- హుజూరాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ
- ఎన్నికలప్పుడు బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నట్లు నేతల వెల్లడి
కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో తెలంగాణ బిజెపి నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశం15 నిమిషాల పాటు సాగింది. తెరాస నుంచి బయటకి వొచ్చి బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరిన రోజే అమిత్ షాను కలవాలని ప్రణాళిక ఉండినప్పటికీ కుదరక పోవటంతో బుధవారం అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని కలవటం జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుస్తారనే సర్వే రిపోర్టస్ వొచ్చాయన్న విషయాన్ని అమిత్‌షాకు తెలిపామని సమావేశం అనంతరం నాయకులు మీడియాకి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగబోయే బహిరంగ సభకు అమిత్ షా వొస్తానని తమకు హామీ ఇచ్చారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రకు కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను ఆహ్వానించామని ఈటల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుందని ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా బీజేపీ సిద్ధమేనని చెబుతూ టీఆరెస్ పార్టీ ఎన్నికలకి భయపడుతుందని, వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదని ఈటల రాజేందర్ అన్నారు.
తెరాస ఎంత డబ్బులు పంచినా..అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందామని, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపిద్దామనే నినాదంతో ఎన్నికలలో తలపడతామన్నారు. అవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసం పాదయాత్ర చేపడుతున్నామని ఈటల అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని తెలిపారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారని, ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వొస్తానని చెప్పారని బండి మీడియాకి తెలిపారు. తెరాస ఎంత డబ్బు ఖర్చు చేసినా ఈసారి గెలిచేది బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ మాత్రమే కాదు ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ మాత్రమే అని బీజేపీలో కొత్తగా చేరిన నేత ఈటల రాజేందర్ అన్నారు.
సమావేశంలో ప్రత్యేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కొద్దిసేపు సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల అంశం వీరి మధ్య చర్చకొచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కష్టపడాలని అమిత్ షా ప్రతేకంగా సూచించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అమిత్ షా తెలుపుతూ.. గెలుపుకోసం శాయశక్తులా కృషి చేయాలని దిశా నిర్ధేశం చేసారు. బండి సంజయ్ ఆగస్టు 9 నుండి చేపడుతున్న పాదయాత్ర వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, మాజీ తెరాస నేత మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.