హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘన విజయం సాధించి, విజయ పరంపరను కొనసాగించి తిరుగు లేదని నిరూపించారు. అనూహ్యంగా, అకాలంగా మంత్రి పదవికి, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికను చేజేతులా ఆహ్వానించి, అన్ని అడ్డంకులను అధిగమించి, నియోజక వర్గ ఓటర్లు తన తోనే ఉన్నారని మరోసారి ఋజువు చేశారు. ఏడవసారి గెలుపొంది, వరుస విజయాలతో తన నియోజక వర్గంలో సడలని పట్టును మరోమారు చాటి చెప్పారు. ఆరుసార్లు తెరాస అభ్యర్థిగా విజయం సాధించి, పార్టీ శాసన సభా పక్ష నేతగా, తెలంగాణ రాష్ట్ర ప్రప్రథమ ఆర్థిక మంత్రిగా, పలు శాఖల మంత్రిగా పదవులు నిర్వహించిన ఈటెల రాజేందర్ ఈ సారి పార్టీ మార్చి, కారును వీడి, భాజాపా లో చేరి, కమలం చిహ్నం తో పార్టీ ఏదైనా ప్రజలు తన వెంటే అని స్పష్టమైన తీర్పు చెప్పించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించిన విషయం లోక విదితమే. కేసిఆర్ తో పాటు తెరాస పార్టీ వ్యవహారాల్లో, ప్రభుత్వంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2004లో మొదటిసారి కమలా పూర్ టిడిపిలో ఎన్టీఆర్ కు సన్నిహి తునిగా సీనియర్ నేత గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు తొలి సారి ఎన్నికయ్యారు.
నియోజక వర్గాల పునర్విభజనలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పోటీ చేసి, ఈటల 56,752 ఓట్లు సాధించి, ప్రస్తుత బి సి కమిషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు వకులాభరణం కృష్ణ మోహన్ రావు 41,717 ఓట్లు పొందగా, ఆయనపై గెలిచారు. 2010 ఉప ఎన్నికలో రాజేందర్ 93026 ఓట్లు సాధించి, దామోదర్ రెడ్డి13799 ఓట్లు పొందగా, 79,227 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2914లో రాజేందర్ 95315 ఓట్లు మూట కట్టుకుని, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డి 38278 ఓట్లు రాబట్టు కోగా, పై 57,037 ఓట్ల మెజార్టీతో గెలు పొందారు. 2018 ఎన్నికల్లో ఆయన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రాజేందర్ కు.1,04,840 వోట్లు రాగా, కౌశిక్ రెడ్డి 61,121 ఓటర్ల మద్దతు సాధించారు.
తెరాస సీనియర్ నేతగా, పార్టీ అధినేత కేసిఆర్ కు ప్రధాన విశ్వసనీయ అనుచరునిగా, దాదాపు పార్టీ, ప్రభుత్వంలో కేసిఆర్ తర్వాత స్ధానంలో ఉంటూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం 2014లో కేసిఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగ దారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా ఈటల రాజేందర్ కు, కేసిఆర్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. కారణాలు ఏవైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు జరగనే లేదు. క్యాబినెట్ సమావేశాలకు ఆయనను కావాలనే దూరంగా ఉంచడం జరిగింది.
ఈ పరిస్థితులలో…ఈటలపై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021, మే 1న ఆయనము నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నుండి ముఖ్యమంత్రి తప్పించారు. ఆయనను 2 మే 2021న మంత్రివర్గం నుంచి తొలగించారు. విధిలేని పరిస్థితులలో ఈటల రాజేందర్ తెరాసను వీడి, పదవులకు రాజీనామా చేయ సంకల్పించి, పలువురు ముఖ్య నేతలను కలిసి చర్చించారు. నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. చివరకు భాజాపా లో చేరడానికి సిద్ధపడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను 31 మే 2021న కలిసి, టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 12 జూన్ 2021న రాజీనామా చేశారు. ఆయన 4 జూన్ 2021లో ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఉప ఎన్నికకు అలా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజాప్రతినిధిగా ఈటల ప్రజలతో మమేకమై, అభిమానాన్ని చూరగొని, ఆరు సార్లు శాసన సభకు ఎన్నికయ్యారు. 2009 నుండి ఈటల రాజేందర్ కు, తెరాసకు వెన్నుదన్నుగా నిలిచిన హుజురాబాద్ ఓటర్లు అవాంఛిత ఉప ఎన్నికల్లో వ్యక్తిగతంగా రాజేందర్ తమ పై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయక, పార్టీ మార్చినా, గుర్తు మార్చుకున్నా, తిరిగి పట్టం కట్టారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494