Take a fresh look at your lifestyle.

పక్కాగా హెల్త్ ‌ప్రొఫైల్‌..!

  • డిసెంబర్‌ ‌మొదటి వారంలో ప్రారంభించేలా సిద్ధం కావాలి
  • ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో..
  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు,

తెలంగాణ హెల్త్ ‌ప్రొఫైల్‌ను పక్కాగా రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ ‌మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ‌ప్రొఫైల్‌ను పోగ్రాం ప్రారంభించేలా సిద్ధం కావాలని సూచించారు. సోమవారం బీఆర్కే భవన్‌లో హెల్త్ ‌సెక్రటరీ రిజ్వీ, ఫ్యామిలీ వెల్ఫేర్‌ ‌కమిషనర్‌ ‌వాకాటి కరుణ, హెల్త్ ‌డైరెక్టర్‌ ‌డా.శ్రీనివాసరావు, ఓఎస్డీ గంగాధర్‌, ‌వైద్య విధాన పరిషత్‌ ‌కమిషనర్‌ ‌రమేశ్‌ ‌రెడ్డితో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల, ములుగు జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ‌ప్రొఫైల్‌ ‌పోగ్రాంను వేగంగా పూర్తి చేయాలన్నారు. హెల్త్ ‌ప్రొఫైల్‌లో ప్రస్తుతం 8 టెస్టులు చేస్తున్నారనీ, అదే తెలంగాణ డయాగ్నస్టిక్స్ ‌ద్వారా అయితే 57 టెస్టులు చేయవచ్చనీ, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌లో ఉపయోగించే పరికరాల ద్వారా రిజల్ట్ ‌కచ్చితంగా వస్తుందనీ, వేగంగా పరీక్షలు నిర్వహింవచ్చని తెలిపారు. హెల్త్ ‌ప్రొఫైల్‌లో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి సమాచారం సేకరించాలనీ, నోడల్‌ ఆఫీసర్లను నియమించి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ జిల్లాలలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్‌ ‌నెంబర్‌, ‌డెమోగ్రాఫిక్‌ ‌వివరాలు, షుగర్‌, ‌బిపి ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు వివరించారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్, ‌హై రిస్క్ ‌వాళ్లను గుర్తించి సరైన వైద్య చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఏ వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లినా లేదా యాక్సిడెంట్‌ ‌జరిగినా అతని ఆరోగ్య సమాచారం అంతా క్లౌడ్‌ ‌స్టోరేజ్‌ ‌నుంచి తెప్పించుకునే విధంగా ఉండాలన్నారు. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి ? ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయనీ, ఈ వివరాలన్నింటినీ హెల్త్ ‌ప్రొఫైల్‌లో అధికారులు పక్కాగా తెలపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Leave a Reply