Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ ‌మహానగరంలో.. రేషన్‌ ‌పంపిణీని విస్తృతం చేయాలి !

“రేషన్‌ ‌పంపిణీ అనే అతి పెద్ద భారాన్ని రేషన్‌ ‌డీలర్‌ అనే ఒకే ఒక చిన్న స్థాయి వ్యక్తిమీద కాక, ధాన్యాన్ని నిల్వ చేయగలిగే విధంగా వున్న స్థలాలలోకి తాత్కాలికంగా దాన్ని విస్తృత పరచాలి. అనేక ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఇప్పుడు మూసివేసి వున్నాయి. వాటిని తక్షణం రేషన్‌ ‌పంపిణీ చేసే ప్రదేశాలుగా మార్చాలి. కేవలం ఒక కౌంటర్‌ ‌మాత్రమే కాకుండా ఒకే చోట ఐదారు కౌంటర్లను, అవసరమైతే ఇంకా ఎక్కువ తెరవాలి. ప్రత్యేకంగా అందుకు అవసరమైన సిబ్బందిగా ఉపాధ్యాయులతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరినీ యుద్ధ ప్రాతిపదికన పనిలోకి దించాల్సిన అవసరం వుంది.”

k sajayaకరోనా విషాదం పెద్దదా లేక లాక్‌ ‌డౌన్‌ ‌విషాదం పెద్దదా అంటే ‘మావరకూ ఈ లాక్‌ ‌డౌన్‌ ‌మాత్రమే పెద్దది’ అని తేల్చి చెప్పేశాడు ఒక వలస కార్మికుడు. ఎక్కడో మధ్యప్రదేశ్‌ ‌నుంచీ బతుకు తెరువుకోసం హైదరాబాద్‌కు మూడునెలల వలస వచ్చాడు. ఇంకో నాలుగురోజుల్లో పనిపూర్తయి స్వంత వూరికి వెళ్లిపోదామనుకుంటుండగా వూహించని ప్రమాదం ఈ లాక్‌ ‌డౌన్‌ ‌రూపంలో ఎదురయింది. చేసిన పనికి రావలసిన డబ్బులు కూడా పూర్తిగా రాలేదు. తీసుకువచ్చిన కాంట్రాక్టర్‌ ‌పత్తాలేడు. వున్న కొద్దిపాటి డబ్బులతో కొన్నిరోజులు భారంగా నడిచాయి. ఎలాగైనా వెళ్ళిపోవాలని షాద్నగర్‌ ‌దగ్గర వున్న కొత్తూర్‌ ‌నుంచీ నడక మొదలుపెడితే, సికందరాబాద్‌ ‌దగ్గర పోలీసులు పట్టుకుని తాత్కాలిక షెల్టర్‌ ‌హోంలో ఉంచారు. ‘మీరు భోజనం పెడుతున్నారు, ఉండటానికి ప్లేస్‌ ఇచ్చారు. కానీ మాకు ఇక్కడ ఉండటానికి మనసు లేదు మేడం, మాపిల్లలు చిన్నవాళ్ళు, అమ్మానాయినలు పెద్దవాళ్లు. వాళ్లు ఇలాంటి పరిస్థితిలో ఎలా వున్నారో తలుచుకుంటే ఇక్కడ అన్నం తినబుద్ధి కావటం లేదు. నిద్ర పట్టడం లేదు. పిచ్చెక్కేటట్టుంది. మమ్మల్ని మావూరికి పంపించివేయండి ఎలాగైనా’ అని పదేపదే అడుగుతుంటే నిస్సహాయతతో మనసు కలచివేసింది. ‘మమ్మల్ని పోలీసులు ఆపకపోతే ఈపాటికి మావూరు వెల్లిపోయివుండేవాళ్ళం. ముందు పద్నాలుగు వరకే అన్నారు, ఇప్పుడు ముప్ఫై అంటున్నారు, ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అంటారు. మీరేం చెప్పినా మేము ఉండేదే లేదు, ఏదో ఒక టైంలో వెళ్ళిపోతాం. కనీసం మీరు చెప్పే ఆ జబ్బు వచ్చినా మావూర్లోనే చచ్చిపోతాం.’ అని తెగేసి చెప్పారు. దాదాపు అక్కడ వున్న యాభైమంది అభిప్రాయం కూడా అదే ! హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అనేక తాత్కాలిక షెల్టర్‌ ‌హోంలలో పరిస్థితి ఇలాగే వుంది. కొంపల్లిలో ఒక ఫంక్షన్‌ ‌హాల్‌లో ఏర్పాటు చేసిన హోం నుంచీ అర్ధరాత్రి ఆడా, మగా, పిల్లలు అందరూ గేట్లు దూకి పారిపోయారు. అక్కడున్న అందరూ మధ్యప్రదేశ్‌ ‌నుంచీ వచ్చిన వలస కార్మికులే! వాళ్లు హైదరాబాద్‌ ‌నగర శివారులోని కొంపల్లి నుంచీ మధ్యప్రదేశ్‌ ‌లోని ఒక మారుమూల జిల్లాకు నడక

నిజమే, మీరు చదివింది కరక్టే. దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు. ఇంకో చోట ఇన్నిరోజులూ సరైన రేషన్‌ అం‌దకపోవటంతో ఇంకో గుంపు ఆంధ్రప్రదేశ్‌ ‌లోని శ్రీకాకుళం జిల్లాకు నడక మొదలెట్టింది. ఈ దూరం ఎనిమిది వందల కిలోమీటర్ల పైనే వుంటుంది. పెరిగిన ఎండల్లో వారు అంత దూరం సాగించబోయే నడకను తలచుకుంటేనే దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి లాక్‌ ‌డౌన్‌ని మరో మూడురోజులు అంటే మే 3వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లుగా ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పటికీ కరోనా వైరస్‌ ‌విషయమై ఈరోజు నిర్ణయంతో సహా ఆయన ప్రకటించిన అంశాలను గమనిస్తే ఎక్కడా ఈదేశ పునాదివర్గాలైన శ్రామికుల జీవితాల గురించి ఆలోచించినట్లుగా అనిపించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ల జీవితాలను సమూలంగా అభద్రతలోకి నెట్టే ఆర్థిక అంశాల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఆకలి రూపంలో వెంటాడబోయే ప్రమాదాన్ని ఎలా నివారించాలనే ప్రణాళిక లేదు. ఎక్కడికక్కడ నిలువనీడ లేకుండా అయిపోయిన వలస కార్మికుల స్థితిగతుల మీద ఒక సమాలోచన లేదు. పరిస్థితిని ఎలా చక్కదిద్దాలనే దానిమీద ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ లేదు. లాక్‌ ‌డౌన్‌లో నుంచీ బయటపడటానికి తీసుకోవలసిన మార్గం ఏమిటనే దాని మీద స్పష్టత లేదు. ఇప్పటికే 21 రోజుల లాక్‌ ‌డౌన్‌ అమలు తర్వాత, అంచెలంచలుగా దానిని తొలగించడం పోయి, దానిని పెంచుతూ తీసుకున్న నిర్ణయం వెనుక హేతుబద్ధత లేదు. ఫలితం, మళ్లీ స్వస్థలాలకు నడక బాట పట్టిన నిరుపేద ప్రజానీకం.

‘ప్రభుత్వం చెప్పినట్లుగా ఇంట్లో వుండటం లేదని, రోడ్ల మీద బాధ్యత లేకుండా తిరుగుతున్నారని’ కడుపులో చల్ల కదలకుండా కూర్చోగలిగిన ‘విజయ్‌ ‌దేవరకొండ వంటి మహానుభావులు’ ఏమైనా మాట్లాడేముందు వేలమైళ్ళ నడకకు సిద్ధపడిన ఈ ప్రజల పరిస్థితుల్ని అర్థం చేసుకుంటే మంచిది. ఇలాంటి పేదప్రజలు ఆకలితో చనిపోకుండా చేయగలిగిన సహాయాన్ని చేస్తే కనీసపాటి గౌరవమన్నా మిగులుతుంది. ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఎందుకని ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వమైనా లేక రాష్ట్ర ప్రభుత్వాలైనా గానీ, ప్రజల ఆహార భద్రతకు పూచీ పడలేకపోతున్నాయి? ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అనే పేరుతో అమలుచేస్తున్న విధానాలు కొత్త సమస్యల్లోకి ఎందుకు నెడుతున్నాయి? ఒక్కొక్కటిగా ఈ లాక్‌ ‌డౌన్‌ ఎన్ని రంగాల ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపిందో గ్రహింపు లోకి వస్తోంది. అయినా గానీ, ప్రభుత్వం వైపు నుంచీ నివారణ చర్యలు అరకొరగానే వున్నాయి. వలస కార్మికులకు కొన్ని షెల్టర్‌ ‌హోములు ఏర్పాటు చేస్తే పరిష్కారమయ్యే విషయం కాదు ఇది. అంతకు మించిన అంశాలు వున్నాయి. 14వ తారీకు వరకూ ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో వలస కార్మికులందరికీ రేషన్‌తో పాటు ఐదు వందల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వ కార్యాచరణ అమలులో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. చాలాచోట్ల రేషన్‌ ‌కూడా అందని పరిస్థితి వుందని సామాజిక సంస్థలు ఏర్పాటుచేసిన హెల్ప్ ‌లైన్‌కు వస్తున్న ఫోన్‌ ‌కాల్స్ ‌తెలియజేస్తున్నాయి.

- Advertisement -

క్షేత్ర స్థాయిలో అనేకమంది మంది వలస కార్మికులను అడిగితే చాలామందికి రేషన్‌ ‌గానీ ఈ ఐదు వందల ఆర్థిక సాయంగానీ అందలేదనే తెలుస్తోంది. చాలావరకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహకారమే ప్రధానంగా వుంది. జిల్లాలలో ఎదురవుతున్న సమస్యల రూపం ఒకలాగా వుంటే, హైదరాబాద్‌ ‌లాంటి మహానగరంలో సమస్యల విస్తృతి అత్యంత తీవ్ర రూపంలో వుంది. నగరంలోని అనేకచోట్ల రేషన్‌ ‌పంపిణీ అత్యంత భారంగా నడుస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ పనిని ఇప్పటికే వున్న ప్రజాపంపిణీ దుకాణాల మీదే పెట్టింది కానీ, అత్యవసర పరిస్థితి రీత్యా వాటిని విస్తృతం చేయకపోవటం అనేది ఎన్నో ఘర్షణలకు, సమస్యలకు దారితీస్తోంది. ఎందుకు అని తరిచి చూస్తే, ఒకటి ఈ రేషన్‌ ‌దుకాణాలు చిన్న ఇళ్ళల్లో వుంటాయి. ఆ రేషన్‌ ‌డీలర్‌ ఇం‌ట్లోనే ముందు ఒక చిన్న గదిలోనే వచ్చిన స్టాక్‌ని నిల్వ చేసుకోవాల్సి వుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఒక వారం పది రోజులపాటు సాగే ఈ వ్యవహారంలో ఆ డీలర్‌ ‌మీద కూడా తీవ్రమైన వొత్తిడి ఏమీ వుండదు. కానీ, ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో వెంటనే రేషన్‌ ‌తీసేసుకోవాలని, లేకపోతే దొరకదేమో అనే భయం ప్రజల్లో కూడా నెలకొని వుంది. ఈ భయం ఘర్షణలకు దారి తీస్తోంది. ఒక్కోచోట రోజుకి ముప్ఫై మందికి కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువలో ఎక్కువ ఇచ్చారంటే ఒక వందమంది వరకూ ఉండొచ్చు. పైగా ఇప్పుడు వలస కార్మికులు కూడా వున్నారు. పంపిణీ చేయవలసిన సంఖ్య పెరిగింది. గ్రామాల్లో వలస కార్మికుల వొత్తిడి ఇంత వుండదు కాబట్టి, అక్కడ చిన్న చిన్న సమస్యలతో పంపిణీ పూర్తి అవుతోంది. కానీ, హైదరాబాద్‌లో పంపిణీ ఇంకా అనేక సమస్యలను ఎదుర్కుంటోంది.

ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆలోచించవలసిన అంశాలు రెండు వున్నాయి. లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తి అయ్యేంతవరకూ వలస కార్మికులు సురక్షితంగా, భరోసాగా, ఇక్కడే ఉండాలంటే వెంటనే వారికి రేషన్‌, ‌గ్యాస్‌ ‌సౌకర్యం, నగదు సహాయం చేయాలి. ఐదువందల రూపాయలు దేనికీ సరిపోవు కాబట్టి, పైగా గడువు ఇంకా ఇరవై రోజులకు పెరిగింది కాబట్టి అందుకు తగ్గట్టుగా నగదు సహాయాన్ని పెంచాలి. రేషన్‌ ‌పంపిణీ అనే అతి పెద్ద భారాన్ని రేషన్‌ ‌డీలర్‌ అనే ఒకే ఒక చిన్న స్థాయి వ్యక్తిమీద కాక, ధాన్యాన్ని నిల్వ చేయగలిగే విధంగా వున్న స్థలాలలోకి తాత్కాలికంగా దాన్ని విస్తృత పరచాలి. అనేక ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఇప్పుడు మూసివేసి వున్నాయి. వాటిని తక్షణం రేషన్‌ ‌పంపిణీ చేసే ప్రదేశాలుగా మార్చాలి. కేవలం ఒక కౌంటర్‌ ‌మాత్రమే కాకుండా ఒకే చోట ఐదారు కౌంటర్లను, అవసరమైతే ఇంకా ఎక్కువ తెరవాలి. ప్రత్యేకంగా అందుకు అవసరమైన సిబ్బందిగా ఉపాధ్యాయులతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరినీ యుద్ధ ప్రాతిపదికన పనిలోకి దించాల్సిన అవసరం వుంది. ఇది సజావుగా, పారదర్శకంగా సాగటానికి, ఎప్పటికప్పుడు దానిని డాక్యుమెంట్‌ ‌చేసేవిధంగా విపత్తుల నివారణలోనూ, స్థానిక సమూహాలతోనూ పనిచేసే అనుభవమున్న స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలి. ఉదయం ఎనిమిది నుంచీ సాయంత్రం ఐదు గంటల వరకూ సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేసే విధంగా వుంటే వారి మీద కూడా వొత్తిడి పడకుండా వుంటుంది. కరోనా వైరస్‌ ‌నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం అత్యవసరమైన విషయం కాబట్టి అందుకు అవసరమైన విధానాలను రూపొందించడం, దానికి సహాయపడటానికి పోలీసు సిబ్బంది అవసరం. (లాటీ ఛార్జ్ ‌చేసి, నిర్భంధం ప్రయోగించడానికి కాదు!) ప్రజలకు తమ ఆహార భద్రత మీద భరోసా ఏర్పడితే తామే మొత్తం కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తారు, సహకరిస్తారు. తమకొచ్చే తక్కువ ఆదాయాలతోనే గౌరవప్రదంగా బతుకుతున్న సామాన్య ప్రజలను ఆహార పొట్లాల కోసం, బియ్యం కోసం ‘బిచ్చగాళ్ళు’ గా మార్చింది ప్రభుత్వాల ముందుచూపు లేనితనం. ప్రజలు భయపడుతున్నది కరోనా వైరస్‌ ‌గురించి కాదు, ఆకలి గురించి అనే విషయం అర్థమయితే తీసుకునే విధానాలు, కార్యాచరణాలు అందుకు తగినవిధంగా వుంటాయి. బహూశా, ప్రజలందరికీ ఈ కష్టకాలం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే చేయించగలిగిన తెలంగాణా ప్రభుత్వానికి ఇదేమాత్రం అసాధ్యమైన విషయం కాదు. ఆ వైపుగా నిర్ణయం తీసుకుంటారని ఆశించవచ్చా!?

కె.సజయ,
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply