- ఇరిగేషన్ పై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి
- తెలంగాణ ముఖ్యమంత్రి కెసీర్ కు సవాల్ విసిరిన మాజీ మంత్రి పొన్నాల
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసే కల్లబొల్లి మాటల బడ్జెట్ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే బడ్జెట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మాంద్యం పేరిట అవకతవకల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. వేల కోట్ల దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే బడ్జెట్ లో కొత్తగా నిధులు కేటాయించినట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో నూతనంగా చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్ ల నుంచి ఎన్ని ఎకరాలకు కొత్తగా నీరందించారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. దాదాపు 34 లక్షల ఎకరాలకు నీళ్లించే అవకాశం ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లకు 8, 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా, ప్రతి యేటా ఇరిగేషన్ కు 25 వేల కోట్ల రూపాయలు కేటాయించడంలో ఆంతర్యం ఏంటన్నారు. గోదావరి నీళ్లు, మిడిమానేరుకు చేరినట్లు నిరూపిస్తే కెసీర్ గ్రేట్ అంటా అని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం పూర్తి చేసిన శ్రీరాం సాగర్, కడెం ప్రాజెక్ట్ నీళ్లే, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా మిడ్ మానేరుకు వస్తున్నాయన్నారు. ఈ ఏడాది లక్ష ఇళ్లు ఇస్తామని బడ్జెట్ లో చెప్పడం అంటే, అర్హులందరికీ ఇళ్లు రావాలంటే 20 ఏళ్లు పడుతుందన్నారు. రుణ మాఫీ పేరిట టీఆర్ఎస్ సర్కార్ రైతులను దగా చేసిందన్నారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి…..ఇప్పుడు ఇవ్వలేం అంటూ నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. నిరుద్యోగ భృతి సాధ్యంకానప్పుడు ప్రజల్లో ఆశలు పెంచడం ఎందుకని మండిపడ్డారు. మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల పేరిట ఆరేళ్లు కాలయాపన చేశారని, కనీసం రాజ్యాంగ బద్ధంగ వారికే దక్కే రిజర్వేషన్లనైనా కల్పించాలని హితవు పలికారు. 2014, 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రంలో సాగు భూమిపై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Tags: Shriram Sagar, Kadem Project Neelale, Ellampally Project Mid Manneru