Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరూ రెండో డోస్‌ ‌కూడా తీసుకోవాలి

  • టీకా తీసుకున్న వారిలో కొరోనా ప్రభావం తక్కువ
  • వొచ్చే ఏడాది ఆరోగ్య సంవత్సరం కావాలన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌టీకాలు తీసుకోని వారిలో కోవిడ్‌ ‌ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయని గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌తెలిపారు. న్యూ ఇయర్‌ ‌వేడుకల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వొచ్చే 2022 సంవత్సరం ఆరోగ్య సంవత్సరంగా సాగాలని ఆమె ఆకాంక్షించారు. నగరంలోని చింతల్‌ ‌బస్తీ అర్బన్‌ ‌ప్రైమరీ హెల్త్ ‌సెంటర్‌ని గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌బుధవారం సందర్శించారు. 100శాతం తొలిడోస్‌ ‌వాక్సినేషన్‌ ‌పూర్తయిన సందర్భంగా టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌మాట్లాడుతూ 100శాతం మొదటి డోస్‌ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సరైన సమయానికే 2 వ డోస్‌ ‌తీసుకోవాలని ప్రజలని కోరారు. కేవలం ఒకే డోస్‌ ‌తీసుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందిస్తూ అన్ని డోస్‌లు అందజేసిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్రికాలో హెల్త్ ‌వర్కర్‌లు సైతం కేవలం 4 శాతం మందే టీకా తీసుకున్నారని, మన వద్ద ఆశా వర్కర్‌లు ఇంటింటికి వెళ్లి టీకాలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే కొత్త సంవత్సరం ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో మొదటి డోసు వందశాతం పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. టీకా తీసుకున్నా మాస్కు కచ్చితంగా ధరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంతోపాటు మరో ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కూడా మొదటి డోస్‌ 100‌శాతం పూర్తైన సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గవర్నర్‌ ‌కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply