Take a fresh look at your lifestyle.

ప్రతి వారం పావుగంట.. ఇంటి శుభ్రత కోసం కేటాయించండి

  • మీ ఇళ్లు శుభ్రం చేసుకున్నారా..
  • డ్రైడే పాటిస్తున్నారా.. లేదా అంటూ మంత్రి ఆరా
  • పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి హరీష్‌రావు

మన ఇళ్లును మనం శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఆదివారం పావుగంట సేపు మీ ఇళ్లు శుభ్రం చేసుకోవడం కోసం సమయాన్ని కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో డ్రైడేలో భాగంగా గణేశ్‌ ‌నగర్‌ ‌లోని పలువురి నివాసాల్లో మీ ఇళ్లు శుభ్రంగా ఉందా..డ్రైడే పాటిస్తున్నారా.. లేదా అంటూ ఇంట్లో కలియ తిరుగుతూ.. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను మంత్రి ప్రత్యక్షంగా చూపిస్తూ.. ఆ ఇంటి వాసులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..పూల కుండీలలో నీళ్లు నిలిస్తే దోమలు, తోక పురుగులు వృద్ధి చెందుతాయన్నారు. ప్రతి ఇంటికీ కౌన్సిలరు, ఆర్పీ వెళ్లి ఇంటిని, ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా నిలుపుకోవాలని ప్రజలకు ఓపికగా చెప్పాలని వార్డు కౌన్సిలరు, ఆర్పీలను మంత్రి ఆదేశించారు. వచ్చేది వానా కాలం కాబట్టి డెంగీ, వైరల్‌ ‌ఫీవర్‌, ‌ప్రస్తుతం కరోనా ఉన్న కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్‌ ‌కౌన్సిలరు, ఆ వార్డులోని ఆర్పీల ప్రధాన కర్తవ్యమని సూచించారు. ప్రతి వారం 100 ఇళ్ల చొప్పున్న లక్ష్యాన్ని పెట్టుకుని, ప్రతి వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

మంత్రి పరిశీలనలో పూల కుండీలలో తోక పురుగులు..
డ్రైడేలో భాగంగా మంత్రి పరిశీలించిన ఇంటి పూల కుండీలలో తోక పురుగులు, ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటి నిల్వలను ప్రత్యక్షంగా ఇంటి కుటుంబీకులకు చూపి, మన కోసం.. మనం ప్రతి వారం పావుగంట ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుందామని మంత్రి కోరారు. టీపీటీఎఫ్‌ ‌రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి నివాసంలో పూల కుండీలో తోక పురుగులు ఉన్నాయని.. మంత్రి వాటిని ప్రత్యక్షంగా చూపించారు. మరో నివాసంలో పాడైన ఛత్రి-గొడుగు, పలక ఇంకెందుకు దాచుకుంటున్నారని.., దాంట్లో ఉన్న దుమ్ము దులుపుతూ.. ఆ ఇంటి యజమానికి, కుటుంబీకులకు మంత్రి అవగాహన కల్పించారు. మరో నివాసంలో దుమ్ము పట్టి ఉన్న ఓ ప్లాస్టిక్‌ ‌బాటిల్‌ ‌లో కిరోసిన్‌ ‌పోసిపెట్టి ఉండగా, మరిన్ని ప్లాస్టిక్‌ ‌బాటిల్స్ ‌చూసి ఇంకెన్ని రోజులు ఈ బాటిల్స్ ‌దాచుకుంటారని ఆ ఇంటి యజమానిని మంత్రి ఆరా తీశారు. మరో నివాసంలో షెల్ఫ్ ‌లో పేపర్లు, పుస్తకాలు దుమ్ము పట్టిపోయి షెల్ఫ్ ‌కూడా దుమ్ముతో నిండి ఉన్నదని పరిశుభ్రంగా చేసుకోవాలి కదా అంటూ.. ఆ ఇంటి కుటుంబీకులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. మరో నివాసంలో డ్రమ్ము, హౌస్‌ ‌లో నీరు నిలిచి తోక పురుగులకు నిలయంగా మారిందని ఆ ఇంటి కుటుంబీకులకు ప్రత్యక్షంగా చూపించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పిలుపు మేరకు ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం ఓ పావుగంట విధిగా.. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధుల వ్యాప్తి రాకుండా చూడాలని ప్రజలకు మంత్రి సూచించారు. దోమ పుట్టకుండా అరికట్టి వాటి నుంచి వచ్చే డెంగీ వ్యాధుల నుంచి విముక్తి పొందాలని కోరారు. ఇళ్లలోని పూల కుండీలు, ట్రేలలో, పాత టైర్లలో, కూలర్లలో, కొబ్బరి చిప్పలలో, సిమెంటు ట్యాంకులలో, డ్రమ్ములలో ఇంటి పరిసర ప్రాంతాల్లో పడేసిన పాత వస్తువుల్లో నీటి నిల్వలను తప్పనిసరిగా తొలగించాలని గణేష్‌ ‌నగర్‌ ‌ప్రాంత ప్రజలకు చక్కగా అవగాహన కల్పించారు. డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని ప్రజలకు మంత్రి హరీశ్‌ ‌పిలుపునిచ్చారు. ఈ మేరకు సిద్ధిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాలు మన కోసం.. మనం గోడ పత్రికలను ఆవిష్కరించారు. పలు ఇళ్ల, ఇంటి పరిసరాల పరిశీలనలో భాగంగా వారి దర్వాజలకు మంత్రే స్వయంగా గోడ పత్రికలను అతికించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు, కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌ ‌మంతెన జ్యోతి రాజ్‌ ‌నరేందర్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply