- ఆందోళన కలిగిస్తున్న సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లు
- సిపిఆర్ చేస్తే బతికే ఛాన్స్…సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు
- ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి
- సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్ పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ఏర్పాటు చేసిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇటీవలి కాలంలో సడెన్ కార్డియాక్ అరెస్టులు (ఎస్‌సిఎ), హార్ట్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని, కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమయం, సందర్భం, వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా సడెన్ కార్డియాక్ అరెస్ట్ వొచ్చే అవకాశం ఉంటుందని, అట్టి సమయంలో సిపిఆర్ చేయగలిగితే ప్రాణాలు రక్షించే అవకాశం 50 శాతం మెరుగవుతాయని మంత్రి తెలిపారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రతి ఒక్కరు సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండింటికీ తేడా తెలుసుకోవాలన్నారు. మనిషి సడెన్‌గా షాక్‌కు, వత్తిడికి లోనైనప్పుడు సడెన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుందని, అప్పటికప్పుడే మనిషి కుప్పకూలిపోయి శ్వాస ఆగిపోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారని, ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె, ఊపిరితిత్తులు తిరిగి పని చేసి మనిషి బ్రతుకుతారని, దీన్నే సీపీఆర్ అంటారని మంత్రి తెలిపారు.
అయినప్పటికీ కొన్ని సార్లు గుండె స్పందించనట్లైతే, ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్(ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందన్నారు. జిమ్ చేస్తూ, పనులు చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, నడుస్తూ కొంత మంది ఆకస్మాత్తుగా పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో, టీవీల్లో చూస్తున్నామని, దేశంలో ప్రతి రోజు దాదాపు 4వేల మంది, సంవత్సరానికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురవుతున్నారని, ఇందులో 90శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు మంత్రి తెలిపారు. సిపిఆర్‌పై అవగాహన ఉండి వెంటనే చేసినట్లయితే కనీసం 50 శాతం మందిని రక్షించవొచ్చన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసేందుకు చదువు, మెడికల్ పరిజ్ఞానం అవసరం లేదని, అవగాహన ఉంటే ఎవరైనా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సీపీఆర్ శిక్షణతో సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన సంఘటనలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంఘటనలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. జిల్లాలోని పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వాలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సిపిఆర్ మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను 108 సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ప్రతి జిల్లాకు 5గురు మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేశామని, వారి ద్వారా జిల్లాల్లో గ్రామ గ్రామాన, పురపాలికల్లో అపార్ట్మెంట్స్, కాలనీలలో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళికను చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 1200 ఏఈడి మిషన్లు రూ.15 కోట్లతో కొనుగోలు చేసి అన్ని పిహెచ్సిలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అపార్ట్‌మెంట్స్, మాల్స్, జనాలు ఎక్కువగా ఉండే నిర్మాణాల్లో, వంద మందికి పైగా ఉద్యోగులు పనిచేసే అన్ని కర్మాగారాలలో ఎఇడి మిషన్లు, సిపిఆర్ శిక్షణ తప్పని సరి ఉండాలన్న నిబంధనలను తీసుకు రానున్నట్లు మంత్రి వెల్లడించారు. జన సమర్థం ఉన్న ప్రతి చోట ఏఈడి మిషన్ అందుబాటులో పెట్టనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలలో ఉద్యోగులు శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవాలని, సమావేశాలు జరిగినప్పుడు సిపిఆర్‌పై అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ప్రజల్లో సిపిఆర్‌పై అవగాహన కల్పించే విధంగా, సిపిఆర్‌తో ప్రాణాలు కాపాడినట్టి జరిగిన సంఘటనల కథనాలు ప్రచురించాలని, జర్నలిస్టులు ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రజా ప్రతినిధులకు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సిపిఆర్‌పై శిక్షణ కల్పించాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం సిపిఆర్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. పిమ్మట వివిధ శాఖల ఉద్యోగులకు సిపిఆర్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణ కుమార్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.