టీగా పేరు తెచ్చుకుంది.

మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి, తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ‌తమిళనాడులోని డిఎంకే, మహారాష్ట్రలోని శిసేన, యూపిలోని సమాజ్‌వాది పార్టీలేవైనా మోదీతో విభేదించినా కేజ్రీవాల్‌ ‌లాగా ఎదుర్కునటమేకాదు, మరో రాష్ట్రంలో అధికారాన్ని సాధించుకోగలిగిన ప్రాంతీయ పార్టీ మాత్రం మరోటిలేదు. పంజాబ్‌ ఎన్నికల్లో తన పవర్‌ ఏమిటన్నది నిరూపించింది. రెండు జాతీయ పార్టీలను ఎదుర్కుని అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దిల్లీ అసెంబ్లీలో తన సత్తా చాటిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆ తర్వాత పూర్తిస్థాయిలో అధికారాన్ని చేపట్టింది పంజాబ్‌లోనే. ఆనాడు దిల్లీలో, ఈనాడు పంజాబ్‌లో భారీతీయ జనతాపార్టీ ఆప్‌ను అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. అతి చిన్న పార్టీ అయినా ఆ పార్టీని ప్రజలు అధికారంలోకి ఎందుకు తీసుకువస్తున్నారన్న ప్రశ్న ఉదయించకమానదు. ముందుగానే చెప్పినట్లు అతి సామాన్యుల కోసం, ఒక సామాన్య వ్యక్తి స్థాపించిన పార్టీగా దానికి పేరుంది. దేశ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో ఆ లక్షణాలన్నీ ఆ పార్టీకి ఉండడం వల్లే ప్రజలు ఆ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే వాడు ఎలా ఉండాలన్న దానికి దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద కేజ్రీవాల్‌ ఒక రోల్‌ ‌మోడల్‌గా చూడబడుతున్నారు. పంజాబ్‌లో నిన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు తన అధికారాన్ని నిలబెట్టుకునే మంచి అవకాశాన్ని ఆ పార్టీ చేతులారా జారవిడుచుకున్నది. కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పుడు దాదాపు ఒక సంవత్సరకాలం పోరాడిన రైతుల్లో పంజాబ్‌ ‌రైతులు మొదటి స్థానంలో నిలుస్తారు. కేంద్రంలోని బిజెపిపై ఆగ్రహంగా ఉన్న రైతులు కాంగ్రెస్‌కు తప్పకుండా పట్టం కడుతారని అంతా భావించారు. కాని, పంజాబ్‌ ‌రైతులు చాలా తెలివిగా ఆమ్‌ ఆద్మీపార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సునామీనే సృష్టించారు. దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ అక్కడ చేసిన సంస్కరణలు సామాన్య ప్రజలను అకట్టుకునేవిగా ఉండడమే ఇందుకు కారణం. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగానే ఆయన దిల్లీ ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు దక్కించుకోగలిగారు.

ప్రధానంగా దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అరికట్టడంలో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అవినీతిపరులకు ఆయన సింహస్వప్నంగా తయారైనారు. అందుకే ఇప్పుడు దేశ ప్రజలంతా అలాంటి పాలన కావాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ ‌కూడా దిల్లీ దాటి పంజాబ్‌లో అడుగుపెట్టడానికి ముందునుండే పార్టీని విస్తృతం చేసే పక్రియ చేపట్టిన విషయం తెలియంది కాదు. పంజాబ్‌లో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ విజయపరంపరను ఇలానే కొనసాగించాలని ఇప్పుడా పార్టీ ఉత్సాహపడుతుంది. గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తర్వలో జరుగనున్న హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ సిద్దపడుతుంది. వీటితో పాటు ఇప్పుడు ఏపి, ఆ తర్వాత ముఖ్యంగా దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేసేందుకు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అన్న నినాదాన్ని పక్కకు పెట్టి ఆ స్థానాన్ని సాధించుకోవాలని ఆప్‌ ‌ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీగా మూడవ ఫ్రంట్‌లో కలిసి వొస్తుందేమోనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు లేవు. అయితే తెలంగాణ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌నేతృత్వంలోని తెలంగాణ జన సమితి(టిజెఎస్‌) ‌పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు కోదండరామ్‌కు సమాచారం అందినట్లు, దానిపైన తన పార్టీ ముఖ్యులతో ప్రోఫెసర్‌ ‌చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. పొత్తుల సంగతి ఎలా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కేజ్రీవాల్‌ ‌పాదయాత్ర నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయమై త్వరలో తెలంగాణలో కేజ్రీవాల్‌ ‌పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్‌ 14‌న అంబేద్కర్‌ ‌జయంతి సందర్భంగా చేపట్టే పాదయాత్రకు ఆయన హాజరయ్యే అవకాశముంది.  ముఖ్యంగా అవినీతిపాలన నినాదంగానే ఈ యాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే షర్మిల చేస్తున్న పాదయాత్ర, కాంగ్రెస్‌ ‌యాత్రలు, బిజెపి అధికారమే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలకు ఇప్పుడు ఆప్‌కూడా తోడైతే రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ముప్పేట దాడి తప్పేట్లు లేదు.

Leave a Reply