Take a fresh look at your lifestyle.

వర్షాలు.. వరదలతో అంతా అస్తవ్యస్తం

తెలంగాణ అంతా వరదలతో మునిగిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న ఇరవైనాలుగు గంటల్లో బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ నెల పదవ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. ముఖ్యంగా సోమవారం నుండి మరో రెండు రోజులపాటు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో 6.6 సెంటి మీటర్ల నుండి 12.5 సెంటీ మీటర్ల వరకు వర్షపాతం నమోదు అయినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా భద్రాచలం, కొత్తగూడ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే 11 నుండి 12.5 సెంటి మీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా రానున్న రెండు, మూడు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో పది నుండి ఇరవై సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే తెలంగాణలోని అనేక జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయి చెరువులు నిండి, వాగులు పొంగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ అలర్ట్ ‌కూడా ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్‌, ‌కుమురం భీం అసిపాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నాజామాబాద్‌, ‌జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా ప్రజలు అప్రమత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కామారెడ్డిలోని నాగిరెడ్డిపేటలో ఆదివారం 17 సెంటీమీటర్ల వార్షపాతం నమోదుకాగా, రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లిలో 15, కామారెడ్డిలోని మాచారెడ్డి, సిద్దిపేట, కొండపాకలలో 11, సిద్ధిపేటలోని కొండపాక 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందంటేనే ఎంతటి భారీ వర్షాలు పడుతున్నాయో అర్థమవుతున్నది. రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. మొర్రెడు, గోదుమవాగు, కిన్నెరసాని నిండుకుండల్లా ఉన్నాయి.

దీంతో పలు చోట్ల జనజీవనం అతలాకుతలమయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లుఅన్ని చెరువులను తలపిస్తుండగా, మరి కొన్ని చోట్ల ఇండ్లన్ని వరదనీటితో మునిగిపోయి, ఉండడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నించిన కొందరు నీళ్ళలో కొట్టుకుపోగా మరికొందరు మరణించిన దుర్ఘటనలు సంభవించాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మిర్చి, పత్తి రైతులకు దిక్కుతోచకుండా పోయింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్న పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. గత వారం రోజులుగా రాజధాని ప్రాంతంలో ఎక్కడో ఒక దగ్గర నిత్యం వర్షాలు పడుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ ‌జలాశయాలు నిండటంతో గేట్లెత్తి మూసీలోకి నీటిని వదులుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల వారిని కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత వర్షాకాల ఇబ్బందులతో ప్రభుత్వం కాని, కార్పొరేషన్‌ అధికారులుగాని నేర్చుకున్న గుణపాఠాలేవీ లేవు. ఏ కాస్త వర్షం పడినా నాలాలన్నీ నిండి రోడ్లపై మురికి నీరంతా ప్రవహించడం అనవాయితీగానే మారింది. డ్రైనేజీలను శుభ్రపర్చే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల ఇద్దరు కూలీలు బలి అయిన విషయం తెలియంది కాదు. జంటనగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో రహదారులన్నీ నీటిమయంగా మారాయి. నీటి ప్రవాహానికి అడ్డంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలను పూర్తిస్థాయిలో తొలగించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టవచ్చినట్లుకనిపిస్తున్నది. గత వర్షాకాలం వివిధ కాలనీల్లోకి, అపార్టుమెంట్‌ల్లోకి వరద నీరు ఎలా చేరిందో తెలియందికాదు. ఆ తర్వాతయినా అధికారులు దానిపై శ్రద్ధ పెట్టకపోవడంతో ఎప్పటిలాగానే కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోతున్నాయి. ముఖ్యంగా పలు ప్రాంతాల్లోని చెరువులు ఖబ్జాలకు గురి అవుతున్నా, ప్రజలు, మీడియాల్లో అలాంటివి వెలుగుచూస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఇలాంటి పరిస్థితిలో రాబోయే నాలుగైదు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారుల హెచ్చరిక నగర ప్రజలకు మరింత భయాన్ని కలిగిస్తున్నది.

Leave a Reply