Take a fresh look at your lifestyle.

కొరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వండి

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారించిన చీఫ్‌ ‌జస్టిస్‌

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, ఈ వైరస్‌ ‌బారిన పడిన రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు ఎలాంటి సౌకర్యాలు తీసుకున్నారో సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఈమేరకు రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ పిటిషన్‌ను చీఫ్‌ ‌జస్టిస్‌ ‌చౌహాన్‌ ‌వీడియో కాన్పరెన్స్ ‌ద్వారా విచారించారు. ముంచుకొస్తున్న కొరోనా వైరస్‌ ‌ప్రమాదంపై జనవరి 30ననే డబ్ల్యుహెచ్‌వో హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని పిటిషనర్‌ ఆరోపించారు. పట్టణాలలో ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రతీ ఇంటికీ నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ ‌హైకోర్టును కోరారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా వైరస్‌ ‌నియంత్రణకు తగిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చీఫ్‌ ‌జస్జిస్‌ ‌చౌహాన్‌ ‌వైరస్‌ ‌నియంత్రణపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే, కొరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ? ప్రజలకు మాస్కులు అందేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారు వంటి విషయాలపై ఈనెల 9న మధ్యంతర నివేదిక, 15న తుది నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్డు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Leave a Reply