Take a fresh look at your lifestyle.

‌ప్రతి గ్రామ పంచాయతీ, ఒక గణతంత్ర రాజ్యం

గ్రామస్థాయిలో అమలులో ఉండే అతి ప్రాచీన పాలన వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థ అని కూడా అంటారు. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్‌ ‌కాగా, ఆంధ్రప్రదేశ్‌ ‌రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్‌ ‌చట్టాన్ని చేసింది. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్నప్పుడు 1991లో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్‌ 1992‌లో ఆమోదించింది. 17 రాష్ట్రాల ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్‌ ‌దయాల్శర్మ ఈ బిల్లుపై 1993, ఏప్రిల్‌ 20‌న తొలి సంతకం చేశారు. ఏప్రిల్‌ 24‌ను పంచాయతీరాజ్‌ ‌దినంగా పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది.

గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ‌పంచాయతీ వ్యవస్థ నిర్మాణం పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం మూడంచెల విధానం అమల్లో ఉంది. మొదటి అంచె గ్రామ పంచాయతీ రెండో అంచె మండల పరిషత్‌, ఇది మండలస్థాయిలో ఉంటుంది. మూడోఅంచె జిల్లా పరిషత్‌ ‌జిల్లా స్థాయిలో ఉంటుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలను పంచాయతీ గ్రామసభలు, మండల  పరిషత్‌ ‌సమావేశాలు, జిల్లా పరిషత్‌ ‌సమావేశాలు అమలు తీరును చర్చించి పల్లెల సీమ ప్రగతికి తోడ్పడుతుంది.పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది. బ్రిటిష్‌ ‌పాలన ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్‌ ‌గవర్నర్‌ ‘‌రిప్పన్‌’ ‌ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి.

73వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిన నూతన పంచాయతీ వ్యవస్థ నిర్మాణం కొన్ని రాష్ట్రాలకు వర్తించదు. 20లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు, జమ్ముకాశ్మీర్‌ ‌రాష్ట్రానికి, కేంద్రపాలితమైన ఢిల్లీ, నాగాలాండ్‌, ‌మేఘాలయ, మిజోరం, పశ్చిమబెంగాల్‌, ‌డార్జిలింగ్‌, అరుణాచలప్రదేశ్కు మూడంచెల విధానం వర్తించదు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ ‌సంస్థలు రా జ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలకు అందించడంలో పంచాయతీరాజ్‌ ‌వ్యవస్థలో స్థానిక సంస్థలే కీలక భాగస్వామ్యం వహిస్తున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్యం, తాగునీరు, సామాజిక ఆస్తుల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జాతీయ పంచాయతీ రాజ్‌ ‌దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం అవార్డులు అందిస్తోంది.నానాజీ దేశ్‌ ‌ముఖ్‌ ‌రాష్ట్రీయ గౌరవ్‌ ‌గ్రామసభ పురస్కర్‌, ‌చైల్డ్ ‌ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డ్, ‌గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అవార్డులను ఈ సందర్భంగా ప్రకటిస్తారు.

డాక్టర్‌ ఎం ‌డి  ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్
‌తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
తెలంగాణ సాహిత్య రత్న అవార్డ్ ‌గ్రహిత
యంగ్‌ ‌సైంటిస్ట్ అవార్డ్ ‌గ్రహిత, బెస్ట్ ‌రిసెర్చర్‌ అవార్డ్ ‌గ్రహిత, 9492791387

Leave a Reply