Take a fresh look at your lifestyle.

హుజురాబాద్‌లో ఈటల వర్సెస్‌ ‌టిఆర్‌ఎస్‌ ?

‌హుజూరాబాద్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌నేడు రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల పద్నాలుగున ఢిల్లీలో కాషాయ కండువ కప్పుకోవడానికి ముందు 12వ తేదీన్నే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాడనుకుంటున్నారు. ఈటల రాజీనామాతో మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యమవనుంది. ఖాలీ అవనున్న ఈ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. కాగా, తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో తానే నిలబెట్టుకోవాలన్న దిశగా ఈటల మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ అయినప్పటి నుండి తీవ్రంగా కృషిచేస్తున్నారు. అన్యాయంగా తనను మంత్రివర్గం నుండి తీసివేయటమే కాకుండా, తనపై అనేక అక్రమ కేసులుపెట్టి తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్ని అధికారపార్టీ చేస్తున్నదంటూ అయన ఇప్పటికే తన నియోజకవర్గాన్ని చుట్టబెట్టారు. టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆయన వెంటే ఉంటామంటూ హామీల వర్షం కురిపిస్తుండడంతో హుజురాబాద్‌ ‌రాజకీయాల్లో విచిత్రమైన మార్పు చోటుచేసుకుంది.

ఇప్పటికే ఆయన వెంట మాజీ శాసనసభ్యుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ ‌మాజీ జెడ్‌పి చైర్‌పర్సన్‌ ‌తుల ఉమ, గండ్ర నళినితో పాటు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన టిఆర్‌ఎస్వీ అధ్యక్షులు వెంట నడుస్తుండగా ఇప్పటి వరకు మూడు వందలకు పైగా టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పార్టీకి రాజీనామాచేసి ఆయనకు మద్దతు నిలిచారు. తాజాగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు పలుచోట్ల మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టి, నుదుట కుంకుమను దిద్దుతూ తమ అండ ఉంటుందని అభయమిచ్చారు. తెలంగాణ సాధనలో పద్నాలుగేళ్ళు వెన్నంటి ఉన్న తనను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటికి పంపిన కెసిఆర్‌తో ఢీ కొనాలన్నదే ఆయన లక్ష్యం ఇప్పుడు. తన రాజీనామాతో ఇక్కడ ఏర్పడబోయే ఖాలీలో పోటీ తనకు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి మధ్యలోనే ఉంటుందంటున్నాడు రాజేందర్‌. అం‌దుకే ఆయన్ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్‌ ‌చేసిన తర్వాత ఆచితూచి అడుగులు వేయడం ప్రారంభించారు.

అన్ని వర్గాల ప్రజలను, విభిన్న పార్టీల అధినేతలను కలుసుకుంటూ, వారితో తన అభిప్రాయాలను పంచుకుంటూ వొస్తున్నాడు. కెసిఆర్‌ ‌లాంటి కొండను ఢీ కొనాలంటే ఏక వ్యక్తిగా తన శక్తి సరిపోదని గ్రహించిన ఈటల దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీలో చేరడం ద్వారా తన బలాన్ని ఇనుమడింపజేసుకోవాలన్న దిశగా పావులు కదుపుకుంటూ వొస్తున్నారు. టిఆర్‌ఎస్‌తో నేరుగా ఢీ కొనడం ద్వారా తన శక్తి ఏమిటో, తనకున్న పలుకుబడి ఏమిటన్నది కెసిఆర్‌కు తెలియజెప్పాలన్నదే ఆయన అభిప్రాయం. అయితే బిజెపిలో చేరడం ద్వారా ఆయన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఒక పెద్ద పార్టీని తనకు పోటీ లేకుండా చేసుకోవడమే కాకుండా, తన గెలుపుకు దోహద పడే విధంగా తిప్పుకోగలిగాడు. అలానే బిజెపిలో చేరికకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడానికి ముందే మరో పోటీ పార్టీ కాంగ్రెస్‌ అ‌గ్రశ్రేణి రాష్ట్ర నాయకులతో ఆయన ఇప్పటికే ఒకసారి చర్చించడమైంది. మల్లు భట్టి విక్రమార్క, డి. శ్రీనివాస్‌ ‌లాంటి సీనియర్‌ ‌నేతలను కలిసి, కెసిఆర్‌తో అమీతుమీ తేల్చుకునే అవకాశం తనకివ్వాలన్న దిశగానే చర్చించి ఉండవొచ్చనుకుంటున్నారు. ఏ పార్టీ అభ్యర్థి నిలబడినా టిఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక వోటు చీలుతుందన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. విచిత్రమేమంటే అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ‌పరిస్థితి ఏమీ బాగులేదు.

ఒకరి తర్వాత ఒకరు సీనియర్‌ ‌జాతీయ స్థాయి నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాహుల్‌గాంధీకి అత్యంత ఆత్మీయుడిగా ఉన్న జితిన్‌ ‌ప్రసాద్‌ ‌కాషాయ కండువ కప్పుకోగా, కపిల్‌ ‌సిబాల్‌ ‌పొమ్మంటే పోతామంటూ అగ్రనేతలతో వివాద పడుతున్నాడు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష స్థానం విషయంలో చాలా కాలంగా గ్రూపులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నాయకులు ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు. ఇక ఉప ఎన్నిక వొస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంలో, ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ ‌నేతలు రెండు వర్గాలుగా మారారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఈటలపై పోటీచేసి ఓడిన పాడి కౌశిక్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు వదంతులు వొచ్చాయి. కాగా ఆయన్ను విభేదిస్తున్నవారు ఆయన టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నాడని, ఆ పార్టీ స్క్రిప్ట్ ‌ఫాలో అవుతున్నాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.

కాగా కౌశిక్‌రెడ్డి మాత్రం తానే పోటీ అభ్యర్థి అన్న భావనతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఆయన్ను తమ పార్టీలోకి తీసుకుని అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో టిఆర్‌ఎస్‌ ఉన్నట్లు వదంతులు వొచ్చాయి. ఏదిఏమైనా తమ సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకూడదన్న పట్టుదలతో టిఆర్‌ఎస్‌ ఉం‌ది. ఇప్పుటికే నియోజకవర్గంలోని వివిధ మండలాలకు ఇన్‌ఛార్జిలను నియమించి, ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్‌ ఈటల వైపు వెళ్ళకుండా అధిష్టానం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అదే విధంగా బిజెపి కేంద్ర నాయకత్వం తాజాగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యనేతలతో శుక్రవారం సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో విజయపతాకాన్ని ఎగురవేయడంతోపాటు, హుజురాబాద్‌లో దుబ్బాకను పునరావృతం చేయాలన్న గట్టినిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్‌ ‌తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ త్రికోణ పోటీనా, ముఖాముఖి పోటీ ఉంటుందా అన్నది తేలనుంది.

Leave a Reply