Take a fresh look at your lifestyle.

భద్రాద్రి రామయ్య కళ్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ  దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్ టెంపుల్స్ అని అర్ధం. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆరు A గ్రేడ్ టెంపుల్స్ లో  వేములవాడ , భద్రా చలం తెలంగాణలోకి రావడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం భద్రాచలం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము కలిగిన  గోదావరి నది దక్షిణ తీర పుణ్యక్షేత్రం. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారు.  పూర్వపు జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉంది.పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది.
గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న పని చేసే వాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వా నికి జమ చెయ్యకుండా,1645 – 1680 మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు  రామాలయాన్ని నిర్మించాడు. సీతా రామ చంద్ర స్వాములకు రకరకాల నగలు – చింతాకు పతకం, పచ్చల పతకం మొదలైనవి  చేయించాడు. ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి గోపన్న ప్రార్థించాడు. ఆ సందర్భం లో రామునిపై రచించి, పాడిన పాటలే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు తన్మయత్వం చెందిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగిం చిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. అలా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.
దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామ చంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్స రం శ్రీరామ నవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్స వానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్స వానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరుగుతుంది. రామ దాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. భధ్రాచలం లోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు. భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో 30న కల్యాణం, 31న పట్టాభిషేకం నిర్వహించ నున్నారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం పట్టణాన్ని అందంగా ముస్తాబు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రామాలయానికి, మిథిలా స్టేడియానికి రంగులు వేసి విద్యుత్ లైట్లను అలంకరించారు. రాములోరి కళ్యాణం, పట్టాభిషేకం జరిపే మిథిలా ప్రాంగణంలో సెక్టార్‌ల వారీగా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అధికారులు శ్రీరామనవమి వేడుక నిర్వహణపై పలుమార్లు దేవస్థాన ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
 కల్యాణ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా రోజువారి నిత్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. అయితే ఏడాదికోసారి నిర్వహించే కల్యాణ మహోత్సవాల్లో మాత్రం తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. భద్రాద్రిలో ఈ తలంబ్రాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. బియ్యంలో పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కా, గులాములు, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు. ఇలా తలంబ్రాలను తయారు చేయడం భక్త రామదాసు కాలం నుంచి ఆచారంగా వస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు.. వడ్లను గోటితో వలిచి సీతారాముల కల్యాణంలో వినియోగిం చేందుకు భద్రాచలం తీసుకువస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా, వరంగల్, కరీంనగర్, కొత్తగూడెం, మణుగూరు, హైదరాబాద్లోని భక్తులు గోటితో వలిచిన వడ్లను స్వామివారికి సమర్పిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తున్న మహిళలు ఈ ఏడాది 2 క్వింటాళ్ల వడ్లను 5 రాష్ట్రాలలోని 4 వేల మంది ఆర్య వైశ్య మహిళలచే వలిపించి ఈరోజు భద్రాద్రి సన్నిధికి అందించారు. ఈనెల 30న జరగనున్న సీతారాముల కళ్యాణం మహోత్సవంలో ఈ కళ్యాణ తలంబ్రాలను వాడనున్నారు.
కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేపథ్యంలో 2020, 2021లో సీతారామ కల్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. 2022 నుంచి మళ్లీ భక్తులు తిలకించేందుకు అవకాశం కల్పించారు. ఆ సంవత్సరం భక్తుల కోసం 175 క్వింటాళ్ల తలంబ్రాలు, 3 లక్షల లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డులకు 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇవి కాకుండా 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి పంపిస్తారు. నేరుగా కౌంటర్లలోనూ విక్రయించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో సైతం భక్తులు కళ్యాణోత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ విక్రయిస్తున్నారు.
భద్రాద్రి రామయ్య సన్నిధికి ఒక లక్ష 70 వేల రూపాయల విలువ గల తలంబ్రాల ప్యాకింగ్ మిషన్ను తిరుపతికి చెందిన సేవా కుటుంబం మహిళలు కానుకగా అందించారు. ఈ యంత్రం ద్వారా సులభంగా రోజుకు 30 వేల ప్యాకెట్లను ప్యాకింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని సేవా కుటుంబం మహిళ భక్తులు తెలిపారు.వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, శ్రీరామాయణ మహాక్రతువుకు ఒకేసారి శ్రీకారం చుట్టడం భద్రాద్రి చరిత్రలో మూడోసారని… 1987లో మహాసామ్రజ్య పట్టాభిషేకం సమయంలో తొలిసారి,.తరువాత 2011లో నిర్వహించారు. మళ్లీ ఈ సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ ఓ రమాదేవి తెలిపారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభం కాగా,  శ్రీరామాయణ మహా క్రతువుకు అంకురార్పణ చేశారు. 26న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న ధ్వజపట భద్రుక మండల లేఖనం, 28న అగ్నిప్రతిష్ఠ ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు సేవ, 30న శ్రీరామనవమిని పురస్కరించుకని శ్రీ సీతారాముల తిరుకల్యాణ మహోత్సవం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుంది. 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, ఏప్రిల్‌ ఒకటిన సదస్యం, రెండున తెప్పోత్సవం, చోరోత్సవం, 3న ఊంజల్‌ సేవ, 4న వసంతోత్సవం, 5న చక్రతీర్ధం, పూర్ణాహుతి, సార్వభౌమ సేవ, శేష వాహన సేవ, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనుండటంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.
 రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply