- 24 గంటల కరెంట్ ఎక్కడుందో చెప్పాలి
- పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు
- ధరణిపై ఎందుకు ప్రస్తావించలేదు
- బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నాయన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆరు గంటల కరెంట్ కూడా రావట్లేదని రైతులు సబ్ స్టేషన్లో వద్ద ఆందోళన చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయని వి•డియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఈటల మండిపడ్డారు. ధరణి గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని మాత్రమే గవర్నర్ చదివారని ఆక్షేపించారు. ధరణితో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నా..ఆ విషయంపై నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారని చెప్పారు. గజ్వేల్, సిద్ధిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని మండిపడ్డారు. ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఈటల.. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రసంగం పనికి వొస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.