Take a fresh look at your lifestyle.

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

‘‘‌రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. ’’

నేడు భారత రాజ్యాంగ ఆమోదిత దినం

నవంబర్‌ 26 ‌ప్రత్యేకతను సంతరించుకుంది. దీనిని జాతీయ ‘‘న్యాయ దినోత్సవం’’గా జరుపు కుంటున్నారు. భారత రాజ్యాంగ ఆమోదిత దినంగా జరుపుకునే ఈ దినాన్ని రాజ్యాంగ దినోత్సవమని, సంవిధాన్‌ ‌దివస్‌ అని కూడా పిలుస్తారు. పొట్టకూటికోసం, వ్యాపారం పేరుతో, మన దేశంలో అడుగు పెట్టిన శ్వేత జాతీయులు, చివరకు మన దేశాన్ని, రవి అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యంలో భాగంగా చేసుకోగా, సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన దేశం భారతదేశం. ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత మాత స్వేచ్చా వాయువులు పీల్చ గలిగింది. స్వయం పాలనాధి కారాన్ని దక్కించుకున్న దేశంలోని అన్ని మతాలు, తెగలు, నిమ్న దళితులు, గిరిజనులు, వెనుక బడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వ భౌమాధికారాన్ని దక్కించు కొనేందుకు వీలుగా రాజ్యంగాన్ని రూపొందించాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై పడింది. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి.

అయితే భారత రాజ్యాంగ రచన ఒక సంక్లిష్టం. దేశంలో అనేక మతాలు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకు గురైన వర్గాలు… తదితరులు ఎందరో ఉన్నారు. సదరు వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ రచన నిస్సందేహంగా ఒక పెద్ద సవాలే. ఇందుకు భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్‌ ‌నేతృత్వంలో డా.బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ అధ్యక్షతన డ్రాఫ్టింగ్‌ ‌కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని తయారు చేసు కోవడానికి దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయ కోవిదులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను నిర్వహించు కున్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌ ‌భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్రలో ఎంతగానో శ్రమించారు. ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనతో పాటు కోట్లాది మంది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించేలా రాజ్యాంగాన్ని లిఖించారు. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పనను రాజ్యాంగ బద్దం చేశారు. రాజ్యాంగ మంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు… కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభిం చాలన్నది బాబా సాహెబ్‌ ‌ప్రధానాశయం. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపు దిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగిందంటూ మన్ననలు పొందింది.

అంబేద్కర్‌ ‌చైర్మన్‌గా, జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, మౌలానా అబుల్‌ ‌కలాం ఆజాద్‌, ‌సర్దార్‌ ‌పటేల్‌, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్‌, ‌సరోజినీ నాయుడు, రాజాజీ, వల్లబ్‌ ‌పంత్‌, ‌బి.ఆర్‌. అం‌బేద్కర్‌, ‌టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య మొదలైన వారు ఈ సభలో సభ్యులు. 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు కష్టించి, రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946, డిసెంబర్‌ 9‌తో ప్రారంభించి 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశాలు జరగగా, ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాత ప్రతిపై వెచ్చించింది. రాజ్యాంగ రాత ప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్క రించింది. ఏడు దశాబ్దాల కిందట 26నవంబర్‌ 1949‌నాడు డాక్టర్‌ ‌బాబు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన సర్ధార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌ప్రతిపాదించి ప్రవేశ పెట్టారు. అందమైన చేతిరాతతో హిందీ, ఇంగ్లీషు ప్రతులను, 24 జనవరి 1950న 284 మంది సభ్యుల సంతకాలతో అమోదించారు. రెండు రోజుల తర్వాత 26 జనవరి 1950నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ‌రాజేంద్ర ప్రసాద్‌… ‌మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’ను స్వాతంత్య్ర సమర యోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్‌ 26‌న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా… రాజ్యాంగ దినోత్సవం నిర్వహించ లేదు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ‌రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్‌ 26, 2015‌న జరుపుకుంది. ప్రతీ ఏటా నవంబర్‌ 26‌న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్‌ 19‌న గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. అలా 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక లక్ష్యం… సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరరికీ అంచించడం. ఈ లక్ష్యము ప్రజల హక్కులకు రూపాన్ని ఇచ్చింది. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల, సమర్ధ వంతమైన న్యాయాన్ని ఇవ్వగల వ్యవస్థ రూప కల్పనే రాజ్యాంగం. చట్టము ముందు సమాన పరిగణన, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాల అధ్యయనము ద్వారా బారతీయ న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతము చేయడం జరిగింది. రాజ్యాంగ అమలు ద్వారా పౌర హక్కుల అవగా హనను వివిధ దశల్లో విస్తృత పరిచారు. ప్రాధమిక హక్కులకు పెద్దపీట వేశారు. వీటన్నింటికీ రక్షణ న్యాయవవస్థ కాబట్టి రాజ్యాంగ ముసాయిదా సంతకాల రోజును జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరపడానికి ఎంచుకున్నారు.

ప్రభుత్వాలు చట్టాలు ప్రజా వ్యతిరేకముగా ఉన్నా, రాజ్యాంగాన్ని అతిక్రమించేవిగా ఉన్నా, అవి చెల్లవని చెప్పే అధికారము రాజ్యాంగ ధర్మాసనాలకు ఉన్నది .. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులకు కూడా చట్ట హోదా ఉంటుంది. అయితే కోర్టులలో కేసుల నమోదు రేటు రాను రాను పెరుగుతున్నది. న్యాయమూర్తుల కొరత ఉన్నందున కేసుల పరిష్కారము సత్వరము జరుగక, చాలా కాల వ్యవధి పడుతున్నది. ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగ కూడదన్న సూత్రము న్యాయ వ్యవస్థకు పునాది. అందుకే న్యాయము అందడంలో జాప్యము కారణంగా చాలా మంది కోర్టుల్ని ఆశ్రయించడానికి సందేహిస్తున్నా రనేది వాస్తవం. అయితే న్యాయ వాద వృత్తిలో ఉన్న వారంతా చట్టబద్ధముగా సమస్యలను పరిష్కరించు కోవాల్సిందిగా ప్రజల్ని చైతన్య పరచాల్సిన అవసరము ఉన్నది. ఈ మేరకు ప్రజల్లో విశ్వాసము పెంపొందించ గలగాలి. భాదితుల హక్కులను కాపాడటం. తీవ్రమైన నేరాలను నివారించడం, ప్రపంచంలోని శాంతి, భద్రతలకు భంగం వాటిల్లకుండా చేయడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యయుత కృషి జరగాలి. అప్పుడే న్యాయ పరిరక్షణ సాకారం అవుతుంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply